Share News

బుకింగ్‌ సమయం 60 రోజులే

ABN , Publish Date - Oct 18 , 2024 | 03:56 AM

కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో ప్రయాణానికి 120 రోజులు ముందుగానే బెర్తులు రిజర్వు చేసుకునే వెసులుబాటు ప్రస్తుతం అమలులో ఉంది. ఈ గడువును 60 రోజులకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

బుకింగ్‌ సమయం 60 రోజులే

రైల్వే రిజర్వేషన్‌ నిబంధనల్లో మార్పు

నవంబరు 1నుంచి అమలులోకి...

విశాఖపట్నం, న్యూఢిల్లీ, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో ప్రయాణానికి 120 రోజులు ముందుగానే బెర్తులు రిజర్వు చేసుకునే వెసులుబాటు ప్రస్తుతం అమలులో ఉంది. ఈ గడువును 60 రోజులకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిబంధన నవంబరు 1 నుంచి అమలులోకి వస్తుంది. అక్టోబరు 31 వరకు 120 రోజుల గడువుతో టిక్కెట్లు బుక్‌ చేసుకోవచ్చు. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రైల్వే అడ్వాన్స్‌ బుకింగ్‌ టికెట్ల వ్యవధిపై నిర్ణయాలు మార్చుకుంటూ వస్తోంది. గతంలో 120 రోజుల గడువు ఉండగా అది దుర్వినియోగం జరుగుతున్నదని ఆరోపణలు రావడంతో 60 రోజులకు కుదించారు. అది 2015 మార్చి వరకు అమలైంది. ఆ తరువాత మళ్లీ 120 రోజులకు పెంచారు. ఇది సుదీర్ఘంగా తొమ్మిదేళ్లు నడిచింది. ఈ నెలాఖరుతో దీనిని కూడా కుదించి, నవంబరు ఒకటో తేదీ నుంచి మళ్లీ 60 రోజులకే పరిమితం చేస్తున్నారు.

ఎందుకంటే...?

120 రోజులు ముందుగా టికెట్లు బుక్‌ చేసుకుంటున్నవారు ఆ తర్వాత ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నారు. కాన్సిలేషన్‌ 21 శాతం వరకూ ఉంటోంది. సీట్లు, బెర్తులు వృథా అవుతున్నాయి. అవసరమైనవారు ఉపయోగించుకోలేకపోతున్నారు. మరో 5 శాతం అయితే ఆఖరు వరకు టికెట్‌ ఉంచుకొని రైలు ఎక్కడం లేదు. ఇలాంటి సందర్భాల్లో అవకతవకలు జరుగుతున్నాయి. ఎవరైతే రాలేదో... వారికి బదులు వేరే వారిని పంపిస్తున్నారు. వారి వివరాలు రైల్వే వద్ద ఉండడం లేదు. ప్రమాద ఘటనలు, నేరాలు జరిగినప్పుడు వారిని గుర్తించడం కష్టమవుతోంది. రైల్వే అధికారులు కూడా ప్రయాణికులు గైర్హాజరైతే ఆ బెర్తు లేదా సీటును అధికారికంగా చూపించకుండా వేరొకరికి ఇచ్చి డబ్బులు జేబులో వేసుకుంటున్నారు. తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే రైళ్లకు ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుంది. 120 రోజుల సమయం ఉండడంతో ఆయా రైళ్లలో కొందరు ముందుగానే టికెట్లు బ్లాక్‌ చేసి పెట్టుకొని ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు. బుకింగ్‌ గడువు కుదించడం వల్ల నిజమైన ప్రయాణికులు టికెట్లు తీసుకునే వెసులుబాటు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తక్కువ వ్యవధి ఉండడం వల్ల కాన్సిలేషన్లు తగ్గే అవకాశం ఉంది.

Updated Date - Oct 18 , 2024 | 03:56 AM