తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేస్తే.. కొండ దిగేలోపు కేసు
ABN , Publish Date - Nov 13 , 2024 | 04:41 AM
తిరుమల కొండపై రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేస్తే కొండ దిగే లోపు కేసు పెట్టిస్తామని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు.

అన్యమతస్థులు టీటీడీలో ఉండొద్దు: భానుప్రకాశ్ రెడ్డి
అమరావతి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): తిరుమల కొండపై రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేస్తే కొండ దిగే లోపు కేసు పెట్టిస్తామని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు. స్వామి వారి సొమ్ముని జీతంగా తీసుకొంటూ ఆయన ప్రసాదం కూడా ముట్టని అన్యమతస్థులు తిరుమల దేవస్థానంలో ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. హిందూ ఆలయాలపై దాడులు, విగ్రహాలు మాయం, పవిత్రతకు భంగం కలిగిస్తూ కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని గాయపరిచిన వైసీపీ ప్రభుత్వం భూస్థాపితమైందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అటువంటి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఒక ఆంబోతు తిరుమలకు వచ్చి దేవుడి దర్శనం చేసుకోవాలి తప్ప అన్యమతస్థుడి ఫోటో చొక్కాపై వేసుకుని రాజకీయ వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. కొండపైకి వచ్చిన ఏ పార్టీ రాజకీయ నాయకుడైనా ఆలయ నియమనిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టంచేశారు. ‘జగన్‌కు అధికారం ఇచ్చినప్పుడు ప్యాలె్‌సలో ఉన్నారు.. అదే ప్రజలు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. కనీసం ఎమ్మెల్యేగా అయినా సభకు రాకపోతే వచ్చే ఎన్నికల్లో అది కూడా లేకుండా ఇదే ప్రజలు చేస్తారు’ అని భానుప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు.