Share News

మంత్రి ఉష శ్రీచరణ్‌కు చేదు అనుభవం

ABN , Publish Date - Jan 29 , 2024 | 03:02 AM

శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం మోటువారిపల్లిలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీచరణ్‌కు సొంత పార్టీ కార్యకర్తల నుంచే చేదు అనుభవం ఎదురైంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఉష శ్రీచరణ్‌ను వైసీపీ అధిష్ఠానం మార్పుచేర్పుల్లో భాగంగా

మంత్రి  ఉష శ్రీచరణ్‌కు చేదు అనుభవం

సొంత పార్టీ నేతలే అడ్డుకున్న వైనం

తాగునీరు, రోడ్లు లేవని మండిపాటు

హిందూపురం, జనవరి 28: శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం మోటువారిపల్లిలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీచరణ్‌కు సొంత పార్టీ కార్యకర్తల నుంచే చేదు అనుభవం ఎదురైంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఉష శ్రీచరణ్‌ను వైసీపీ అధిష్ఠానం మార్పుచేర్పుల్లో భాగంగా పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఆత్మీయ పలకరింపు కార్యక్రమంలో భాగంగా ఆదివారం మోటువారిపల్లికి వెళ్లగా వైసీపీ కార్యకర్తలు, నాయకులే.. మంత్రి వాహనాన్ని అడ్డుకున్నారు. మంత్రి వాహనం దిగినవెంటనే గ్రామస్థులు సమస్యలు ఏకరువు పెట్టారు. ఎన్నికల సమయంలో గ్రామానికి రోడ్డు వేస్తామని హామీ ఇస్తున్నారు తప్ప.. ఇప్పటి వరకు వేసింది లేదన్నారు. కాలేజీలకు వెళ్లిన తమ పిల్లలు రాత్రిపూట ప్రధాన రహదారి నుంచి గ్రామంలోకి రావాలంటే జంకుతున్నారన్నారు. పెనుకొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శంకర్‌నారాయణ గతంలో రోడ్లు, భవనాలశాఖ మంత్రిగా పనిచేసినా.. ప్రస్తుతం మీరు మంత్రి గా ఉన్నా చేసిందేమిటని నిలదీశారు. కనీసం 4 కి.మీ., రోడ్డు వేయలేని నేతలు మాటలు మాత్రం కోటలు దాటిస్తున్నారంటూ సొంత పార్టీ కార్యకర్తలే ప్రశ్నించారు. గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండాపోయిందన్నారు. దీంతో మంత్రి సమాధానం చెప్పలేక అక్కడినుంచి నెమ్మదిగా జారుకున్నారు. ఆమె తీరుపై అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహించారు. కనీసం 5 నిమిషాలు తమ సమస్యలు వినని నేతలు తమకొద్దంటూ ఫైర్‌ అయ్యారు. శాపనార్థాలు పెట్టారు. ఎన్నికల్లోపు గ్రామానికి రోడ్డు వేయకపోతే ఎన్నికలు బహిష్కరిస్తామని గ్రామస్థులు ఖరాకండిగా చెప్పారు.

Updated Date - Jan 29 , 2024 | 03:02 AM