Share News

TDP: పెన్షన్ నుంచి ప్రత్యేక చట్టం వరకు.. బీసీ డిక్లరేషన్‌‌లోని 10 అంశాలివే!

ABN , Publish Date - Mar 06 , 2024 | 04:39 AM

బీసీలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ 50 ఏళ్లకే పెన్షన్లు మంజూరు చేస్తాం. అంతేకాదు.. ఆ పెన్షన్‌ మొత్తం కూడా రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతాం.

TDP: పెన్షన్ నుంచి ప్రత్యేక చట్టం వరకు.. బీసీ డిక్లరేషన్‌‌లోని 10 అంశాలివే!

వారి DNA లో TDP ఉంది : చంద్రబాబు

బీసీలను పల్లకీ మోసే బోయీలుగా మాత్రమే కొందరు పరిగణిస్తున్నారు. తాము పల్లకీలో కూర్చుని వారితో మోయిస్తున్నారు. ఈ పరిస్థితిని మేం మారుస్తాం.

బీసీల కోసం మేం పెట్టిన ప్రతి పథకాన్నీ జగన్‌ నీరుగార్చారు. ఆయన ఐదేళ్ల పాలనలో రాష్ట్రం ఎంతో నష్టపోయింది. ప్రతి వర్గమూ దెబ్బతింది.

- చంద్రబాబు

  1. ఇదీ బీసీల డిక్లరేషన్‌50 ఏళ్లకే పెన్షన్‌

బీసీలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ 50 ఏళ్లకే పెన్షన్లు మంజూరు చేస్తాం. అంతేకాదు.. ఆ పెన్షన్‌ మొత్తం కూడా రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతాం. గతంలో ఎస్టీలకు 50 ఏళ్లకే పెన్షన్‌ ఇచ్చాం. ఇప్పుడు దానిని బీసీలకూ వర్తింపజేస్తాం.

2.ప్రత్యేక రక్షణ చట్టం..

సమాజంలో బీసీలకు ఉన్నతమైన గౌరవం దక్కడానికి.. వారిపై సామాజికంగా దాడులు జరగకుండా నివారించేందుకు.. ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. ఎస్సీ, ఎస్టీలపైనేగాక బీసీల్లోని కొన్ని కులాలపైనా దాడులు పెరిగాయి. జగన్‌ పాలనలో సుమారు 350 మందికి పైగా బీసీలను దారుణంగా హత్య చేశారు. దౌర్జన్యాల నుంచి వారికి సామాజికంగా రక్షణ కల్పించేందుకు ప్రత్యేకంగా పదునైన చట్టం తీసుకొస్తాం. ఇందుకోసం సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటు చేసి వారి హక్కులను కాపాడతాం.

3 .సబ్‌ప్లాన్‌కు ఐదేళ్లలో లక్షన్నర కోట్లు..

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.75 వేల కోట్ల సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లించింది. టీడీపీ-జనసేన వచ్చిన తర్వాత ఏడాదికి రూ.30 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్ల బీసీ సబ్‌ప్లాన్‌ నిధులు బీసీల కోసమే వినియోగించేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

4 .స్థానిక సంస్థల్లో 34ు రిజర్వేషన్లు..

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను జగన్‌ ప్రభుత్వం 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించింది. వారికి 16,800 పదవులు దూరం చేసింది. టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వచ్చాక మునుపటి 34 శాతం రిజర్వేషన్లను పునరుద్ధరిస్తాం. అలాగే చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం. అన్ని సంస్థలు, నామినేటెడ్‌ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తాం. తక్కువ జనాభా ఉండి ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు కోఆప్షన్‌ సభ్యులుగా అవకాశమిస్తాం.

5.ఆర్థికాభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహకాల పునరుద్ధరణ

జనాభా ప్రాతిపదికన బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తాం. స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తాం. ఆదరణ లాంటి పథకాలను జగన్‌ రద్దు చేశారు. రూ.5 వేల కోట్లతో ఆదరణ పరికరాలు అందిస్తాం. మండల/నియోజకవర్గ కేంద్రాల్లో కామన్‌ వర్క్‌ షెడ్స్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్స్‌ ఏర్పాటు చేస్తాం. జగన్‌ రద్దు చేసిన పారిశ్రామిక ప్రోత్సాహకాలు పునరుద్ధరిస్తాం.

6.చట్టబద్ధంగా కులగణన

7.రూ.10 లక్షలతో చంద్రన్న బీమా పునరుద్ధరణ. పెళ్లి కానుక రూ.లక్షకు పెంపు

8.శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తాం

9.విద్యా పథకాల పునరుద్ధరణ

టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తే విద్యాపథకాలన్నీ మళ్లీ అమలు చేస్తాం. నియోజకవర్గాల్లోని రెసిడెన్షియల్‌ స్కూళ్లను జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేస్తాం. షరతులు లేకుండా విదేశీ విద్య అమలు చేస్తాం. పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పునరుద్ధరిస్తాం. స్టడీ సర్కిల్‌, విద్యోన్నతి పథకాలు పునఃప్రారంభిస్తాం.

10. బీసీలకు ప్రత్యేక

భవనాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను ఏడాదిలో పూర్తి చేస్తాం

జగన్‌ బీసీ నేతల గొంతు కోశారు

కొందరికి టికెట్లు ఎగ్గొట్టారు

మరి మంత్రి పెద్దిరెడ్డి జోలికి వెళ్లరేం?

రాష్ట్రాన్ని నలుగురికి పంచి..

సామాజిక న్యాయమంటూ కబుర్లు

ఈ ఐదేళ్లలో బీసీలకు తీవ్ర నష్టం: బాబు

‘జయహో బీసీ’ సభకు భారీగా జనం.. 10 అంశాలతో బీసీ డిక్లరేషన్‌

40 ఏళ్లుగా అక్కున చేర్చుకున్నారు

రుణం తీర్చుకోవడానికే ప్రత్యేక డిక్లరేషన్‌

బీసీలు లేకపోతే నాగరికత లేదు

చిన్నా పెద్దా అన్ని కులాలకూ నిధులిస్తాం

రాజకీయంగా, ఆర్థికంగా పైకి తెస్తాం

‘జయహో బీసీ’ సభలో టీడీపీ అధినేత

అమరావతి, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీసీ వర్గాల డీఎన్‌ఏలోనే టీడీపీ ఉందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘40 ఏళ్లుగా బీసీలు ఈ పార్టీని ఆదరించారు. అక్కున చేర్చుకున్నారు. తమ ఇంటి పార్టీగా భావించారు. జ్యోతిరావు ఫూలే ఆదర్శాలను టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ అక్షరాలా ఆచరించి చూపించారు. మా ప్రతి అడుగులోనూ బీసీ వర్గాల వారు ఉన్నారు. వారి కోసమే మేమున్నాం’ అని పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గం పరిధిలో ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ఎదురు మైదానంలో మంగళవారం సాయంత్రం భారీ స్థాయిలో నిర్వహించిన ‘జయహో బీసీ సభ’లో ఆయన ప్రసంగించారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో బీసీలు ఎంతో నష్టపోయారని, వారికి మళ్లీ ఊపిరి ఇవ్వడానికి ప్రత్యేకంగా బీసీ డిక్లరేషన్‌ రూపొందించామని తెలిపారు. ‘40 ఏళ్లుగా ఆదరించిన మీ రుణం తీర్చుకోవడానికి బీసీ డిక్లరేషన్‌ విడుదల చేస్తున్నాం. బీసీల్లో 153 కులాలు ఉన్నాయి. మీ దశ దిశ మార్చడానికి దీనినో అవకాశంగా ఎంచుకున్నాం.

బీసీ వర్గాలు లేకపోతే నాగరికత లేదు. మన సంస్కృతికి బీసీ కులాల వారు ఒక చిహ్నం. రజకులు లేకపోతే మనం రోజూ ఇంత మంచి బట్టలు వేసుకుని తిరగలేం. మన జీవనంలోని అనేక కోణాల్లో బీసీ కులాల వారి కుల వృత్తుల పాత్ర ఉంది. ఈ అన్ని కులాలకు న్యాయం చేయాలి. చిన్నా పెద్దా అన్ని కులాలకు తగిన నిధులు ఇచ్చి వారిని ఆదుకుంటాం. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తెస్తాం. టీడీపీ రాక ముందు బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు లేవు. ఎన్టీఆర్‌ ఆ రిజర్వేషన్లు పెట్టిన తర్వాత ఆ వర్గాల్లో రాజకీయ నాయకత్వం పెరిగింది. నేను ఆ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచాను. జగన్‌ వచ్చి 24 శాతానికి కుదించాడు. బీసీలు ఆర్థికంగా పైకి రావడానికి మేం ఆదరణ పథకం పెట్టాం. జగన్‌ వచ్చి రద్దు చేశాడు’ అని మండిపడ్డారు. మళ్లీ ఈ రాష్ట్రాన్ని నిలబెట్టడానికే టీడీపీ, జనసేన కలిశాయన్నారు. తమ కలయిక పదవుల కోసం కాదని.. ఈ రాష్ట్ర ప్రజలకు, వారి పిల్లలకు మంచి భవిష్యత్‌ కల్పించడానికే కలిశామని చెప్పారు. ‘రాష్ట్రం నిలబడితే అన్ని వర్గాలు నిలబడతాయి. భవిష్యత్‌లో అన్ని వర్గాలనూ ఆదుకుంటాం. ప్రతి వర్గానికీ ప్రణాళిక రూపొందిస్తాం. మా కలయికను నిండు మనసుతో ఆశీర్వదించండి’ అని ప్రజలకు విజ్ఞప్తిచేశారు.

పెద్దిరెడ్డి జోలికి వెళ్లగలరా?

రాష్ట్రంలో అనేక మంది బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు జగన్‌ టికెట్లు ఎగ్గొట్టారని, వారి మాదిరిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జోలికి వెళ్లగలరా అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెప్పి జగన్‌ అనేక మంది బీసీ నేతల గొంతు కోశారు. కొంత మందికి టికెట్లు ఇవ్వలేదు. ఇంకొంత మందిని ఎటెటో మార్చేశాడు. పెద్దిరెడ్డిని ఎందుకు మార్చలేదు? ఆయనకు అంత మంచి పేరుందా? గనులు, భూములు, ఇసుక రేవులు మొత్తం ఆయన తన గుప్పిట పట్టి పిండుకోవడం లేదా? వేల కోట్లు దోచుకోలేదా? ఆయన్ను మార్చే శక్తి జగన్‌కు ఉందా? ఎమ్మెల్యే అవినీతిని ప్రశ్నించినందుకు బీసీ నేత నందం సుబ్బయ్యను పట్టపగలే చంపారు. ఆ ఎమ్మెల్యేకు టికెట్‌ ఆపారా? వీరప్పన్‌ మాదిరిగా భాస్కరన్‌ పేరుతో తయారైన ఒక నేత తిరుపతిని అడ్డగోలుగా లూటీచేశాడు. వేల కోట్లు గడించాడు. ఆయన్ను తెచ్చి ఒంగోలులో పెట్టారు. వీళ్లకు టికెట్లు ఎలా వచ్చాయి? తన వారు నలుగురికి రాష్ట్రాన్ని పంచి ఇచ్చి జగన్‌ సామాజిక న్యాయం కబుర్లు చెబుతున్నాడు. బీసీలు బ్యాక్‌ బోన్‌ అంటూ ఉపన్యాసాలు చెప్పి వారి వెన్నెముక విరగ్గొడుతున్నాడు. జై జగన్‌ అనలేదని పల్నాడులో చంద్రయ్య అనే బీసీ నేతను గొంతు కోసి చంపారు. వైసీపీ సంస్కృతి అదీ’ అని ధ్వజమెత్తారు. బీసీల్లోని అన్ని కులాల వారికీ టికెట్లు ఇవ్వలేమని, వారికి ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్ల వంటి ఇతర పదవుల ద్వారా రాజకీయ న్యాయం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. జయహో బీసీ అందరి నినాదం, విధానం కావాలని పిలుపిచ్చారు.

మంగళగిరికి వరాలు!

జయహో బీసీ సభ నిర్వహించిన మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు చంద్రబాబు ప్రత్యేకంగా హామీలు ఇచ్చారు. ‘ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల్లో తరతరాలుగా నివాసం ఉంటున్న వారికి పట్టాలు ఇస్తాం. టిడ్కో కింద 20 వేల ఇళ్లు మంజూరు చేస్తాం. తాడేపల్లి ప్రాంతంలో వ్యవసాయ భూములను ఆంక్షల్లేకుండా స్వేచ్ఛగా అమ్ముకునే అవకాశం కల్పిస్తాం. స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్‌ పెడతాం. నేత కార్మికుల ఆదాయం పెరగడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం’ అని ప్రకటించారు.

Updated Date - Mar 06 , 2024 | 06:31 AM