Share News

టీచర్ల అక్రమ బదిలీలకు బ్రేక్‌

ABN , Publish Date - Jun 07 , 2024 | 02:38 AM

రూల్స్‌ గీల్స్‌ మాకు పట్టవు. బదిలీల షెడ్యూలు, కౌన్సెలింగ్‌తో సంబంధం లేదు. ముడుపులిస్తే ఎప్పుడైనా బదిలీ చేస్తాం.

టీచర్ల అక్రమ బదిలీలకు బ్రేక్‌

గత ఆదేశాలు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు

ఎన్నికల ముందు అడ్డగోలుగా 1200 మంది బదిలీ

కోడ్‌ తర్వాత రిలీవ్‌ కావాలని అప్పట్లో ఆదేశం

ఒక్కొక్కరి నుంచి 4 - 5 లక్షల ముడుపులు

నాటి మంత్రి బొత్స ఆఫీసు కేంద్రంగానే వసూళ్లు

ఉపాధ్యాయ సంఘాల నేతలకూ పాత్ర

ప్రభుత్వం మారడంతో బదిలీల నిలిపివేత

లబోదిబోమంటున్న ముడుపులిచ్చిన టీచర్లు

అమరావతి, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): ‘రూల్స్‌ గీల్స్‌ మాకు పట్టవు. బదిలీల షెడ్యూలు, కౌన్సెలింగ్‌తో సంబంధం లేదు. ముడుపులిస్తే ఎప్పుడైనా బదిలీ చేస్తాం. ఒకటీ అరా కాదు వందల మందిని అడ్డదారిలో మార్చేస్తాం’ అనే తరహాలో నిబంధనలను తుంగలో తొక్కి కమీషన్ల కోసం చేసిన ఉపాధ్యాయ అక్రమ బదిలీలకు బ్రేక్‌ పడింది. ఎన్నికల ముందు బదిలీ ఉత్తర్వులు జారీచేసి, కోడ్‌ ముగిసిన తర్వాత వారంతా రిలీవ్‌ కావాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఆ బదిలీలను నిలుపుదలచేస్తూ ఆయనే గురువారం తాజాగా మరో ఉత్తర్వులు జారీచేశారు. బదిలీల వెనుక రూ.50 కోట్లకుపైగా స్కాం జరిగింది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కార్యాలయం కేంద్రంగానే వసూళ్ల పర్వం కొనసాగింది. అక్రమాలను అడ్డుకోవాల్సిన మంత్రే ముడుపుల వసూలుకు గేట్లు తెరిచారు. దీంతో వందల మంది టీచర్లు కోరుకున్న స్థానాల కోసం అడిగినంత సమర్పించుకుని బదిలీ ఆర్డర్లు తెచ్చుకున్నారు. ఒక్కో టీచర్‌ రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు ఇచ్చారు. ఇప్పుడా బదిలీలు ఆగిపోవడంతో ముడుపులిచ్చిన టీచర్లు లబోదిబోమంటున్నారు. ఈ వ్యవహారంలో పాఠశాల విద్యాశాఖలోని కొందరు అధికారులు, కొన్ని ఉపాధ్యాయ సంఘాల నేతల పాత్ర కూడా ఉండటం చర్చనీయాంశంగా మారింది. బదిలీలు చేయిస్తామంటూ అప్పట్లో వీరూ ముడుపులు వసూలు చేశారు. పాఠశాల విద్యాశాఖలో అన్నీ తానై వ్యవహరించే ఓ కమిషనరేట్‌ అధికారి, రాయలసీమకు చెందిన సచివాలయంలోని పాఠశాల విద్యాశాఖ అధికారి పాత్ర కూడా ఇందులో ఉంది. వారిద్దరే దాదాపు 30 బదిలీలు చేయించారు. సచివాలయంలో కూర్చునే ఇద్దరూ ఈ అక్రమ బదిలీల ఆర్డర్లను తయారుచేశారు. ఇక ఉపాధ్యాయ సంఘాల్లో ఎక్కువ మంది టీచర్లు ఉండే ఓ పెద్ద సంఘం నాయకులు, తెలంగాణలో తప్ప ఏపీలో టీచర్లే లేని ఓ సంఘం నేతలు కూడా ఇందులో తలదూర్చారు. ఏపీ టీచర్లు లేని సంఘంలో రాయలసీమకు చెందిన నేత ఒక్కరే 20 మంది టీచర్లను బదిలీ చేయించారు. ఇప్పుడు బదిలీలు ఆగిపోవడంతో ఈ వ్యవహారం రచ్చకెక్కే అవకాశం కనిపిస్తోంది. బొత్స వద్దకు వెళ్లి ముడుపులు వెనక్కి ఇవ్వాలనే ధైర్యం చేయలేకపోయినా.. ఆ అధికారులు, సంఘాల నేతలను టీచర్లు నిలదీస్తున్నారు. మా డబ్బులు మాకు ఇవ్వండి అంటూ ఫోన్లు చేసి అడుగుతున్నారు.

చేస్తే తప్పేంటి..?

విద్యాశాఖ మంత్రిగా అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన బొత్స సత్యనారాయణే బదిలీల విషయంలో బరితెగించారు. అక్రమ బదిలీలు చేస్తాం అని బహిరంగంగా ప్రకటించారు. మొదట సీఎం కార్యాలయం పేరుతో కొన్ని పేర్లు తయారుచేశారు. ఓ మీడియా సమావేశంలో వీటిపై విలేకరులు ప్రశ్నించగా ‘సిఫారసు బదిలీలు చేస్తే తప్పేంటి. ఎమ్మెల్యేలు అడిగితే బదిలీలు కూడా చేయకపోతే ఎలా?’ అని అడ్డగోలుగా మాట్లాడారు. ఆ తర్వాత కొంతకాలానికి బొత్స ఆఫీసులోనే ముడుపులు వసూలుచేశారు. ఆ కార్యాలయంలో పనిచేసిన కమలాకర్‌ అనే వ్యక్తి ద్వారా ఈ నగదు చేతులు మారింది. బదిలీ కావాలంటే కచ్చితంగా కమలాకర్‌ను కలవాల్సిందేననే అనధికారిక నిబంధన పెట్టి అమలుచేశారు. డబ్బులివ్వకుండా ఎవరైనా బదిలీ అడిగితే దరఖాస్తు తీసుకుని పక్కన పడేశారు. కేవలం ముడుపులిచ్చిన వారి దరఖాస్తులనే ప్రాసెస్‌ చేశారు. నేరుగా మంత్రే దుకాణం తెరవడంతో కమిషనరేట్‌ అధికారి, సచివాలయం అధికారి కలిసి కొన్ని బదిలీలు చేసుకున్నారు. కాగా, ఇప్పటికే వీరిలో కొందరు కొత్త స్థానాల్లో చేరిపోయారు. మొదట చేసిన బదిలీల్లో ఆర్డర్లు పొందిన వారు కొత్త స్థానాల్లో చేరగా, ఎన్నికల కోడ్‌కు ముందు ఆర్డర్లు పొందినవారు ఆగిపోయారు.

ఆ రోజు ఏంచేశావ్‌ ప్రవీణ్‌?

అక్రమ బదిలీల వ్యవహారంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ జోక్యం కూడా ఉంది. గతేడాది మొదట్లో కౌన్సెలింగ్‌ ద్వారా సాధారణ బదిలీలు చేశారు. ఆ తర్వాత సిఫారసు బదిలీల పేరుతో అక్రమ బదిలీలు ప్రారంభించారు. ఆ సమయంలోనూ ముఖ్యకార్యదర్శిగా ప్రవీణ్‌ ప్రకాశే ఉన్నారు. ఈ అక్రమాల వ్యవహారం దాదాపు ఆరు నెలలు కొనసాగింది. ఎన్నికల ముందు బదిలీ ప్రక్రియ వేగంగా చేసేందుకు పూర్తిగా సహకారం అందించారు. ఆయనతో పాటు పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులంతా ఈ తంతంగానికి వత్తాసు పలికారు. ఇప్పుడు అవి అక్రమ బదిలీలని ఆపేయడంతో ‘మాకేం తెలియదు’ అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అప్పుడు బదిలీ ఆర్డర్‌ ఇచ్చిన ప్రవీణ్‌ ప్రకాశ్‌.. అక్రమాలు కళ్ల ముందు జరుగుతుంటే ఏంచేశాడని టీచర్లు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Jun 07 , 2024 | 02:38 AM