Share News

పేదలకు డొక్కు బస్సులే!

ABN , Publish Date - Mar 22 , 2024 | 03:56 AM

పేదల ప్రభుత్వమంటూ గొప్పలు చెబుతారు.. పేదోడు ప్రయాణించే ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచుతారు.. డొక్కు బస్సులు మార్చరు.. కొత్త బస్సులు కొనరు..

పేదలకు డొక్కు బస్సులే!

జగన్‌కు మాత్రం అధునాతన హంగులతో కొత్త వాహనాలు

రూ.25 లక్షల పల్లె వెలుగుకు డబ్బుల్లేవ్‌

సీఎం కోసమేమో 35 కోట్లతో 5 బస్సులు

ఐదేళ్లలో ఒక్క కొత్త బస్సూ కొనని ఆర్టీసీ

పనికిమాలిన వాటిలోనే జనం ప్రయాణం

కొత్త బస్సులు 1,500 వస్తాయంటూ ఏడాదిగా చెబుతున్న ఎండీ, చైర్మన్‌

ఒక్కదానికీ అతీగతీ లేదు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పేదల ప్రభుత్వమంటూ గొప్పలు చెబుతారు.. పేదోడు ప్రయాణించే ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచుతారు.. డొక్కు బస్సులు మార్చరు.. కొత్త బస్సులు కొనరు.. కనీసం పాతవాటికి మరమ్మతులు కూడా సరిగా చేయరు.. కానీ పేదల పక్షపాతి సీఎం కోసం కోట్లాది రూపాయల ఖర్చుతో అత్యాధునిక వసతులతో బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సులు కొంటారు. గత ఐదేళ్లలో పేదలు ప్రయాణించే పల్లె వెలుగు బస్సు ఒక్కటి కూడా కొనుగోలు చేయని సీఎం జగన్మోహన్‌రెడ్డి తన ఎన్నికల ప్రచారం కోసం రూ.35 కోట్ల వ్యయంతో ఏపీఎ్‌సఆర్టీసీతో ఐదు బస్సులు కొనుగోలు చేయించారు. అందులో రెండు బుల్లెట్‌ ప్రూఫ్‌ కాగా మరో మూడు ఆయన సేద తీరేందుకు క్యారవాన్లు.. రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రయాణ అవసరాలు తీర్చి గమ్యం చేర్చే ప్రజా రవాణా సంస్థకు ఉన్న బస్సుల్లో 53 శాతం కాలం చెల్లినవే. గతంలో ఏ ప్రభుత్వమూ పెంచనంతగా ప్రయాణ చార్జీలు పెంచి ఏడాదికి రెండు వేల కోట్ల భారం మోపిన జగన్‌.. ఈ ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్క కొత్త బస్సు కూడా కొనుగోలు చేయలేదు. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆర్టీసీ చైర్మన్‌ మల్లికార్జునరెడ్డి, ఎండీ ద్వారకా తిరుమలరావు కొత్త బస్సులు అవిగో ఇవిగో అని చెబుతూవచ్చారు. ఇప్పటికే 1,500 బస్సులు కొన్నామని.. వాటికి బాడీ నిర్మాణం పూర్తయ్యాక జనవరిలో రోడ్డెక్కుతాయని పలుమార్లు చెప్పారు. జనవరి కాదు కదా మార్చి వెళ్లిపోతున్నా అతీగతీ లేదు. ఒక్కో పల్లెవెలుగు బస్సును కేవలం రూ.25 లక్షలతో కొనుగోలు చేయవచ్చని చెబుతున్నారు.

సీఎంవో ఆదేశాలు రాగానే..

ఎన్నికల ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుని మూడు నెలల క్రితం ముఖ్యమంత్రికి మూడు బస్సులు కొనుగోలు చేయాలంటూ ఆర్టీసీకి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలొచ్చాయి. వెంటనే ఎండీ ద్వారకాతిరుమల రావు చండీగఢ్‌ వెళ్లి రూ.15 కోట్ల ఖర్చుతో మూడు క్యారవాన్‌ బస్సులకు ఆర్డర్‌ ఇచ్చి వచ్చారు. అంతలోనే మరో రెండు బుల్లెట్‌ ప్రూఫ్‌ వోల్వో బస్సులు కావాలని చెప్పడంతో నిఘా విభాగం ఉన్నతాధికారులతో చర్చించి ఏకంగా 20 కోట్లు ఖర్చు చేసి వాటిని కొన్నారు. జనవరిలో ఆర్డర్‌ ఇచ్చిన బస్సులు కేవలం రెండు నెలల్లో అత్యాధునిక హంగులతో విజయవాడ చేరుకున్నాయి. పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలపై చార్జీల బాదుడుతో వసూలు చేసిన సొమ్మును వీటికి వ్యయం చేశారన్న మాట. బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సులు కొనడంపై నిరసన వెల్లువెత్తడంతో వాటిని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా కోసం కొనుగోలు చేయించినట్టుగా వైసీపీ పేటీఎం బ్యాచ్‌ ప్రచారం చేసింది. కానీ ప్రధాని మోదీ చిలకలూరిపేటకు వచ్చినప్పుడు ఆ బస్సు విజయవాడ దాటి వెళ్లలేదు. ముఖ్యమంత్రి పర్యటనలు, బహిరంగ సభల ఏర్పాట్లను పర్యవేక్షించే వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం ప్రస్తుతం ఈ బస్సులను పర్యవేక్షిస్తున్నారు. బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సుల్లో బెడ్‌రూమ్‌, టాయ్‌లెట్స్‌, మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌, ఎల్‌ఈడీ టీవీ, వైఫై, మినీ ఆఫీసు, సీసీ కెమెరాలు, బస్సు చుట్టూ సౌండ్‌ సిస్టమ్‌, జగన్‌ బస్సు పైకి ఎక్కటానికి వీలుగా స్టెయిర్స్‌, బస్సెక్కిన తర్వాత ప్రసంగించడానికి మినీ డయాస్‌ వంటివి ఉన్నాయి.

ఆ రెంటినీ వాడకుండా..

ఆర్టీసీ వద్ద ఇప్పటికే రెండు బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సులు ఉన్నా వాటిని ముఖ్యమంత్రి జగన్‌ పక్కన పెట్టేశారు. ఇటీవల వాటికి మూడున్నర కోట్లతో మరమ్మతులు కూడా చేయించారు. అయినప్పటికీ వాటిని వాడేందుకు జగన్‌ నిరాకరించడంతో 38 కోట్లు వెచ్చించి మరీ ఐదు కొత్త బస్సులను కొనుగోలు చేశారు. వోల్వో బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సులు బయట అద్దెకు తీసుకోవాలంటే ప్రభుత్వం మీద చాలా భారం పడుతుంది. అదే ఆర్టీసీ వద్దయితే తక్కువ అద్దె ఇవ్వొచ్చని వైసీపీ పెద్దలు భావించినట్లు ఉన్నారు. అందుకే దానితో కొనుగోలు చేయించారు. అందుబాటులో ఉన్న వాటినే వాడి ఉంటే ఆర్టీసీపై భారం తగ్గేది. కనీసం వంద పల్లె వెలుగు బస్సులు వచ్చినా కొన్ని పాత డొక్కు బస్సులను పక్కనపెట్టేయడానికి అవకాశం ఉండేది.

Updated Date - Mar 22 , 2024 | 03:56 AM