బడుగులకు పెద్దపీట!
ABN , Publish Date - Sep 25 , 2024 | 04:23 AM
టీడీపీ కూటమి ప్రభుత్వం విడుదల చేసిన నామినేటెడ్ పదవుల జాబితాలో.. ఇటీవలి ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన టీడీపీ నేతలకు పెద్ద పీట వేశారు.
20 కార్పొరేషన్లకు నామినేటెడ్ పదవుల భర్తీ?
అసెంబ్లీ సీట్లు త్యాగం చేసిన 8 మందికి అవకాశం
ఏపీఐఐసీ చైర్మన్‌గా ‘ఉండి’ రామరాజు మాజీ ఎంపీ కొనకళ్లకు ఆర్టీసీ
నెల్లిమర్ల, డోన్ ఇన్‌చార్జులకూ కీలక పోస్టులు
వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి అబ్దుల్ అజీజ్‌కు
లోకేశ్ పాదయాత్రలో వలంటీర్ల కన్వీనర్‌గా
పనిచేసిన రవినాయుడికి ‘శాప్’ బాధ్యతలు
టూరిజం కార్పొరేషన్ నూకసాని బాలాజీకి
పనిచేసినవారికి ప్రాధాన్యమిస్తూ పదవుల భర్తీ
యూనిట్, క్లస్టర్ ఇన్‌చార్జులకూ అవకాశం
20 చైర్మన్, 79 మంది సభ్యుల పేర్లతో తొలి
జాబితా.. టీడీపీకి 16, బీజేపీ 1, జనసేన 3
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
టీడీపీ కూటమి ప్రభుత్వం విడుదల చేసిన నామినేటెడ్ పదవుల జాబితాలో.. ఇటీవలి ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన టీడీపీ నేతలకు పెద్ద పీట వేశారు. రెండ్రోజుల్లో కొన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆదివారం చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆ మాట ప్రకారం మంగళవారం ఆ జాబితా విడుదల చేయించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి ఇదే తొలి జాబితా. పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యం ఉంటుందని అదే టెలికాన్ఫరెన్స్‌లో చెప్పిన చంద్రబాబు.. అదే మాట ప్రకారం బాగా పనిచేసినవారు తొలి జాబితాలో ప్రముఖంగా కనిపించేలా చూశారు. కేవలం పై స్థాయి నాయకులే కాకుండా కింది స్థాయిలో పనిచేసిన వారికీ చోటు కల్పించారు. ఎన్నికల ముందు టీడీపీ అంతర్గతంగా ఐదు వేల మంది ఓటర్లకు ఒక యూనిట్ ఇన్‌చార్జిని.. 25 వేల మందిని ఓటర్లకు ఒక క్లస్టర్ ఇన్‌చార్జిని నియమించి వారితో ఎన్నికల యుద్ధాన్ని నడిపించింది. ఇందులో ఒక క్లస్టర్ ఇన్‌చార్జికి ఇప్పుడు ఏకంగా చైర్మన్ పదవి లభించింది. శ్రీకాకుళం జిల్లాలో కాళింగ సామాజిక వర్గానికి చెందిన వజ్జా బాబూరావు ఇటీవలి ఎన్నికల్లో ఒక ప్రాంతంలో క్లస్టర్ ఇన్‌చార్జిగా పనిచేశారు. ఆయన్ను రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్‌గా నియమించారు. చైర్మన్, డైరెక్టర్లు కలిపి మొదటి జాబితాలో 99 మందికి చోటు కల్పించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా టీడీపీ తన అభ్యర్థులకు సంబంధించి 99 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేయడం విశేషం. వీరిలో 11 మంది క్లస్టర్ ఇన్‌చార్జులు ఉన్నారు. ఆరుగురు యూనిట్ ఇన్‌చార్జులకు డైరెక్టర్ పదవులు దక్కాయి. 20 చైర్మన్ పదవుల్లో 16 టీడీపీ, మూడు జనసేన, ఒకటి బీజేపీకి లభించాయి. డైరెక్టర్ల పదవులను కూడా కూటమి పార్టీల మధ్య పంచారు.
త్యాగరాజులు వీరే..
తమ నియోజకవర్గాల్లో కొంతకాలం పనిచేసి తర్వాత రకరకాల కారణాలతో సీటు త్యాగం చేసిన 8 మంది టీడీపీ నేతలకు ఈ జాబితాలో చైర్మన్ పదవులు లభించాయి. వీరిలో మచిలీపట్నానికి చెందిన మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, పోలవరం మాజీ ఎమ్మెల్యే బొరగం శ్రీనివాసులు, నెల్లిమర్ల టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు, డోన్ నియోజకవర్గానికి చెందిన మన్నె సుబ్బారెడ్డి, ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే పీతల సుజాత ఉన్నారు. వీరిలో నలుగురు మిత్రపక్షాల కోసం సీట్లు త్యాగం చేయగా.. మరో నలుగురు సొంత పార్టీ నేతల కోసం త్యాగం చేశారు. ఉదాహరణకు నాటి ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు అవకాశం కల్పించడం కోసం తాను పోటీ నుంచి వైదొలిగారు. అలాగే నెల్లూరులో నారాయణ అబ్దుల్ అజీజ్ తప్పుకొన్నారు. వారిద్దరికీ ఇప్పుడు పదవులు లభించాయి. మిత్రపక్షాలకు సీట్లు పోవడం వల్ల బొరగం శ్రీనివాసులు, బంగార్రాజు, పీలా గోవింద్ పోటీ చేయలేకపోయారు. వారికి కూడా నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం ఇచ్చారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్సీలకు రిజర్వు అయిన 3 అసెంబ్లీ సీట్లను టీడీపీ అధిష్ఠానం మాదిగ వర్గానికి కేటాయించింది. సామాజిక సమతుల్యత కోసం మాల సామాజిక వర్గానికి చెందిన పీతల సుజాతకు తాజాగా రాష్ట్ర వినియోగదారుల పరిరక్షణ మండలి చైర్‌పర్సన్ పదవి ఇచ్చారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన పార్టీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావుకు కూడా లిడ్‌క్యాప్ చైర్మన్ పదవి లభించింది. మంత్రి లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వారు అధికంగా ఉండడంతో ఆ వర్గానికి చెందిన నందం అబద్ధయ్యకు రాష్ట్ర పద్మశాలి సంక్షేమ-అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా అవకాశమిచ్చారు. లోకేశ్ పాదయాత్రలో వాలంటీర్ల విభాగం కన్వీనర్‌గా పనిచేసిన తెలుగు యువత నేత రవి నాయుడికి శాప్ చైర్మన్ పదవి దక్కింది. అనేక మంది ఆశలు పెట్టుకున్న పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి ఒంగోలు జిల్లా పార్టీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ యాదవ్‌కు ఇచ్చారు. ఆయనతోపాటు ఎన్నికల సమయంలో జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన నలుగురికి పదవులు దక్కాయి. వీరిలో కొనకళ్ల నారాయణ (కృష్ణా), అబ్దుల్ అజీజ్ (నెల్లూరు), బత్తుల తాతయ్య (అనకాపల్లి) ఉన్నారు. కుప్పంలో పార్టీ సీనియర్ నేత, బీసీ వర్గాలకు చెందిన పీఎస్ మునిరత్నానికి ఆర్టీసీ వైస్ చైర్మన్ పదవి లభించింది. దామచర్ల సత్యకు కూడా కీలకమైన ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ పదవి లభించింది. మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి మేనల్లుడు, పార్టీ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డికి కొత్త ఉద్యోగాల కల్పనకు సంబంధించిన సీడాప్ చైర్మన్ పదవిని ఇచ్చారు.
డైరెక్టర్లలో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు
కార్పొరేషన్లకు డైరెక్టర్లుగా వేసిన వారిలో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉండడం విశేషం. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి పరసా రత్నాన్ని మార్క్‌ఫెడ్ డైరెక్టర్‌గా నియమించారు. రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు, సాలూరు మాజీ ఎమ్మెల్యే ఆర్‌పీ భాంజుదేవ్‌ను పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్లుగా నియమితులయ్యారు.
డైరెక్టర్ పదవి వద్దన్న శిష్ట్లా లోహిత్
పౌర సరఫరాల సంస్థలో డైరెక్టర్‌గా నియమితులైన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్ తనకు ఆ పదవి వద్దని పార్టీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబుకు మంగళవారం సాయంత్రం లేఖ రాశారు. ‘నాకు ఈ పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీరు అభిమానంతో ఇచ్చిన ఈ పదవిని తీసుకోవడానికి సిద్ధంగా లేను. నాకు కేటాయించిన ఈ పదవిని పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న మరెవరికైనా కేటాయించాలని నా మనవి. పదవి ఉన్నా, లేకున్నా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అని అందులో పేర్కొన్నారు.