Share News

బైక్‌పైతెచ్చి... కట్టెకు కట్టి.. మృతదేహం తరలింపు

ABN , Publish Date - Jan 17 , 2024 | 02:47 AM

కన్నబిడ్డ చనిపోయి వారం రోజులు.. ఇంతలోనే బాలింత అయిన భార్యా కన్నుమూసింది. గుండె పగిలి తన్నుకువస్తున్న దుఃఖాన్ని పంటి బిగువున భరిస్తూ...

బైక్‌పైతెచ్చి... కట్టెకు కట్టి.. మృతదేహం తరలింపు

వారం వ్యవధిలోనే బిడ్డ, భార్య కన్నుమూత

విజయనగరం జిల్లాలో గిరిపుత్రుడి ఘోష

కొన్ని రోజుల క్రితం తల్లీబిడ్డా అనారోగ్యం పాలు

రోడ్డు బాగాలేక డోలీలో మోసుకుంటూ ఆస్పత్రికి

అస్పత్రిలో చికిత్స పొందుతూ పసిబిడ్డ మృతి

కోలుకున్న తల్లి ఇంటికి... తిరగబెట్టిన అనారోగ్యం

సంక్రాంతి రోజున పరిస్థితి విషమించి చనిపోయిన వైనం

శృంగవరపుకోట రూరల్‌, జనవరి 16: కన్నబిడ్డ చనిపోయి వారం రోజులు.. ఇంతలోనే బాలింత అయిన భార్యా కన్నుమూసింది. గుండె పగిలి తన్నుకువస్తున్న దుఃఖాన్ని పంటి బిగువున భరిస్తూ... భార్య మృతదేహాన్ని బైక్‌పై పెట్టుకుని ఇంటి బాట పట్టాడా భర్త. సగం దూరం వెళ్లిన తర్వాత బైక్‌ కూడా వెళ్లలేని దుస్థితి. అక్కడి నుంచి ఒక కట్టెకు మృతదేహాన్ని కట్టుకుని మోసుకుంటూ ఇంటికి చేరిన దీనస్థితి. విజయనగరం జిల్లాలో ఒక గిరిపుత్రుడు ఘోష ఇది. జిల్లాలోని శృంగవరపుకోట మండలం గిరిశిఖర గ్రామమైన బొడ్డవర పంచాయతీ పరిధిలోని చిట్టంపాడు గ్రామానికి చెందిన బాలింత మాదల గంగమ్మ, ఆమె ఆరు నెలల పాప అనారోగ్యం పాలయ్యారు. ఈ నెల ఐదో తేదీన వారిద్దరిని గంగమ్మ భర్త గంగులు తోటి గిరిజనుల సాయంతో డోలీపై ఐదుకిలోమీటర్లు మోసుకుంటూ మైదాన ప్రాంతానికి తెచ్చారు. అక్కడి నుంచి ఎస్‌.కోట సీహెచ్‌సీకీ తరలించారు. గంగమ్మ ఆరోగ్యం కుదుటపడడంతో ఆమెను డాక్టర్లు ఇంటికి పంపేశారు. చిన్నారి ఆరోగ్యం క్షీణించడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించగా ఈనెల 7న చిన్నారి మృతి చెందింది.

ఇప్పుడు తల్లి కూడా మృతి..

చిన్నారి తల్లి గంగమ్మ(26)కు అనారోగ్యం తిరగబెట్టింది. సోమవారం డోలీ ద్వారా మైదాన ప్రాంతానికి తీసుకెళ్లి... అక్కడ నుంచి విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గంగమ్మ చనిపోయింది. ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని ఆటోలో శృంగవరపుకోట తీసుకుని వచ్చిన తర్వాత.. బొడ్డవరకు రావడానికి ఆటో డ్రైవర్‌ నిరాకరించాడు. దీంతో గంగమ్మ మృతదేహాన్ని తన స్నేహితుడి ద్విచక్రవాహనంపై పెట్టుకుని బొడ్డవర రైల్వేస్టేషన్‌ వరకు తీసుకొచ్చి, అక్కడి నుంచి రెండు కట్టెలకు కట్టుకుని ఊరికి తరలించామని భర్త తెలిపాడు.

వైసీపీ నేతలు హామీ నిలబెట్టుకుని ఉంటే...

గిరిశిఖర గ్రామానికి రహదారి సౌకర్యం కూడా లేదు. గ్రామానికి రోడ్డు వేయిస్తామని వైసీపీ నేతలు పోయిన ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. వారు ఆ హామీ నిలబెట్టుకుని ఉంటే తమ ప్రాణాలకు భరోసా ఉండేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఎవరైనా అనారోగ్యం పాలైతే, ఒక కర్రకు దుప్పటికట్టి దాన్నే డోలీగా మార్చుకుని మైదాన ప్రాంతానికి మోసుకుని వచ్చి... అక్కడ నుంచి ఆసుపత్రులకు తీసుకెళ్లడం పరిపాటిగా మారింది. ప్రాణాలు పోయిన ప్రతిసారీ అఽధికారులు, ప్రజ్రాపతినిధులు రోడ్డు వేయిస్తామని చెప్పడం... తాము నమ్మి ఓట్లు వేయడం.. వారు ఆ హామీని గాలికి వదిలేయడం పరిపాటిగా మా రిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jan 17 , 2024 | 02:47 AM