Share News

జగన్‌ ప్రభుత్వానికి పాడె కట్టేది బీసీలే

ABN , Publish Date - Mar 06 , 2024 | 03:55 AM

బీసీలను అనేక రకాలుగా వేధించి, దాడులు చేసి, హత్యలు చేయించిన జగన్‌ ప్రభుత్వానికి బీసీలే పాడె కడతారు. మేదరివాళ్లు పాడె కడతారు.

జగన్‌ ప్రభుత్వానికి పాడె కట్టేది బీసీలే

రాష్ట్రం నుంచి తరిమికొట్టేది వారే

‘జయహో బీసీ‘లో గర్జించిన బీసీ నేతలు

గుంటూరు, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ‘బీసీలను అనేక రకాలుగా వేధించి, దాడులు చేసి, హత్యలు చేయించిన జగన్‌ ప్రభుత్వానికి బీసీలే పాడె కడతారు. మేదరివాళ్లు పాడె కడతారు. చేనేతలు పాడెపై కప్పే గుడ్డ నేసిస్తారు. కుమ్మరివారు పాడె కుండ చేసిస్తారు.. ఇలా ఒక్కో బీసీ వర్గం ఒక్కో రూపంలో జగన్‌ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో పాడె కడుతుంది. జగన్‌కు రాజకీయ సమాధి కట్టే బాధ్యత బీసీలదే. రాష్ట్రంనుంచి తరిమికొట్టేది బీసీలే!’ అంటూ బీసీ నేతలు విరుచుకుపడ్డారు. మంగళవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట ఉన్న బైబిల్‌ గ్రౌండ్స్‌లో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్రస్థాయి ‘జయహో బీసీ’ సభకు లక్షలాదిమంది హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ సీనియర్‌ నేతలు ప్రసంగించారు.

జగన్‌ పార్టీని బంగాళాఖాతంలో కలపాలి

టీడీపీ ఆవిర్భావంతోనే బీసీలకు రాజకీయ అవకాశాలు లభించాయి. టీడీపీ వెంటే వారు ఉన్నారనే అక్కసుతో జగన్‌ కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. ఏ తప్పూ చేయకపోయి నా నన్ను అక్రమంగా అరెస్టు చేసి 80రోజులు జైల్లో పెట్టారు. విధ్వంసకర పాలనతో రాష్ట్రాన్ని జగన్‌ సర్వనాశనం చేశాడు.

- అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు

డబ్బుల్లేని బీసీలకు రాజకీయావకాశాలు దక్కాలి

టీడీపీ వచ్చిన తర్వాతనే బీసీలకు సంక్షేమ ఫలాలు దక్కాయి. దృఢ సంకల్పంతోనే అన్న ఎన్టీఆర్‌ బీసీలకు సామాజిక న్యాయం చేశారు. వారు రాజకీయంగా, సామాజికంగా, అభివృద్ధిపరంగా పైకి వచ్చారంటే ఆయనే కారణం. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ బీసీవర్గాలకు చేయాల్సింది చాలా ఉంది.

- యనమల రామకృష్ణుడు, మాజీ మంత్రి

బీసీల రాజకీయ భవిష్యత్‌కు దిశానిర్దేశం

బీసీలు రాజకీయ భవిష్యత్‌ను నిర్ణయించుకోవాల్సిన సమ యం ఆసన్నమైంది. జగన్‌ మోసపూరిత వాగ్దానాలతో బీసీలను వంచించారు. కుర్చీలు లేని కార్పొరేషన్లు ఇచ్చి మోసం చేశారు. జగన్‌, బీసీ మంత్రులు, సజ్జల నా సవాల్‌ను స్వీకరించి ఒక్క కార్పొరేషన్‌కైనా ఒక్క రూపాయి కేటాయించారేమో చెప్పాలి.

- పితాని సత్యనారాయణ, మాజీ మంత్రి

రాష్ట్రం నుంచి తన్ని తరిమేయాలి

జగన్‌ను రాష్ట్రం నుంచి తన్ని తరిమేయాల్సిన పరిస్థితి వచ్చింది. లెక్కలేనన్ని అరాచకాలు, అక్రమాలు చేసిన వైపీపీ పాలనకు పాడెకట్టాలి.

- కాల్వ శ్రీనివాసులు, మాజీ మంత్రి

చేనేతను ఆదుకున్నది చంద్రబాబే

సంక్షోభంలో ఉన్న చేనేతను ఆదుకున్నది చంద్రబాబు ప్రభుత్వమే. టీడీపీ ప్రభుత్వం చేనేత సంరక్షణకు నూలు, రంగులపై సబ్సిడీ ఇచ్చింది. చేనేత సహాయ నిధి, పొదుపు నిధి, రంగుల కోసం రూ.25కోట్లు, మూల ధనం కింద రూ.30 కోట్లు, మరమగ్గాలకు రాయితీ కింద రూ.80కోట్లు కేటాయించి ఖర్చు చేసింది.

- ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ

బీసీలను పల్లకీ ఎక్కేలా చేసింది ఎన్టీఆర్‌

బీసీలు పల్లకీ మోయడం కాదు.. వారిని పల్లకి ఎక్కేలా చేసిన ఘనత ఎన్టీఆర్‌ది. బీసీ రాజకీయాలకు ఎన్టీఆర్‌ పునాదులు వేయబట్టే ఎర్రన్నాయుడు, ఆయన వారసుడిగా నేను రాష్ట్ర, దేశ రాజకీయాల్లో గళంవినిపించగలిగాం. నమ్మితే ప్రాణమిచ్చే బీసీలు.. తేడావస్తే తాట తీస్తారని జగన్‌కు తెలిసేలా చేయాలి. - ఎంపీ రామ్మోహన్‌నాయుడు

బీసీలంతా ప్రమాణం చేయాలి..

సభలో బీసీలంతా ప్రమాణం తీసుకోవాలి. ఇక్కడి నుంచి వెళ్లేలోపు బీసీ ద్రోహి జగన్‌ ఓడించడానికి కంకణబద్ధులవ్వాలి. జనాభాలో 60శాతంగా ఉన్న బీసీలు చేయలేనిదంటూ ఏమీ లేదు. పదవులు బీసీలకు ఇచ్చి, అధికారాలన్నీ వారి సామాజికి వర్గానికి చెందిన రెడ్లకు ఇచ్చుకున్నాడు. ఆ ఆరుగురు రెడ్లదే రాష్ట్రంలోని అధికారమంతా.

- గౌతు శిరీష

పాడె కట్టాలంటే బీసీలే కావాలి

జగన్‌ ప్రభుత్వానికి పాడె కట్టడం బీసీల వల్లే అవుతుంది. మేదరివాళ్లు పాడె కడితే, దాని మీదకు గుడ్డ నేసేది.. బట్టకంటిన మైలను శుభ్రం చేసేది.. పాడె వెంట తీసుకెళ్లే కుండ చేసేది.. అన్నీ బీసీలే. వచ్చే ఎన్నికల్లో జగన్‌ ప్రభుత్వానికి బీసీలే పాడె కడతారు.

- బోనబోయిన శ్రీనివా్‌సయాదవ్‌, జనసేన

బీసీల ఆత్మగౌరవానికి అండ పవన్‌

బీసీల ఆత్మగౌరవానికి అండగా ఉండడానికి జనసేన అధినేత ముందుకొచ్చారు. జగన్‌ పాలనలో ఉత్తుత్తి కార్పొరేషన్లు, ఉత్తుత్తి పదవులతో బీసీలను వంచించారు. దీనికి బీసీలు తగిన సమాధానం చెప్పి తీరుతారు.

- చిల్లపల్లి శ్రీనివాసరావు, జనసేన

Updated Date - Mar 06 , 2024 | 03:55 AM