Share News

ఊరికొచ్చి ఓటెయ్యండి

ABN , Publish Date - Apr 05 , 2024 | 05:13 AM

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ప్రచారం సరిహద్దులు దాటింది. తెలంగాణలో.. ముఖ్యంగా హైదరాబాద్‌ మహానగరంలో జోరుగా ప్రచారం సాగుతోంది. అక్కడి పార్లమెంట్‌ ఎన్నికల సమావేశాలను మించి ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలకు సంబంధించి వరుస ఆత్మీయ సమావేశాలు జరుగుతున్నాయి. కూకట్‌పల్లి,

ఊరికొచ్చి ఓటెయ్యండి

హైదరాబాద్‌లో రాష్ట్ర అభ్యర్థుల ప్రచారం

నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమావేశాలు

కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఇతర ప్రాంతాల్లో

భారీగా ఉన్న ఆంధ్రా ప్రాంత ఓటర్లు

రాష్ట్రంలో ఓటేసేందుకు చాలామంది ఆసక్తి

రవాణా సదుపాయం ఏర్పాటుకు అభ్యర్థులు రెడీ

ఎన్నికల ముందు సొంతూళ్లకు ప్రత్యేక బస్సులు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ప్రచారం సరిహద్దులు దాటింది. తెలంగాణలో.. ముఖ్యంగా హైదరాబాద్‌ మహానగరంలో జోరుగా ప్రచారం సాగుతోంది. అక్కడి పార్లమెంట్‌ ఎన్నికల సమావేశాలను మించి ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలకు సంబంధించి వరుస ఆత్మీయ సమావేశాలు జరుగుతున్నాయి. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లితో పాటు ఆంధ్రా ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న సమావేశాల్లో స్వయంగా అభ్యర్థులు పాల్గొంటున్నారు. నామినేషన్ల దాఖలు అనంతరం ఏపీ ఎన్నికల ప్రచారంలో మరింత బిజీగా ఉంటామని భావిస్తున్న కొందరు అభ్యర్థులు ముందస్తుగా హైదరాబాద్‌లో ఉండే ఓటర్లతో సమావేశమవుతున్నారు. ఓటర్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లో ఉండే తమ నియోజకవర్గ ఓటర్ల గుర్తింపునకు ఆయా పార్టీల అభ్యర్థులు భారీ కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. పార్టీ నేతల ద్వారా గ్రామాల వారీగా ఇతర ప్రాంతాల్లో ఉండే ఓటర్ల వివరాలు, వారి ఫోన్‌ నంబర్లు సేకరిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న కొందరు కూడా తమ నియోజకవర్గానికి చెందిన ఓటర్ల సమాచారం అభ్యర్థులు/వారి అనుచరులకు ఇస్తున్నారు. వారందరితో వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రచార కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నారు. ఆత్మీయ సమవేశం నిర్వహించే తేదీ, వేదిక, తదితర వివరాలు పోస్ట్‌ చేస్తున్నారు. అందరూ హాజరయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కువ మంది ఓటర్లు ఉన్న చోట సమావేశాలు నిర్వహిస్తూ ఇతర ప్రాంతాల్లో ఉన్న వారిని అక్కడికి ఆహ్వానిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే వారికి ఆహ్వానం పంపుతున్నారు. హైదరాబాద్‌లో ఉభయ గోదావరి జిల్లాలు, అనంతపురం, శ్రీకాకుళం, గుంటూరు తదితర ఉమ్మడి జిల్లాల ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఆయా జిల్లాల్లో అభ్యర్థులు ఇక్కడ సమావేశాల నిర్వహణకు ఆసక్తి చూపుతున్నారు.

ఏపీలో ఓటేసేందుకు సై

హైదరాబాద్‌లో ఉంటున్న కొందరికి ఏపీలో ఓట్లు ఉండగా, మరికొందరికి రెండు రాష్ర్టాల్లో ఓటు హక్కు ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఓటున్న వారు అక్కడికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. రెండు చోట్లా ఓటున్న వాళ్లలో మెజార్టీ ప్రజలు ఏపీకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీలో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. దీంతో హైదరాబాద్‌లో ఓటు వేయడం కంటే సొంతూరులో రెండు ఓట్లు వేయవచ్చన్నది వారి అభిప్రాయం. ఆత్మీయ సమావేశాల్లో ఆయా అభ్యర్థులు.. ఓటు హక్కు వినియోగించుకోవాలని, తమ పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేస్తూ భోజనాలు పెడ్తున్నారు. ఎన్నికలకు రెండు, మూడు రోజుల ముందు నుంచే రవాణా సదుపాయం కల్పిస్తామని చెబుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేస్తామని, హైదరాబాద్‌లో ప్రాంతాల వారీగా ఓటర్ల సంఖ్యను బట్టి బస్సులు అందుబాటులో ఉంటాయని, ఆ వాహనం ఇన్‌చార్జ్‌ వివరాలూ ఇస్తామని సమావేశాల్లో చెబుతున్నారు. రవాణా ఖర్చులతో పాటు ఓటుకింత ఇచ్చేందుకూ కొందరు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్‌లో కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపుర్‌, ఎల్‌బీనగర్‌, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాల పరిధిలో ఏపీకి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉంటారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఆత్మీయ సమావేశాలు జరుగుతున్నాయి. కూకట్‌పల్లిలో గురజాల, మాచర్ల, బాపట్ల, పెనుమలూరు, సత్తెనపల్లి తదితర నియోజకవర్గాల సమావేశాలు నిర్వహించారు. ఒక్కో మీటింగ్‌కు 3 నుంచి 5 వేల మంది హాజరవుతున్నారు. ఈ నెల 7వ తేదీన మైలవరం, కొండేపి నియోజకవర్గాల మీటింగ్‌లు జరగనున్నాయి. ఇప్పటి వరకు ఆదివారం సమావేశాలు జరగగా.. ఇకనుంచి శనివారమూ మీటింగ్‌లు నిర్వహించేలా కొందరు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏపీ భవిష్యత్తు కోసం సొంతూళ్లకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని, తమను ఆదరించాలని కోరుతున్నారు. హైదరాబాద్‌లో ఏమైనా ఇబ్బందులున్నా పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని భరోసా ఇస్తున్నారు.

Updated Date - Apr 05 , 2024 | 05:13 AM