Share News

సికెల్‌సెల్‌ ఎనీమియాతో బీటెక్‌ విద్యార్థిని మృతి

ABN , Publish Date - Jul 31 , 2024 | 02:19 AM

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో బీటెక్‌ విద్యార్థిని సికెల్‌సెల్‌ ఎనీమియాతో మృతి చెందింది.

సికెల్‌సెల్‌ ఎనీమియాతో బీటెక్‌ విద్యార్థిని మృతి

చింతపల్లి, జూలై 30: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో బీటెక్‌ విద్యార్థిని సికెల్‌సెల్‌ ఎనీమియాతో మృతి చెందింది. కడశిల్ప గ్రామానికి చెందిన గోపీనాయక్‌ కోటి కుమార్తె హేమ (22) ఈ ఏడాది బీటెక్‌ పూర్తి చేసింది. ఆమె కొంతకాలంగా సికెల్‌సెల్‌ ఎనీమియాతో బాధపడుతోంది. రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆమెను కేజీహెచ్‌కు తరలించగా మంగళవారం మృతి చెందింది.

ఏమిటీ సికెల్‌సెల్‌ ఎనీమియా?

సికెల్‌సెల్‌ ఎనీమియా జన్యుపరమైన లోపం కారణంగా వస్తుందని వైద్యులు చెబుతున్నారు. బాధితుల్లో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. ఆరోగ్యవంతులైన మనుషుల్లో ఎర్ర రక్త కణాలు గుండ్రంగా ఉంటాయి. వాటి జీవితకాలం 120 రోజులు. అయితే సికెల్‌సెల్‌ ఎనీమియా బాధితుల్లో ఎర్ర రక్త కణాలు కొడవలి ఆకారంలో ఉంటాయి. 25 రోజులకే నశిస్తాయి. అయితే ఈ కణాలు నశించినంత వేగంగా కొత్త ఎర్రరక్త కణాలు ఉత్పత్తి కాకపోవడంతో ఈ వ్యాధి ఉన్నవారు రక్తహీనతకు గురవుతారు. సికెల్‌ సెల్‌ ఎనీమియా బాధితులు 15 రోజులకొకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. హిమోగ్లోబిన్‌ శాతం తక్కువగా ఉంటే రక్తం మార్పించుకోవాలి. ఐరన్‌ పోలిక్‌ యాసిడ్‌ మాత్రలతోపాటు వైద్యాధికారి సూచించిన జాగ్రత్తలు పాటించాలి.

Updated Date - Jul 31 , 2024 | 07:31 AM