Share News

నడిరోడ్డుపై బోటు దహనం

ABN , Publish Date - Mar 09 , 2024 | 02:22 AM

కాకినాడ సెజ్‌లోని ఫార్మా కంపెనీల నుంచి వెలువడే వ్యర్థాలను విడుదల చేసేందుకు సముద్రంలో ఏర్పాటు చేసిన పైప్‌లైన్లను వెంటనే తొలగించాలని మత్స్యకారులు డిమాండ్‌ చేశారు.

నడిరోడ్డుపై బోటు దహనం

కాకినాడ జిల్లాలో మత్స్యకారుల భారీ ఆందోళన

సముద్రంలో ఫార్మా పైప్‌లైన్లు తొలగించాలని డిమాండ్‌

కోనపాపపేట(కొత్తపల్లి), మార్చి 8: కాకినాడ సెజ్‌లోని ఫార్మా కంపెనీల నుంచి వెలువడే వ్యర్థాలను విడుదల చేసేందుకు సముద్రంలో ఏర్పాటు చేసిన పైప్‌లైన్లను వెంటనే తొలగించాలని మత్స్యకారులు డిమాండ్‌ చేశారు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు కోనపాపపేటలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. సమస్యను తక్షణం పరిష్కరించకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ నడిరోడ్డుపై బోటును దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. పలువురు మత్స్యకారులు ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పు పెట్టుకొనేందుకు యత్నించారు. మత్స్యకార పెద్దలు వారిని అడ్డుకున్నారు. పైప్‌లైన్ల కప్లింగ్‌లకు చిక్కుకొని తమ వలలు పాడైపోతున్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించే వరకు రోజూ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పైప్‌లైన్లు తొలగించాలని మూడురోజులుగా ఆందోళనలు చేపడుతున్నా అధికార, ప్రతిపక్ష నాయకులు కనీసం స్పందించలేదని, వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేయబోమని మత్స్యకారులు హెచ్చరించారు. అనంతరం కోనపాపపేట మూడు రోడ్లు కూడలి, ప్రధాన రహదారిలో సిమెంటు బెంచీలు అడ్డంగా వేసి నిరసన తెలిపారు. దీంతో తుని- కాకినాడ బీచ్‌ రోడ్డులో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కోనపాపపేట నడిరోడ్డులో దహనం చేసిన ఫైబర్‌ బోటు నుంచి వచ్చిన మంటలు, దట్టమైన పొగ గ్రామమంతా వ్యాపించాయి. కాగా, టీడీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ సాయంత్రం మత్స్యకారుల ఆందోళనకు మద్దతు తెలిపారు.

Updated Date - Mar 09 , 2024 | 02:23 AM