Share News

AP News: ఆంధ్రజ్యోతి కథనాల ఎఫెక్ట్.. యాత్ర-2 డైరెక్టర్‌కు 2 ఎకరాల కేటాయింపు ప్రక్రియకు బ్రేక్

ABN , Publish Date - Feb 13 , 2024 | 02:37 AM

హార్సిలీహిల్స్‌ చేరిన దర్శకుడు వారణాసి మహేంద్రరెడ్డి ‘యాత్ర’కు బ్రేక్‌ పడింది. జగన్‌ను గొప్ప వ్యక్తిత్వం ఉన్న నాయకుడిగా కీర్తిస్తూ యాత్ర-2 సినిమా తీసిన డైరెక్టర్‌ మహేంద్రరెడ్డికి హార్సిలీహిల్స్‌లో రెండు ఎకరాల స్థలం సంతర్పణకు ప్రయత్నించడంపై ‘ఆంధ్రజ్యోతి’ రాసిన కథనం కలకలం రేగింది.

AP News: ఆంధ్రజ్యోతి కథనాల ఎఫెక్ట్.. యాత్ర-2 డైరెక్టర్‌కు 2 ఎకరాల కేటాయింపు ప్రక్రియకు బ్రేక్

యాత్ర-2 డైరెక్టర్‌కు హడావిడిగా 2 ఎకరాలు

‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తేవడంతో కలకలం

పెద్దల ఆదేశాలతో శరవేగంగా కదిలిన ఫైలు

ఇప్పటికే స్థల పరిశీలన.. మిగిలింది సబ్‌ డివిజనే

ఇంతలోనే బయట పెట్టిన ‘ఆంధ్రజ్యోతి’

కేటాయించవద్దంటూ విపక్షాల ఆందోళన

దీంతో సబ్‌ డివిజన్‌ ప్రక్రియకు బ్రేకులు!

(రాయచోటి-ఆంధ్రజ్యోతి)

హార్సిలీహిల్స్‌ చేరిన దర్శకుడు వారణాసి మహేంద్రరెడ్డి ‘యాత్ర’కు బ్రేక్‌ పడింది. జగన్‌ను గొప్ప వ్యక్తిత్వం ఉన్న నాయకుడిగా కీర్తిస్తూ యాత్ర-2 సినిమా తీసిన డైరెక్టర్‌ మహేంద్రరెడ్డికి హార్సిలీహిల్స్‌లో రెండు ఎకరాల స్థలం సంతర్పణకు ప్రయత్నించడంపై ‘ఆంధ్రజ్యోతి’ రాసిన కథనం కలకలం రేగింది. దీనికితోడు ఇది ఎన్నికల సమయం కూడా కావడం, ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు భగ్గుమనడంతో అధికారులు ధైర్యంగా ముందుకెళ్లలేకపోతున్నారని సమాచారం. ఒకరకంగా అడకత్తెరలో పోకచెక్క పరిస్థితిని అధికారులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో భూమిని సబ్‌ డివిజన్‌ చేసి మహేంద్రరెడ్డి కోరుకున్న స్థలం ఇచ్చే ప్రక్రియకు బ్రేక్‌ పడినట్టు సమాచారం. అసలేం జరిగిందంటే.. ఆంధ్ర ఊటీ హార్సిలీహిల్స్‌లో స్థలం పొందాలనుకున్న యాత్ర-2 డైరెక్టర్‌ మహేంద్రరెడ్డి కలలను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సాకారం చేయాలనుకుంది. నిబంధనలతో పనిలేకుండా అత్యంత విలువైన రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించేందుకు సాక్షాత్తూ ప్రభుత్వంలోని పెద్దలే రంగంలోకి దిగారు. దీంతో భూకేటాయింపు ప్రక్రియ శరవేగంగా జరగడం మొదలైంది. పైస్థాయి అధికారుల ఆదేశాలతో కలెక్టర్‌, కలెక్టర్‌ ఆదేశాలతో స్థానిక రెవెన్యూ అధికారులు కదిలారు. మదనపల్లె ఆర్డీవో హరిప్రసాద్‌ స్వయంగా యాత్ర-2 డైరెక్టర్‌ మహేంద్రరెడ్డి కోరుకున్న స్థలాన్ని పరిశీలించారు. అయితే ఇక్కడే చిక్కుముడులు పడ్డాయి. మహేంద్రరెడ్డికి కేటాయించాలని చూస్తున్న కోటావూరు గ్రామ పరిధిలోని సర్వేనెంబరు 571/1లో 3.74 ఎకరాల భూమి ఉంది. 2018లో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో క్రీడా శిక్షణా కేంద్రం ఏర్పాటుకు శాప్‌కు దీనిని కేటాయించింది. క్రీడాశిక్షణా కేంద్రం అభివృద్ధికి రూ.3.20 కోట్లు కేటాయించింది. రూ.1.60 కోట్లు వ్యయం చేసి ఆ స్థలం చుట్టూ ప్రహరీగోడను కూడా నిర్మించారు. ఇప్పుడు ఈ స్థలం ఉన్న ఫలంగా మహేంద్రరెడ్డికి కేటాయించడం కుదరదు. దీంతో తొలుత 3.74 ఎకరాల స్థలంలో రెండు ఎకరాలను పర్యాటకశాఖకు బదలాయించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దర్శకుడు మహేంద్రరెడ్డికి ధారాదత్తం చేయాలని చూస్తున్న స్థలం ప్రస్తుతానికి సబ్‌ డివిజన్‌ కాలేదని సమాచారం.

ఆర్డీవో చేతిలో అధికారం...

హార్సిలీహిల్స్‌లో మొత్తం 103 ఎకరాల స్థలం ఉంది. ఇందులో ఏపీ టూరిజం, భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌, రైల్వే, శానిటోరియం, బిల్డింగ్‌ సౌసైటీ, సీడీసీఎంఎస్‌ తదితర 16 శాఖలకు పలుమార్లు భూములను కేటాయించారు. నిబంధనల ప్రకారం హార్సిలీహిల్స్‌పై ఎటువంటి చిన్న నిర్మాణాలు చేపట్టాలన్నా, ఇతరులకు సెంటు భూమి కేటాయించాలన్నా టౌన్‌షి్‌ప కమిటీకి మాత్రమే అధికారాలు ఉంటాయి. టౌన్‌షి్‌ప కమిటీ అధ్యక్షుడిగా మదనపల్లె ఆర్డీవో ఉంటారు. ఎంపీడీవో, తహసీల్దార్‌లతో పాటు కొండ మీద భూములు ఉన్న వివిధ శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. టౌన్‌షి్‌ప కమిటీలో తీర్మానించాక భూముల కేటాయింపు కానీ, నిర్మాణ పనులుకానీ చేయాల్సి ఉంటుంది. టౌన్‌షి్‌ప కమిటీ చైర్మన్‌గా ఆర్డీవోకు ప్రత్యేక అధికారాలు ఉంటాయి. శాప్‌కు చెందిన భూమిలో మినీ స్టూడియో నిర్మాణానికి కేటాయించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు, కలెక్టర్‌ ఉత్తర్వులు ఉన్నందున హార్సిలీ హిల్స్‌ టౌన్‌షి్‌ప కమిటీ చైర్మన్‌గా ఆర్డీవో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇందుకు కమిటీలో తీర్మానం తప్పనిసరి.

రాచమార్గం కాదని.. అడ్డదారిలో..

హార్సిలీహిల్స్‌పైన ఎవరికైనా స్థలం కేటాయించాలంటే.. అనేక నిబంధనలు పాటించాలి. ఈ నేపఽథ్యంలో.. ప్రొసీజర్‌ ప్రకారం వెళితే ఎన్నికల కోడ్‌ వచ్చే అవకాశం ఉంటుందని, ఆ స్థలాన్ని సబ్‌డివిజన్‌ చేసి పర్యాటక శాఖకు కేటాయించి.. అటునుంచి యాత్ర దర్శకునికి కట్టబట్టేందుకు ప్రభుత్వ పెద్దలు ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం వెలుగులోకి రావడంతో ప్రస్తుతానికి మహేంద్రరెడ్డికి భూకేటాయింపు విషయం అటకెక్కినట్లు తెలుస్తోంది. ఎన్నికలు దగ్గరలో ఉండడంతో ఈ విషయమై అధికారుల పరిస్థితి అడకత్తెరలో చిక్కుకున్నట్లు ఉంది. ఏదైనా తొందర పడి నిబంధనలను పక్కన పెట్టి ఏమైనా చేస్తే తమ పరిస్థితి ఏంటనే భయం అధికారుల్లో కనిపిస్తోంది. దీంతో ఈ విషయమై అధికారులు ఎవరూ నోరు మెదపడం లేదు. ఏం అడిగినా మాకు తెలియదు.. దయ ఉంచి మమ్మల్ని అడగవద్దు అనే సమాధానం ఇస్తున్నారు.

Updated Date - Feb 13 , 2024 | 08:19 AM