Share News

ఎన్నికల శంఖారావం పూరించిన బీజేపీ

ABN , Publish Date - Feb 02 , 2024 | 03:06 AM

ఏపీలో కమలం పార్టీ ఎన్నికల శంఖారావం పూరించింది. రాష్ట్రంలోని పాతిక పార్లమెంటు నియోజక వర్గాల కేందాల్లో బీజేపీ కార్యాలయాలను ప్రారంభించింది.

ఎన్నికల శంఖారావం పూరించిన బీజేపీ

భీమవరంలో కార్యాలయాన్ని ప్రారంభించిన పురందేశ్వరి

అమరావతి, భీమవరం, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): ఏపీలో కమలం పార్టీ ఎన్నికల శంఖారావం పూరించింది. రాష్ట్రంలోని పాతిక పార్లమెంటు నియోజక వర్గాల కేందాల్లో బీజేపీ కార్యాలయాలను ప్రారంభించింది. అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్వయంగా భీమవరంలో ప్రత్యేక పూజలు చేసి నర్సాపురం పార్లమెంటు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. మిగతా ప్రాంతాల్లో పార్టీ నేతలు, శ్రేణులు పాల్గొనగా అధ్యక్షురాలు వర్చువల్‌గా వీక్షించారు. అనంతరం శంఖం పూరించిన ఆమె ‘ఎన్నికల నగారా మోగించాం’ అని ప్రకటించారు. ‘ప్రశ్నించిన వారిపై అట్రాసిటీ కేసులు పెట్టి, జైలుకు పంపే అధికార వైసీపీకి రాష్ట్రంలో సామాజిక సాధికార యాత్ర చేసే నైతిక హక్కు లేదు. విద్వేషపూరిత పాలన సాగిస్తున్న వైసీపీని సాగనంపాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉంది’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పిలుపునిచ్చారు. ‘వైసీపీ అధికారంలోకి రాగానే ప్రజావేదికను కూల్చడంతో విధ్వంసకర, ప్రజాకంటక పాలనను తెచ్చింది. ఇప్పుడది విద్వేషపూరిత పాలనగా మారింది. రాజధాని నిర్మాణానికి డీపీఆర్‌ ఇవ్వకముందే కేంద్రం రూ.2,500 కోట్లు ఇచ్చింది. ప్రస్తుతం తల లేని మొండెంలా రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని గత టీడీపీ ప్రభుత్వానికి చెప్పిన తరువాతే కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్‌ నేత షర్మిల ప్రత్యేక హోదా కోసం పోరాడాలని అంటున్నారు. ఈ విషయంలో టీడీపీ, వైసీపీ కూడా బీజేపీపై నిందలు వేయడం సరికాదు. కేంద్ర ప్రభుత్వ పథకాలను బీజేపీ కార్యకర్తలందరూ ఈ నెల 9 నుంచి ప్రారంభమయ్యే ‘పల్లెకు పోదాం’లో ప్రజలందరికి వివరించాలి’ అని పురందేశ్వరి అన్నారు. పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం శ్రమించాలని పిలుపునిచ్చారు.

Updated Date - Feb 02 , 2024 | 08:40 AM