‘ఎసెన్షియా’ మరువకముందే... పరవాడ ఫార్మాసిటీ ‘సినర్జిన్’లో ప్రమాదం
ABN , Publish Date - Aug 24 , 2024 | 05:20 AM
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఎసెన్షియా విషాదకర సంఘటన వెంటాడుతుండగానే, అదే జిల్లాలో పరవాడ వద్దగల ఫార్మా సిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రేడియంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ యూనిట్-3లో గురువారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది.
రసాయనాలు ఎగసిపడి నలుగురికిగాయాలు
పరవాడ (అనకాపల్లి జిల్లా), ఆగస్టు 23: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఎసెన్షియా విషాదకర సంఘటన వెంటాడుతుండగానే, అదే జిల్లాలో పరవాడ వద్దగల ఫార్మా సిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రేడియంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ యూనిట్-3లో గురువారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. రియాక్టర్ మ్యాన్‌హోల్ నుంచి రసాయనాలు ఎగసిపడడంతో అక్కడ పనిచేస్తున్న కెమిస్ట్, ముగ్గురు హెల్పర్లు తీవ్రంగా గాయపడ్డారు. పరిశ్రమ బి-బ్లాక్ మొదటి అంతస్థులో విజయనగరం జిల్లాకు చెందిన కెమిస్ట్ సూర్యనారాయణ పర్యవేక్షణలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన హెల్పర్లు రోయా అర్జి (23), లాల్‌సింగ్ (23), వయాబన్‌కోహా (23) పనిచేస్తున్నారు. 6కేఎల్ సామర్థ్యం గల రియాక్టర్‌లో లొసస్ట్రాన్(ఎల్‌ఓ) కెమికల్ వేసి చార్జ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రియాక్టర్ మ్యాన్‌హోల్ నుంచి ఒక్కసారిగా స్పార్క్ (స్థిర విద్యుత్) రావడంతో రసాయనాలు ఎగసి ఆ నలుగురిపై పడ్డాయి. దీంతో వారంతా తీవ్రంగా గాయపడ్డారు. సూర్యనారాయణ శరీరం 30శాతానికి పైగా కాలిపోయింది. యాజమాన్యం క్షతగాత్రులను విశాఖలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించింది. వీరంతా నాలుగేళ్లుగా ఈ పరిశ్రమలో పనిచేస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ దీపిక, ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు సందర్శించారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ ఫార్మాసిటీలో తరచూ ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రమాదాల నివారణకు త్వరలో ఫార్మాసిటీలోని యాజమాన్యాలతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.