Share News

26న అనంత నుంచి ప్రచారం

ABN , Publish Date - Feb 17 , 2024 | 03:29 AM

ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచే ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరిస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ తెలిపారు.

26న అనంత నుంచి ప్రచారం

మేనిఫెస్టో ప్రకటనా అక్కడే

హాజరుకానున్న ఖర్గే, ప్రియాంక, రేవంత్‌, సిద్దు: మాణిక్కం ఠాగూర్‌

అనంతపురం, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచే ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరిస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ తెలిపారు. అనంతపురం నగరంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన పార్టీ ఉమ్మడి జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా రానున్న సార్వత్రిక ఎన్నికలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అందులో భాగంగా ఈ నెల 26న ఉమ్మడి జిల్లా నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, సిద్దరామయ్య, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల హాజరవుతారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభ వేదికపై ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తాం. పోలవరం, రాజధాని, ప్రత్యేక హోదా అంశాలు మేనిఫెస్టోలో పొందుపరిచాం. దివంగత వైఎ్‌సఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి విధేయుడు. ఆయన నిజమైన వారసురాలు వైఎస్‌ షర్మిల. మా పార్టీ అజెండా చాలా క్లియర్‌గా ఉంది. రాబోయే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తాం’ అని ఆయన విశ్వాసాన్ని ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ చనిపోయిందంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి రఘువీరారెడ్డి తీవ్రంగా స్పందించారు. ‘పగటిపూట ఖూనీలు చేసేవాళ్లు కూడా మా పార్టీ గురించి మాట్లాడితే ఎలా? దురదృష్టం కొద్దీ మూడు ప్రాంతీయ పార్టీలు రాష్ర్టాన్ని నాశనం చేశాయి. విభజన హామీలను అమలు చేయడంలో పాలకులు విఫలమయ్యారు’ అని రఘువీరా ఆరోపించారు.

Updated Date - Feb 17 , 2024 | 03:29 AM