Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

‘పాఠశాల విద్య’కు పైసల్లేవు!

ABN , Publish Date - Mar 04 , 2024 | 03:32 AM

పాఠశాల విద్యాశాఖ నిధుల లేమితో కటకటలాడుతోంది. ప్రతినెలా అప్పులతో నెట్టుకొస్తున్న జగన్‌ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యారంగాన్ని కూడా అప్పులకుప్పగా మార్చేసింది.

‘పాఠశాల విద్య’కు పైసల్లేవు!

అప్పులతో నెట్టుకొస్తున్న జగన్‌ ప్రభుత్వం

బడ్జెట్‌ కేటాయింపులు పుస్తకాలకే పరిమితం

నిధుల్లేక విద్యాకానుక చెల్లింపులకు బ్రేక్‌

2023-24లో రూ.600 కోట్ల బకాయిలు

కనీసం 50ు చెల్లించాలన్న కాంట్రాక్టర్లు

డబ్బులిస్తేనే వచ్చే విద్యాసంవత్సరానికి

కానుక సామగ్రి సరఫరా అంటూ మెలిక

పాఠ్యపుస్తకాల కాగితం 200 కోట్ల అప్పు

టీఎన్‌పీఎల్‌కు రూపాయి ఇవ్వని సర్కారు

సమగ్రశిక్షలో టీచర్ల జీతాలకూ కటకట

నిధుల ఆదా పేరిట వాట్స్‌పలో ప్రశ్నపత్రాలు

టీచర్లు గగ్గోలు పెడుతున్నా పట్టని అధికారులు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పాఠశాల విద్యాశాఖ నిధుల లేమితో కటకటలాడుతోంది. ప్రతినెలా అప్పులతో నెట్టుకొస్తున్న జగన్‌ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యారంగాన్ని కూడా అప్పులకుప్పగా మార్చేసింది. వార్షిక బడ్జెట్‌లో చేసిన కేటాయింపులను పుస్తకాలకే పరిమితం చేసి, వీలైనంత మేర అప్పులతో ఆ శాఖను నడిపిస్తోంది. చివరికి పాఠ్యపుస్తకాలకు కాగితం సరఫరా చేసిన తమిళనాడు న్యూస్‌ప్రింట్‌కు బకాయిలు పెట్టి, ఆ రాష్ట్రం లేఖలు రాసే స్థాయికి తీసుకొచ్చింది. ఇప్పుడు విద్యా కానుక పథకాన్ని కూడా అప్పులపై ఆధారపడి అమలుచేస్తోంది. ‘ఈ ఏడాది డబ్బులు వచ్చే ఏడాది’ అనే విధానంతో చెల్లింపులు ఆపేసింది. దీంతో విసిగిపోయిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. కనీసం 50శాతం బకాయిలు చెల్లిస్తేనే వచ్చే ఏడాది విద్యాకానుక వస్తువులు సరఫరా చేస్తామని తేల్చిచెప్పారు. దీంతో రూ.600 కోట్ల బకాయిల్లో ఇప్పటికిప్పుడు రూ.300 కోట్లు ఎలా కట్టాలంటూ అధికారులు తలలు పట్టుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి పంపిణీ చేయాల్సిన విద్యాకానుక వస్తువులకు కొనుగోలుకు టెండర్ల ఎత్తివేసిన విషయం తెలిసిందే. ఎన్నికల ముందు తమకు కావాల్సినవారికి కాంట్రాక్టు కట్టబెట్టాలనుకోవడం ఒక కారణమైతే, గతేడాది విద్యాకానుక బకాయిలు పెండింగ్‌ పెట్టడం మరో కారణంగా కనిపిస్తోంది. 2022-23 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం రూ.1,042 కోట్లతో 39.95 లక్షల విద్యాకానుక కిట్లు కొనుగోలు చేసింది. 19మంది కాంట్రాక్టర్లు వాటిని సరఫరా చేశారు. పాఠ్యపుస్తకాలకు ప్రత్యేకంగా టెండర్లు పిలిచారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫాం కుట్టుకూలీ పోగా రూ.720 కోట్లతో బూట్లు, బ్యాగులు, బెల్టులు, యూనిఫాం, సాక్సులు కొనుగోలు చేసింది. అందులో ఇప్పటివరకూ రూ.120 కోట్లు మాత్రమే కాంట్రాక్టర్లకు చెల్లించింది. ఆ బకాయిలు ఇవ్వకపోతే వచ్చే ఏడాదికి వస్తువులు సరఫరా చేయలేమని వారు చేతులెత్తేశారు. దీంతో టెండర్లకు మంగళం పాడేసి, ఎవరొచ్చినా నామినేషన్‌పైనే కాంట్రాక్టు అప్పగిస్తామనే స్థాయికి పాఠశాల విద్యాశాఖ దిగొచ్చింది.

పాఠ్యపుస్తకాలకూ ఇదే తీరు

విద్యాకానుకలో ఇచ్చే పాఠ్యపుస్తకాల వరకూ ప్రత్యేకంగా టెండర్లు పిలుస్తారు. ఇందుకోసం రూ.253 కోట్లు ఖర్చు అవుతోంది. ఈ విద్యా సంవత్సరంలో ఇచ్చిన పుస్తకాలకు గతేడాది తమిళనాడు ప్రభుత్వ రంగ సంస్థ అయిన తమిళనాడు న్యూస్‌ప్రింట్‌ అండ్‌ పేపర్‌ లిమిటెడ్‌ (టీఎన్‌పీఎల్‌) కాగితం సరఫరా చేసింది. గత పదేళ్లుగా ఆ సంస్థే కాగితం ఇస్తోంది. గతేడాది ఇచ్చిన కాగితానికి రూ.200 కోట్లు చెల్లించాల్సి ఉండగా, జగన్‌ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. పైగా ఈ ఏడాది పుస్తకాలు ప్రింటింగ్‌ చేసే ప్రింటర్లే కాగితం తెచ్చుకోవాలని ప్రభుత్వం కొత్త నిబంధన పెట్టింది. దీనిపై ఏపీ జ్యుడీషియల్‌ కమిషన్‌కు టీఎన్‌పీఎల్‌ లేఖ రాసింది. బకాయిలు చెల్లించకపోగా, దీర్ఘకాలం నుంచి ఉన్న కాంట్రాక్టు వదులుకోవడం ఏమిటని నిలదీసింది. దీంతో ఏంచేయాలో పాలుపోని జగన్‌ ప్రభుత్వం... చెన్నైకి పం పే తెలుగు గంగ నీళ్లకు తమిళనాడు ప్రభుత్వం బకాయి ఉంద ని, ఆ నిధులతో సర్దుబాటు చేసుకోవాలని చెప్పి తప్పించుకుంది.

సమగ్రశిక్షలో జీతాలకు కష్టం

కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సమగ్రశిక్షలో జీతాలకూ డబ్బుల్లేక పాఠశాల విద్యాశాఖ నానాపాట్లు ప డుతోంది. ఈ విద్యా సంవత్సరంలో సమగ్రశిక్ష ఉద్యోగులకు ప్రతినెలా జీతాలు అనే విధానం నుంచి మూడు నెలలకోసారి అనే పద్ధతికి తీసుకెళ్లింది. 3 నెలలకోసారి జీతాలిస్తే ఎలా బతకాలంటూ ఉద్యోగులు రోడ్డెక్కే వర కూ ప్రభుత్వం స్పందించలేదు. వారు పలు డిమాండ్ల తో సమ్మెలోకి వెళ్లాక అప్పుడు జీతాలు చెల్లించింది. ఇప్పటికీ సమగ్రశిక్షలో అధికారులకు తరచూ జీతాలు ఆపేస్తున్నారు. కేంద్రం నుంచి ఏటా రూ.3వేల కోట్ల వ రకూ నిధులొస్తున్నా, వాటిని ఇతర అవసరాలకు వాడేసి, ఉద్యోగుల జీతాలు పెండింగ్‌లో పెడుతున్నారు.

Updated Date - Mar 04 , 2024 | 03:32 AM