Share News

బీవీ నామినేషన్‌

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:35 AM

: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలి రోజే ఎమ్మిగనూరులో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి బీవీ జయ నాగేశ్వరరెడ్డి అట్టహాసంగా నామినేషన్‌ దాఖలు చేశారు.

బీవీ నామినేషన్‌
నామినేషన్‌కు తరలుతున్న టీడీపీ శ్రేణులు

తరలివచ్చిన టీడీపీ శ్రేణులు

పసుపుమయంగా మారిన రహదారులు

జగన్‌కు కౌంట్‌ డౌన్‌ మొదలైంది : బీవీ

ఎమ్మిగనూరు, ఏప్రిల్‌ 18: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలి రోజే ఎమ్మిగనూరులో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి బీవీ జయ నాగేశ్వరరెడ్డి అట్టహాసంగా నామినేషన్‌ దాఖలు చేశారు. ముందుగా ఎమ్మిగనూరు ప్రజల ఆరాద్యదైవమైన నీలకంటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పండితులు ఆశీర్వాదాలు తీసుకున్నారు. అలాగే ట్యాంకు బండ్‌ రోడ్డులో వెలసిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రదక్షణలు చేశారు. అక్కడి నుంచి వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన వేలాది మంది టీడీపీ శ్రేణులతో కలిసి భారీర్యాలీగా సోమప్ప సర్కిల్‌కు చేరుకున్నారు. ర్యాలీలో బీవీకి పట్టణ వాసులనుంచి విశేషస్పందన లభించింది. ప్రజలు ఆయనను పూలమాలతో ముంచెత్తారు. జై బీవీ.. జై టీడీపీ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. కుర్ణీ ఆచారం ప్రకారం చేనేతలు ధరించే టోపీని ధరించి ర్యాలీలో పాల్గొన్న బీవీ, ఎంపీ సంజీవకుమార్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే పద్మశ్రీ మాచాని సోమప్ప ముని మనవడు మాచాని సోమనాథ్‌ సైతం బీవీ నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దారిపొడవున పసుపుజెండాలు రెపరెపలాడాయి. టీడీపీ శ్రేణులు మెడలో పసుపుకండువాలు కప్పుకొని పసుపుజెండాలతో రావడంతో ట్యాంక్‌బండ్‌ రోడ్డు నుంచి సోమప్ప సర్కిల్‌ వరకు ప్రధాన రహదారి పసుపుమయంగా మారింది.

బీవీ నామినేషన్‌ దాఖలు :

టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి, ఎంపీ సంజీవకుమార్‌, పద్మశ్రీ మాచాని సోమప్ప ముని మనవడు మాచాని సోమ్‌నాథ్‌, చేనేత నాయకులతో కలిసి నామినేషన్‌ను దాఖలు చేశారు. తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి చిరంజీవికి టీడీపీ అభ్యర్థి బీవీ రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను అందజేశారు.

బీవీ సతీమణి నిత్యాదేవి నామినేషన్‌ దాఖలు:

టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి సతీమణి బైరెడ్డి నిత్యాదేవి రెండు సెట్ల నామినేషన్‌ను దాఖలు చేశారు. టీడీపీ మహిళా నాయకురాళ్లతో కలిసి ఆమె ఆర్వో చిరంజీవికి రెండు సెంట్ల నామినేషన్‌ పత్రాలను అందజేశారు.

Updated Date - Apr 19 , 2024 | 12:35 AM