Share News

సూది పోటుకు బైబై..!

ABN , Publish Date - Jan 07 , 2024 | 04:12 AM

రక్త పరీక్షలంటే అందరికీ భయమే..! జేబుకు చిల్లు పడడంతోపాటు సూది గుచ్చినప్పుడు కలిగే బాధను తలచుకుని హడలిపోతుంటారు.

సూది పోటుకు బైబై..!

మధుమేహ రోగులకు అద్భుత వరం

చెమటతో షుగర్‌ పరీక్ష చేసే పరికరం

నిమిషంలోనే ఫలితం.. ఖర్చు కూడా తక్కువ

పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపయోగం

‘ఆంధ్రజ్యోతి’తో ఆవిష్కర్త శ్రీనివాసరావు

పేటెంట్‌ హక్కులు ఇచ్చిన కేంద్రం

(ఏలూరు/ఉంగుటూరు - ఆంధ్రజ్యోతి)

రక్త పరీక్షలంటే అందరికీ భయమే..! జేబుకు చిల్లు పడడంతోపాటు సూది గుచ్చినప్పుడు కలిగే బాధను తలచుకుని హడలిపోతుంటారు. అందరి పరిస్థితి ఎలా ఉన్నా మధుమేహ వ్యాధిగ్రస్తులకు మాత్రం సూ దిపోటు తప్పదు. టైప్‌-1 మధుమేహ బాధితులైతే రోజుకు నాలుగు సార్లు పరీక్షించుకుని ఇన్సులిన్‌ తీసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మధుమేహ పరీక్షలు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ముఖ్యంగా పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఇది ఆర్థిక భారమే. ఈ బాధలన్నింటికీ స్వస్తి పలికేలా.. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన ఊసా చిరంజీవి శ్రీనివాసరావు అద్భుతమైన పరికరాన్ని ఆవిష్కరించారు. ఎలకో్ట్రకెమికల్‌ అనే ఈ పరికరంతో కేవలం చెమట చుక్కతో.. అదికూడా ఒకే ఒక్క నిమిషంలో శరీరంలోని గ్లూకోజ్‌ స్థాయిని నిర్ధారించవచ్చు. చిరంజీవి నాలుగేళ్లపాటు శ్రమించి రూపొందించిన ఈ పరికరానికి కేంద్ర ప్రభు త్వం ఆమోదం తెలిపి పేటెంట్‌ హక్కును కూడా కట్టబెట్టింది. ఇంతటి ఘనత సాధించిన శ్రీనివాసరావు తెలుగువారే కావడం గర్వకారణం. ఇది వినియోగంలోకి వస్తే.. పేద, మధ్యతరగతికి ఎంతగానో ఉపయోగపడనుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆయన కాన్పూర్‌ ఐఐటీలో సీనియర్‌ ప్రాజెక్టు సైంటి్‌స్టగా పనిచేస్తున్నారు.

‘డయాబెటిస్‌ విత్‌ స్వెట్‌ టెస్ట్‌’ ప్రయోగానికి సంబంధించి

చిరంజీవి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపిన వివరాలు ఇవీ

ఎలకో్ట్రకెమికల్‌ పరికరం ప్రత్యేకతను వివరిస్తారా?

సూదులతో గుచ్చి రక్త నమూనాలు సేకరించాల్సిన అవసరం లేకుండా, కేవలం చెమట బిందువులతో పరీక్షలు చేయవచ్చు. నొప్పిలేని ప్రక్రియ ఇది.

ఈ ఆలోచన ఎలా వచ్చింది..?

చాలా కాలంగా ఈ సూదుల ద్వారా చేస్తున్న పరీక్షలతో మధుమేహ బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధుమేహ నిర్ధారణ పరీక్ష చూసేందుకు సులువుగానే ఉన్నా.. కొన్ని వర్గాలు, వయస్కుల వారి కి ఇది రానురానూ ఒక భయానక వాతావరణాన్ని కలిగిస్తుంది. తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌లో పర్యటించినపుడు ఆ పరిస్థితులను కళ్లారా చూశాను. కాబట్టే ఒక కొత్త ఆవిష్కరణ దిశగా ఆలోచించాను.

ఫలితం ఒకేలా ఉంటుందా..?

కచ్చితంగా...! అదే కదా మరి మా ఘనత. రక్తం, చెమట రెండు పరీక్షల్లోనూ ఫలితం ఒకేలా ఉంటుంది కాబట్టే సూదులకు స్థానం లేని మా ఈ ప్రయోగానికి పేటెంట్‌ కూడా పొందాం.

బాధితుల్లో చిన్నారులు కూడా ఉన్నారంటారా?

చిన్నారులతో పాటు వృద్ధులు, ఇతర వయస్సులు కూడా దీని బాధితులే. కొంతమంది రోగులను పరీక్షించిన తర్వాత ఈ ఎలకో్ట్రకెమికల్‌ పరికరాన్ని కనుగొనగలిగాం. నేను టీం లీడర్‌గా వ్యవహరించిన ఈ బృం దంలో నచికేత్‌ ఆశిష్‌ గోఖలే, సిద్ధార్థ పండా ఉన్నారు.

18 ఏళ్లలోపు పిల్లలకు మధుమేహం వస్తుందా?

చాలా అవకాశాలున్నాయి. 18 ఏళ్లలోపు పిల్లలకు వచ్చే వ్యాధి టైప్‌-1గా నిర్ధారణ అయితే, రోజుకి నాలుగు సార్లు పరీక్షించుకొని ఇన్సులిన్‌ తీసుకోవాలి.

మదుమేహ రోగులకు సూచనలేమైనా ఇస్తారా..?

డైట్‌ (ఆహారం), వయస్సు, శారీరక శ్రమ ఇలాంటివన్నీ మధుమేహం రావడానికి కారణం కావచ్చు. అందుకే ప్రతీ ఒక్కరూ కనీసం ఏడాదికి ఒక్కసారైనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.

మధుమేహం వారసత్వంగా సంక్రమిస్తుందా?

అందరికీ వచ్చే అవకాశం లేదు. అది అపోహ మాత్రమే.

పేటెంట్‌ హక్కు ప్రక్రియ ఎలా సాగింది?

ప్రయోగ దశలో ఉండగానే మా ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా దరఖాస్తు చేశాం. తొలుత మా ప్రయోగాన్ని పరిశీలించిన తర్వాత మరిన్ని వివరాలు కోరారు. పూర్తి సమాచారం అందించాం. రెండేళ్ల తర్వాత మేం రూపొందించిన ‘ఎలకో్ట్ర కెమికల్‌ డివైస్‌ ఫర్‌ గ్లూకోజ్‌ డిటెక్షన్‌’కు పేటెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా పేటెంట్‌ కల్పించింది.

కుటుంబ నేపథ్యం, విద్యాభ్యాసం..

మాది నిరుపేద కుటుంబం. తండ్రి భీమయ్య వాచ్‌మెన్‌, తల్లి దుర్గ వ్యవసాయ కూలీగా పనిచేసి నన్ను, మా అక్కను చదివించారు. ప్రస్తుతం మా తల్లిదండ్రులు సొంత ఊళ్లోనే ఉన్నారు. నారాయణపురంలోని మహాత్మా గాంధీ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌, శ్రీ అరవింద శత జయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి.ఎస్సీ చదివాను. ఆంధ్రా విశ్వ విద్యాలయంలో పీజీ చేశాను. ఆ తర్వాత సెంట్రల్‌ ఎలకో్ట్ర కెమికల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ కారైకుడి (తమిళనాడు)లో పీహెచ్‌డీ పూర్తిచేశాను.

Updated Date - Jan 07 , 2024 | 04:12 AM