బుగ్గన బడ్జెట్ ‘క్లాసు’
ABN , Publish Date - Feb 08 , 2024 | 03:33 AM
‘హలో... వింటున్నారా! నేను చెప్పింది అర్థమవుతోందా! మళ్లీ చెబుతా వినండి’... ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రసంగం సాగిన తీరిది! బుధవారం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఉదయం 11.04 నిమిషాలకు మాట్లాడటం
లెక్చరర్‌ను తలపించిన ఆర్థిక మంత్రి
చదవడం.. సభ్యులకు తిరిగి వినిపించడం
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
‘హలో... వింటున్నారా! నేను చెప్పింది అర్థమవుతోందా! మళ్లీ చెబుతా వినండి’... ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రసంగం సాగిన తీరిది! బుధవారం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఉదయం 11.04 నిమిషాలకు మాట్లాడటం ప్రారంభించి, 1:05 నిమిషాల దాకా అంటే, సుమారు 2:01 గంటలు సాగదీశారు. సంప్రదాయ బడ్జెట్ ప్రసంగానికి భిన్నంగా ఒక లెక్చరర్ తన విద్యార్థులకు పాఠాలు చెప్పినట్లు అసెంబ్లీలో ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఒక పేరా చదివి, దాన్ని మళ్లీ రిపీట్ చేస్తూ పోయారు. 44 పేజీల బడ్జెట్ ప్రసంగ పాఠంలో... దాదాపు 26 పేరాలను మళ్లీ చదవడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం విసిగిపోయారు. వైసీపీకి ఉన్న బొమ్మల పిచ్చి బడ్జెట్ పుస్తకంలోనూ కనిపించింది. ఎప్పుడూ లేని విధంగా సీఎం జగన్, ఆర్థిక మంత్రి బుగ్గన బొమ్మలు అందులో ప్రచురించారు.
పథకాలపై పదేపదే అబద్ధాలు..
కొన్ని పథకాల గురించి బడ్జెట్ ప్రసంగంలో అవాస్తవాలను నొక్కి మరీ గొప్పగా చెప్పుకొన్నారు. విదేశీ విద్యకు సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 1858 మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చిందని బడ్జెట్ పుస్తకంలో ప్రచురించారు. అయితే వాస్తవ పరిస్థితులు పరిశీలిస్తే... ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్నెల్లకోసారి చొప్పున మూడు సార్లుగా ఇప్పటికి విదేశీ విద్య మంజూరుచేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించి మొత్తం కలిపినా 200 మందికి మించి లబ్ధిదారులు లేరు. నైపుణ్యాభివృద్ధి గురించి మాట్లాడుతూ తాము సరళంగా ఈ పథకం చేపట్టామని, గత ప్రభుత్వం హైప్రొఫైల్‌లో చేసి కేసుల్లో చిక్కుకున్నారని వ్యాఖ్యానించారు. తాము పేదరికంపై యుద్ధం చేస్తే, చంద్రబాబు ప్రభుత్వంలో దోమలపై దండయాత్ర చేశారంటూ ఎద్దేవా చేశారు. పెన్షన్ కానుక అమలులోని లోపాలను కప్పిపెట్టారు. చెరువుల అనుసంధాన ప్రాజెక్టును ప్రారంభించినట్లు చెప్తూ.... పత్తికొండ శాసనసభ్యురాలు ఎక్కడ అంటూ ప్రస్తావించారు. నెల్లూరు జిల్లా ప్రాజెక్టుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆయా ఎమ్మెల్యేల గురించి ఆరా తీశారు. పైలట్ విధానంలో కొనసాగిన భూసర్వే చేపట్టిన గ్రామాల్లో రైతులు అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఎటూ ఈ సారి రాదు, వచ్చే ప్రభుత్వంలోనైనా సర్వే సక్రమంగా జరుగుతుందన్న ఆశతో ప్రజలు ఎదురుచూస్తున్నారు. అలాంటి భూసర్వే గురించి బడ్జెట్ ప్రసంగంలో ఎక్కువ సమయం కేటాయించడంపై విమర్శలు వచ్చాయి. ఉద్యోగుల సంక్షేమం గురించి కూడా ప్రసంగంలో అవాస్తవాలు చోటుచేసుకోవడంతో ఉద్యోగులు నవ్వుకుంటున్నారు. ప్రతి అంశాన్ని టీడీపీతో పోల్చడం, దానిని నొక్కి చదవడం, సీఎం ప్రతిస్పందన కోసం బుగ్గన ఎదురుచూడటం... బడ్జెట్ ప్రసంగం ఆసాంతం ఇదే ధోరణి సాగింది. కొన్ని అంశాల్లో బడ్జెట్ ప్రసంగంలో తప్పులు దొర్లినట్లు సీఎం గుర్తించి చెప్పడం, అవి సరిచేసి ఆర్థికమంత్రి చదవడం జరిగింది.
‘చిత్రాలు’ చూపించారు...
బడ్జెట్ సమర్పణలో ‘చిత్ర’ విచిత్రాలు చేశారు. పథకాల లబ్ధిదారులు జగన్‌ను ప్రశంసిస్తున్న దృశ్యాలను అసెంబ్లీలో ప్రదర్శించారు. ప్రసంగం ఆసాంతం సీఎం సూచనలు స్వీకరించడం, సవరించడం విశేషం. ప్రతిపక్షనేత సభలో లేకున్నా... కుప్పం ప్రస్తావన వచ్చినప్పుడల్లా కావాలని ప్రతిపక్ష నేత ఉండి ఉంటే బాగుండేది... కుప్పంలో అది చేశాం, ఇది చేశామంటూ బుగ్గన ప్రసంగించారు. విద్యా విషయాలపై చదివేటప్పుడు విద్యాశాఖ మంత్రి ఉన్నారా? అని వాకబు చేయడం, నాడు-నేడు గురించి పదే పదే చెప్పి కొందరు సభ్యుల చేత చప్పట్లు కొట్టించుకోవడం కనిపించింది. సభలో సీఎం ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు పిచ్చాపాటి మాట్లాడుకోవడం కనిపించింది. బడ్జెట్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే పదేపదే బుగ్గన అలెర్ట్ చేయడం, సీఎం సభలో ఉండటంతో ప్రసంగం పూర్తి అయ్యేదాకా ఓపికగా కూర్చున్నారు.