Share News

Weather Update: మండుతున్న ఆంధ్రప్రదేశ్!

ABN , Publish Date - Apr 25 , 2024 | 04:36 AM

ఎండ తీవ్రత, వడగాడ్పులు, పొడి వాతావరణంతో రాష్ట్రం వేడెక్కింది.

Weather Update: మండుతున్న ఆంధ్రప్రదేశ్!

  • నెలాఖరు వరకూ వడగాడ్పులు

  • వచ్చేనెలలో మరింత తీవ్రంగా గాడ్పులు

  • భూమిలో తగ్గిన తేమ, నిశ్చలంగా గాలులు

  • పెరుగుతున్న రాత్రి ఉష్ణోగ్రతలు

  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: నిపుణులు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఎండ తీవ్రత, వడగాడ్పులు, పొడి వాతావరణంతో రాష్ట్రం వేడెక్కింది. మధ్యభారతంలో మాదిరిగా కోస్తా, రాయలసీమ నిప్పులకుంపటిలా మారాయి. ప్రస్తు తం వీస్తున్న వడగాడ్పులు ఈనెల 27వ తేదీ నుంచి మరింత పెరిగి నెలాఖరు వరకూ కొనసాగే అవకాశం ఉంది. మే నెల తొలి వారంలో ఎండలు, వడగాడ్పుల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో గతేడాది రుతుపవనాల సీజన్‌లో వర్షాలు తక్కువగా కురిశాయి. అనేక ప్రాంతాల్లో కరువు పరిస్థితులు కొనసాగాయి. తరువాత ఈ శాన్య రుతుపవనాల సమయంలో కూడా అనుకున్న వర్షాలు కురవకపోవడం తో ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. చెరువులు, వాగు లు ఎండిపోగా నదుల్లో ప్రవాహాలు తగ్గిపోయా యి. చివరికి రిజర్వాయర్లు డెడ్‌ స్టోరేజ్‌కు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో భూమిలో తేమ శాతం తగ్గిపోవడంతో భూమి వేడెక్కిపోయింది. గత నెల రెండో వారం నుంచి ప్రారంభమైన ఎండలు రోజురోజుకూ పెరగడం, తేమ శాతం తగ్గడంతో ఎండ తీవ్రత పెరిగి గాడ్పులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం గాలుల వేగం సగటున ఆరు కిలోమీటర్ల నుంచి 18 కి.మీ. వరకు ఉండడంతో వేడి వాతావరణం ఎక్కడికక్కడే స్థిరంగా ఉండిపోయింది.

సాధారణంగా మే నెలలో గాలుల్లో నిశ్చలత్వం ఉంటుందిగానీ ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ప్రారంభమైందని వాతావరణ నిపుణుడొకరు విశ్లేషించారు. వీటన్నింటి ప్రభావంతో రాష్ట్రంలో ప్రస్తుతం వడగాడ్పులు కొనసాగుతున్నాయని వివరించారు. ఇదిలావుండగా ఈ నెలాఖరు వరకు కొనసాగనున్న వడగాడ్పులు వచ్చే నెలలో మరింత తీవ్రంగా ఉంటాయని ఇస్రో నిపుణుడు హెచ్చరించారు. వరుసగా రెండు రోజులపాటు రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రాంతాల్లో సాధారణం కంటే 4.5 డిగ్రీల నుంచి 6.4 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదైతే అక్కడ వడగాడ్పులు వీచినట్టుగా, అదే 6.5 డిగ్రీలు అధికంగా లేదా 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటి నాలుగు రోజులు నమోదైతే అక్కడ తీవ్ర వడగాడ్పులు వీచినట్టుగా పరిగణించాలన్నారు. వడగాడ్పుల తీవ్రత బట్టి ‘ఆరెంజ్‌’, ‘సివియర్‌’గా హెచ్చరికలు ఉంటాయన్నారు. కాగా, పగటి ఉష్ణోగ్రతలతోపాటు రాత్రి ఉష్ణోగ్రతలు 25 నుంచి 30 డిగ్రీల వరకు నమోదవుతున్నందున అనేక ప్రాంతాల్లో రాత్రులు కూడా వాతావరణం వేడిగా ఉంటోందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బయటకు రావద్దని, మంచినీళ్లు ఎక్కువగా తాగాలన్నారు. ప్రభుత్వాలు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సూచించారు.

Updated Date - Apr 25 , 2024 | 07:29 AM