Share News

YS Sharmila : వైఎస్‌ను తిట్టిన బొత్స.. నీకు తండ్రితో సమానమా?

ABN , Publish Date - Apr 25 , 2024 | 04:32 AM

‘బొత్స సత్యనారాయణ అనే ఆయనను పక్కన నిలబెట్టుకుని... ‘నాకు తండ్రి లాంటి వాడు, ఓట్లెయండి’ అని జగన్‌ అడుగుతున్నాడు.

YS Sharmila : వైఎస్‌ను తిట్టిన బొత్స.. నీకు తండ్రితో సమానమా?

ఆయన విజయమ్మనూ అవమానించారు

రాజశేఖరరెడ్డిని తిట్టినోళ్లకే వైసీపీలో పెద్దపీట

ఆయన కోసం పనిచేసినవాళ్లపై గొడ్డలి వేటు

రేపల్లెలో జగన్‌పై పీసీసీ చీఫ్‌ షర్మిల ఫైర్‌

బాపట్ల, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): ‘‘బొత్స సత్యనారాయణ అనే ఆయనను పక్కన నిలబెట్టుకుని... ‘నాకు తండ్రి లాంటి వాడు, ఓట్లెయండి’ అని జగన్‌ అడుగుతున్నాడు. మీ సమక్షంలో అడుగుతున్నా... బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో నిండు వేదికగా వైఎస్‌ రాజశేఖరరెడ్డిని తిట్టిపోశారు. ఆ వ్యక్తి జగన్‌కు తండ్రి సమానుడయ్యాడట. ఇదే బొత్సగారు నా తండ్రిని తాగోబోతు అని తిట్టారు. జగన్‌కు ఉరిశిక్ష వేయాలన్నారు’’ అని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆమె బాపట్ల జిల్లా రేపల్లెలో జరిగిన న్యాయయాత్ర బహిరంగ సభలో మాట్లాడారు. తన తండ్రి రాజశేఖరరెడ్డిని తిట్టిన వారందరికీ జగన్‌ పెద్దపీట వెయ్యడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. పైగా వారినే పక్కన పెట్టుకుని తండ్రి లాంటి వారని సంభోదిస్తూ ఓట్లు అడగగాన్ని ఎద్దేవా చేశారు. ‘చివరకు వైఎస్‌ సతీమణి, నా తల్లి విజయమ్మను కూడా అవమానించిన వ్యక్తి బొత్స సత్యనారాయణ. ఈ రోజు అలాంటి వ్యక్తి జగన్‌కు తండ్రిలాంటి వారు అయ్యారు’ అంటూ షర్మిల మండిపడ్డారు.


ఏపీలో కాంగ్రెస్‌ తుది జాబితా

3 ఎంపీ, 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన.. 5 సీట్లలో అభ్యర్థుల మార్పు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల తుది జాబితాను కాంగ్రెస్‌ ప్రకటించింది. 3 ఎంపీ, 11 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ఖరారుచేసింది. నరసాపురం లోక్‌సభ బరిలో కొర్లపాటి బ్రహ్మానందరావు నాయుడు(కేబీఆర్‌ నా యుడు), రాజంపేట-ఎ్‌సకే బషీద్‌, చిత్తూరు (ఎస్సీ)లో ఎం.జగపతి పోటీచేస్తారని ఏఐసీసీ పధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. గతంలో ప్రకటించిన 5 సీట్లకు అభ్యర్థులను మార్చారు. విజయవాడ తూర్పులో సుంకర పద్మశ్రీ స్థానంలో పొంగుపాటి నాంచారయ్య.. తెనాలి-ఎ్‌సకే బషీద్‌ బదులు చందు సాంబశివుడు, కొండపి(ఎస్సీ)- శ్రీపతి సతీశ్‌ గాకుండా పసుమర్తి సుధాకర్‌, మార్కాపురం-షేక్‌ సైదా స్థానంలో జావీద్‌ అన్వర్‌, చీపురుపల్లిలో తుమ్మగంటి సూరినాయుడు బదులు ఆదినారాయణ పేర్లు ప్రకటించింది.


వైసీపీలో వైఎస్సార్‌ లేరు

‘వైసీపీలో అసలు వైఎస్సార్‌ లేరు. ఆయన ఎప్పుడో పోయారు. ఉన్నదల్లా వై అంటే వై.వీ.సుబ్బారెడ్డి, ఎస్‌ అంటే సాయిరెడ్డి, ఆర్‌ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే. వీళ్లా ఆయన ఆశయాలను నెరవేర్చేది?’ అంటూ షర్మిల నిలదీశారు.


రైతులను నాశనం చేసిన జగన్‌

‘రాష్ట్రంలో అప్పులేని రైతు అంటూ లేడు. అన్నదాతలను ఈ సీఎం నాశనం చేశాడు. మద్దతు ధర లేదు. ధరల స్థిరీకరణ ఎక్కడ? పంట నష్ట పరిహారం మాటే మరిచారు. ఐదేళ్ల క్రితం రాష్ట్రంలో 2 లక్షల 25 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని జగనే చెప్పారు. ఇప్పటికీ ఆ ఉద్యోగాలు భర్తీ చేయలేదు. సంక్రాంతులు వచ్చాయి. పోయాయి. కానీ జాబ్‌ కేలెండర్‌ మాత్రం రాలేదు’ అంటూ షర్మిల విమర్శించారు.


అందరూ తిట్టినవాళ్లే...

‘ఈ రోజు జగన్‌ కేబినెట్‌లో ఉన్న మంత్రులంతా వైఎస్‌ రాజశేఖరరెడ్డిని తిట్టినవారే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొదలు విడదల రజనీ, రోజా... అందరూ వారే. వీరందరూ జగన్‌కు కావాల్సినవాళ్లయ్యారు. వీళ్లంతా జగన్‌కు తండ్రులు, అక్కలు, చెల్లెళ్లంట. మరి నిజంగా వైఎస్‌ కోసం నిలబడినవాళ్లని జగన్‌ ఏం చేశారు? ఆయన కోసం పాదయాత్రలు చేసిన వారు ఏమయ్యారు? వైఎస్‌ కోసం పనిచేసిన వాళ్లు గొడ్డలి వేటుకు బలైపోయారు’ అని షర్మిల అన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 05:03 AM