Share News

భళా మోదీ!

ABN , Publish Date - May 09 , 2024 | 03:45 AM

విజయవాడ నడిబొడ్డున బందరు రోడ్డుపై 1.8 కిలోమీటర్ల మేర కిక్కిరిసిన జనసమూహం మధ్య ప్రధాని మోదీ రోడ్డు షో సాగింది.

భళా మోదీ!

బెజవాడ గడ్డపై అపూర్వ రోడ్‌షో

1.8 కిలోమీటర్లు.. గంట సాగిన ర్యాలీ

వాహనంపై ఆయనతో బాబు, పవన్‌

ఎంజీ రోడ్డుకు ఇరుపక్కలా జనసమూహం

ప్రధానికి సాదరంగా స్వాగతం

భారీగా తరలివచ్చిన రాజధాని అమరావతి రైతులు

బలిదానాలపై ప్లకార్డుల ప్రదర్శన

విజయవాడ, మే 8 (ఆంధ్రజ్యోతి): విజయవాడ నడిబొడ్డున బందరు రోడ్డుపై 1.8 కిలోమీటర్ల మేర కిక్కిరిసిన జనసమూహం మధ్య ప్రధాని మోదీ రోడ్డు షో సాగింది. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్లో రోడ్డు షోలు నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా విజయవాడ గడ్డపై రోడ్‌షో నిర్వహించారు. తిరుపతి నుంచి ఆయన బుధవారం ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, బీజేపీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం వరకు చేరుకున్నారు. రాత్రి ఏడు గంటలకు రోడ్డు షో నిర్వహించారు. వాహనంపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉన్నారు. మహాత్మాగాంధీ (ఎంజీ) రోడ్డుకు ఇరువైపులా గ్యాలరీల్లో ఉన్న ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. మోదీ కాన్వాయ్‌కు ముందు బీజేపీకి చెందిన మహిళలు పార్టీ జెండాలతో నడిచారు. ఎంజీ రోడ్డులో 1.8 కిలోమీటర్ల మేర గంటపాటు ఈ రోడ్‌షో జరిగింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలు, మూడు పార్టీల అభిమానులతో గ్యాలరీలు కిక్కిరిశాయి. యాత్ర సాగుతున్నంత సేపూ ‘నమో నమో నరేంద్ర మోదీ’, ‘జై చంద్రబాబు’, ‘బాబులకే బాబు కల్యాణ్‌బాబు’ అంటూ నినాదాలు చేశారు. రాజధాని అమరావతి రైతులు 1,604 రోజులుగా అమరావతి రైతులు ఆందోళన చేస్తున్నారని, 251 మంది బలిదానాలు చేసుకున్నారని ప్లకార్డులు ప్రదర్శించారు. అమరావతి నుంచి రైతులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఎంజీ రోడ్డు నుంచి బెంజ్‌సర్కిల్‌ వరకు మధ్యమధ్యలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి వేదికలు ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల రీత్యా వాటిని తొలగించేశారు. రోడ్డు షో ముగిసిన బెంజ్‌సర్కిల్‌ వద్ద మాత్రం డప్పుల వాయిద్యాలతో ప్రధానికి స్వాగతం పలికారు.

మరచిపోలేని రోడ్‌ షో: మోదీ ట్వీట్‌

విజయవాడ రోడ్‌షో మరచిపోలేని స్థాయిలో జరిగిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో పలుచోట్ల పర్యటించిన తర్వాత ప్రజలు ఎన్డీయేని భారీగా గెలిపించబోతున్నారన్న నమ్మకం నాకు కలిగింది. మహిళలు, యువత ఈ ఊపును బాగా ముందుకు తీసుకెళ్తున్నారు’ అని రోడ్‌ షో తర్వాత ‘ఎక్స్‌’లో ట్వీట్‌ చేశారు.

నేను పులకించిపోయాను..: చంద్రబాబు

విజయవాడ రోడ్‌ షోకు ప్రజల నుంచి వచ్చిన అపూర్వ ఆదరణతో తాను పులకించిపోయానని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘చరిత్ర సృష్టించే విజయవాడలో నా అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు చూపించిన అభిమానం నన్ను కదిలించింది. మొత్తం వాతావరణమంతా ఉత్సాహం, ఆశాభావంతో నిండిపోయింది. ప్రధాని మోదీ, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పట్ల ఎనలేని ఆప్యాయత చూపించారు. జూన్‌ 4న ఆంధ్ర కొత్త ఉషోదయం ఖాయం’ అని ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.

Updated Date - May 09 , 2024 | 03:45 AM