Share News

భద్రగిరి దాశరధికి 14న శ్రీనివాస్ మంత్ర నైవేద్యం

ABN , Publish Date - Apr 11 , 2024 | 12:36 AM

ఈ సారి శ్రీ సీతారామచంద్ర దేవస్థానం కార్యనిర్వహణాధికారిణి ఎల్. రమాదేవి సమర్ధ సేవలతో ప్రత్యేక శోభతో విరాజిల్లనున్న భద్రాద్రి కళ్యాణవేదిక సాక్షిగా ‘శ్రీరామరక్షా స్తోత్రం’ గ్రంధం భక్త పాఠకులను అలరించబోతోంది.

భద్రగిరి దాశరధికి 14న శ్రీనివాస్ మంత్ర నైవేద్యం

భద్రాచలం, ఏప్రిల్ 10: మానవ జీవన సౌందర్యాన్ని అద్భుతంగా దర్శించేసే రామాయణ కథలో విరాట్ స్వరూపుడైన ఆదర్శపురుషుడు శ్రీరామచంద్రుని పరమభక్తుని రసవత్ఘట్టంగా సాక్షాత్కరించిన అపూర్వ క్షేత్రం భద్రాద్రిలో ప్రతీ ఏటా శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా జరిగే కళ్యాణ క్రతువు కోసం కోట్లాది భారతీయులు వందల సంవత్సరాలుగా వేచి చూడటం... ఈ కళ్యాణం చూసినంతనే పులకించిపోవడం తరాలుగా జరుగుతున్న మంగళ అంశమే. ఈ మంగళ కళ్యాణవేళ విచ్చేసే వేల వేల భక్తుల కోసం తెలంగాణ ప్రభుత్వ పర్యవేక్షణలో శ్రీ సీతారామచంద్ర దేవస్థానం భారీ ఏర్పాట్లనే చేస్తుందనేది మనందరికీ తెలుసున్న సత్యం. ఈ సంవత్సరం ఈ పవిత్ర ఏర్పాట్లను సంప్రదాయబద్ధంగా, ఇంకా అద్భుతమైన రీతిలో శ్రీ సీతారామచంద్ర దేవస్థానం కార్యనిర్వహణాధికారిణి ఎల్. రమాదేవి జరుపుతున్నట్లు ఆలయవర్గాలు పేర్కొన్నాయి.

ఈసారి మరొక ప్రత్యేకమేమంటే... శ్రీసీతారాముల కల్యాణాన్ని వీక్షించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసే గేలరీలో కూర్చునే వేలాది భక్తులకు ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ రచన సంకలనంగా అద్భుతమైన రీతిలో రూపుదిద్దుకున్న ‘శ్రీరామరక్షా స్తోత్రం’ మంగళ గ్రంధాన్ని ఆలయ సిబ్బంది సమర్పిస్తుండటం గమనార్హం. గతంలో భద్రాద్రి బ్రహ్మోత్సవాలకు ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘వారాహి చలన చిత్రం’ అధినేత సాయికొర్రపాటి సమర్పించిన అఖండ గ్రంధాలకు కూడా పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలన కర్త కావడం విశేషం.

Temple-EO.jpg

ఈ సారి శ్రీ సీతారామచంద్ర దేవస్థానం కార్యనిర్వహణాధికారిణి ఎల్. రమాదేవి సమర్ధ సేవలతో ప్రత్యేక శోభతో విరాజిల్లనున్న భద్రాద్రి కళ్యాణవేదిక సాక్షిగా ఈ అద్భుత గ్రంధం భక్త పాఠకులను అలరించబోతోంది. ఈ పుస్తకాన్ని సమర్పిస్తున్న ఎస్.ఎస్.రాజమౌళి, ఎం.ఎం.కీరవాణి., సాయి కొర్రపాటిలతో పాటు ఈ దివ్యగ్రంధాన్ని ఈ కళ్యాణ కార్యంలో వితరణ చేయిస్తున్న ఎల్. రమాదేవికి, రచయిత పురాణపండ శ్రీనివాస్‌కి ప్రచురణకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. యుగాలుగా ఎన్నో ఆపదల నుండి, ఎందరినో రక్షించి... మహోన్నతులుగా మార్చిన అద్భుత అమోఘ స్తోత్రముగా శ్రీరామరక్షా స్తోత్రం కోట్లాది హృదయాలను ఆకట్టుకుందని దేవస్థాన అర్చక పండిత వర్గాలు పేర్కొన్నాయి.

ఈ మహిమోపేత శ్రీరామరక్షా స్తోత్రమ్ గ్రంధాన్ని ఏప్రిల్ 14వ తేదీన శ్రీ సీతారామచంద్ర దేవస్థానం కార్యనిర్వహణాధికారిణి ఎల్. రమాదేవి ఆవిష్కరిస్తారు. తెలుగునాట లక్షల భక్తులకు ఈ అఖండ స్తోత్రమ్ చేరడానికి మొట్టమొదటి కారకులు ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త, భాగవతమందిరం సంస్థాపకులు పురాణపండ రాధాకృష్ణమూర్తి తపస్సేనని, ఆయనను జాతి ఎల్లవేళలా గుర్తుంచుకోవాలని భారతదేశ పూర్వ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు గతంలో చెప్పిన అంశాన్ని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలని పండితవర్గాలు బృందాలుగా చెప్పడం కూడా భద్రాద్రి శ్రీరాముని అనుగ్రహమే!

Updated Date - Apr 11 , 2024 | 12:48 AM