Share News

బీసీలది శాసించే స్థాయి

ABN , Publish Date - Mar 06 , 2024 | 04:28 AM

‘బీసీలే దేశానికి వెన్నెముక. వారికి సాధికారత ఉండాలి. బీసీలు శాసించే స్థాయిలో ఉండాలి’ అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

బీసీలది శాసించే స్థాయి

వైసీపీ పాలనలో వారి పొట్టగొట్టారు.. బడ్జెట్‌ కేటాయింపుల్లోనూ మోసం

పథకాల్లో లబ్ధిదారులకు కోత విధింపు.. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తగ్గింపు

శాశ్వత బీసీ కమిషన్‌ హామీ ఊసేలేదు.. పేరుకే కార్పొరేషన్లు.. నిధుల్లేక నిర్వీర్యం

బీసీ డిక్లరేషన్‌కు మా మద్దతు.. జయహో బీసీ సభలో పవన్‌ కల్యాణ్‌

అమరావతి, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ‘బీసీలే దేశానికి వెన్నెముక. వారికి సాధికారత ఉండాలి. బీసీలు శాసించే స్థాయిలో ఉండాలి’ అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి మూడు నెలల్లోనే బీసీల పొట్టకొట్టారని ఆయన ఆరోపించారు. టీడీపీ-జనసేన ఉమ్మడిగా మంగళగిరిలో నిర్వహించిన జయహో బీసీ సభలో పవన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు. జగన్‌ మాటలు నమ్మి చాలామంది బీసీ నాయకులు వైసీపీలోకి వెళ్లారని, కానీ.. వారిని కూడా జగన్‌ మోసం చేశారని వ్యాఖ్యానించారు. ‘‘సీఎం జగన్‌ బీసీలకు ఏటా 15 వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్లల్లో బీసీ సంక్షేమానికి రూ.75 వేల కోట్లు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. బీసీ కేటగిరీల్లో 153 కులాలను గుర్తించి, 139 కార్పొరేషన్లు పెడతామన్నారు. కేవలం 56 కార్పొరేషన్లు పెట్టి.. వాటికి బడ్జెట్‌ కేటాయించకుండా, కనీసం కుర్చీలు కూడా లేకుండా చేశారు. చేయూత కింద 45 ఏళ్లు దాటి మహిళలకు రూ.75 వేలు ఇస్తామని లబ్ధిదారుల సంఖ్యలో కోత విధించారు. శాశ్వత బీసీ కమిషన్‌ ఏర్పాటు చేస్తామన్నారు కానీ, ఇప్పటి వరకూ ఆ ఊసే ఎత్తేలేదు. బడ్జెట్‌లో మూడోవంతు బీసీలకు కేటాయిస్తామని చెప్పి విస్మరించారు. వైసీపీ పాలనలో 23 వేల మంది బీసీలపై కేసులు పెట్టారు. 300 మంది బీసీలను చంపేశారు. అచ్చెన్నాయుడు వంటి వారిపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారు. వైసీపీలో ఒక్క బీసీ నాయకుడు కూడా ఈ అరాచకాలపై మాట్లాడలేదు. వైసీపీ అడ్డగోలు తనానికి ఆ పార్టీలోని బీసీ నేతలు అండగా నిలిస్తే తమ కులానికి ద్రోహం చేసిన వారవుతారు. ఈ సంఘటనలు చూసిన తర్వాత వైసీపీ పాలనలో బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం కావాలని అర్థమవుతోంది. దీనికి నేను మనస్ఫూర్తిగా మద్ధతు తెలుపుతున్నాను’’ అని అన్నారు.

బీసీలకు సాధికారత కావాలి..

‘‘బీసీలకు సాధికారత ఉండాలి. దీంతో పాటు బీసీ కులాల మధ్య ఐక్యత కూడా ఉండాలి. సంఖ్యాబలం ఉన్న కులాలే కాదు. అల్పసంఖ్యలో ఉన్న కులాలు కూడా ఎక్కువ అభివృద్ధి చెందాలి. బీసీలు శాసించే స్థాయిలో ఉండాలి. బీసీ కులాలను దేవాలయాలకు అనుసంధానం చేయాలి. అప్పుడు వారికి ఆర్థికపరిపుష్టి కలుగుతుంది. ఈ విషయాన్ని కూడా టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తాం. వడ్డెర కులస్థులు పని ప్రదేశాల్లో గాయాలపాలవుతున్నారు. కాంట్రాక్ట్‌ వ్యవస్థల్లో నలిగిపోతున్నారు. కర్నూలు పర్యటనలో నేను వారి పరిస్థితి చూశాను. అలాంటి వారికి ఆర్థిక పరిపుష్టి తీసుకొచ్చేందుకు కృషిచేయాలి. బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చినవి కాకుండా.. యువత, మహిళలు, పెద్దలు ఆర్థికంగా ఎదిగేలా టీడీపీ-జనసేన కలిసి మంచి పథకాలను రూపొందిస్తాయి. 900 కిలోమీటర్లకుపైగా సముద్రతీరం ఉన్నా ఉపాధి లేకుండా మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ-జనసేనలు మత్స్యకారులకు అండగా ఉంటాయి. వారి కోసం ప్రతి 30 కిలోమీటర్లకు ఒక జెట్టీని ఏర్పాటు చేయాలి. ఈ విషయాన్ని కూడా చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి, టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటు కాగానే దానిపై దృష్టిపెడతాం. మత్య్సకారుల పిల్లల కోసం ఆశ్రమ పాఠశాలలు స్థాపించాలి. స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం రాగానే.. బీసీలకు తిరిగి 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. బీసీలపై దాడులు జరిగితే మా ప్రాణాల అడ్డేసి కాపాడుకుంటాం. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న నిర్ణయం కూడా బీసీల కోసమే తీసుకున్నాం. టీడీపీ బీసీలకు అత్యంత అండగా ఉన్న పార్టీ. వెనుకబడిన కులాలకు అండగా ఉన్నందుకు ఎన్టీ రామారావును స్మరించుకోవాలి. బీసీ డిక్లరేషన్‌కు జనసేన మద్దతు ఉంటుంది. బీసీల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తాం. బీసీలు రాజ్యాధికారం సాధించాలని ఆకాంక్షిస్తున్నా’’ అని పవన్‌కల్యాణ్‌ చెప్పారు.

Updated Date - Mar 06 , 2024 | 04:28 AM