Share News

బాదుడులో బాద్షా!

ABN , Publish Date - Jan 12 , 2024 | 04:50 AM

బాదుడే బాదుడు అంటూ నాటి చంద్రబాబు ప్రభుత్వంపై ఎన్నికల ప్రచారంలో వైఎస్‌ జగన్‌ విరుచుకుపడేవారు. ఇప్పుడేమో ఏడుపే ఏడుపు అంటూ ప్రతి సభనూ తన ఏడుపులతో నింపేస్తున్నారు.

బాదుడులో బాద్షా!

ఎడాపెడా నిలువు దోపిడీ..

జగన్‌ వరుస దెబ్బలతో జనం విలవిల

నిత్యావసరాల నెల బిల్లుతో గుండె గుభేల్‌

పప్పుల నుంచి విద్యుత్‌ దాకా అన్నీ డబుల్‌

బాదుడే బాదుడంటూ ఎన్నికల్లో జగన్‌ ప్రచారం

ఇప్పుడేమో ప్రతి సభలోనూ ఏడుపే ఏడుపు

కానీ బాదుడులో జగన్‌కు పోటీ లేదంటున్న జనం

గత నాలుగేళ్లలో సామాన్యుడి బతుకు బేజారు

చెత్త నుంచి ఆస్తి పన్ను వరకు వరుస బాదుళ్లు

కరెంటు నుంచి మద్యం వరకు పిండేయడమే

భారీగా పెరిగిన నెలవారీ ఖర్చులు

రాష్ట్రంలో సగటు పౌరుడి బతుకు ఛిద్రం

ఆలుమగలు, ఇద్దరు పిల్లలున్న కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుంటే ఆ ఇద్దరు పిల్లల్లో ఒకరికి అమ్మఒడి అమలవుతుంది. అంటే, నాలుగేళ్లలో రూ.60 వేలు అందించి ఉంటారు. ఇంట్లో మహిళకు చేయూత అందితే ఆయా కులాలనుబట్టి రూ.60 వేల నుంచి రూ.75 వేలు అందే అవకాశం ఉంది. పొలం ఉండి రైతు భరోసా అందితే ఒక్కో ఏడాది రూ.13,500 చొప్పున నాలుగేళ్లలో రూ.54 వేలు దక్కే వీలుంది. సగటు కుటుంబానికి ఇవన్నీ దక్కితేనే ఈ నాలుగేళ్లలో రూ.1.74 లక్షలు నవరత్నాల ద్వారా అందినట్లు! కానీ, పన్నులు పిండి.. విద్యుత్‌ చార్జీలు బాది.. మద్యం బడ్జెట్‌ను పెంచేసి.. ఈ 54 నెలల్లో సగటు కుటుంబంపై మోపిన అదనపు భారం రూ.2,67,516.

(అమరావతి-ఆంధ్రజ్యోతి): బాదుడే బాదుడు అంటూ నాటి చంద్రబాబు ప్రభుత్వంపై ఎన్నికల ప్రచారంలో వైఎస్‌ జగన్‌ విరుచుకుపడేవారు. ఇప్పుడేమో ఏడుపే ఏడుపు అంటూ ప్రతి సభనూ తన ఏడుపులతో నింపేస్తున్నారు. కానీ, జగన్‌ పాలనను చంద్రబాబుతో పోల్చుకుంటున్న సామాన్యుడి నోట మాత్రం ఒకటే మాట. జగనన్న బాదుడులో బాద్షా! వైసీపీ సర్కారు వచ్చినప్పటి నుంచే సామాన్యుల బతుకు ఛిద్రమై పోయింది. నవరత్నాలతో రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తామన్న జగన్‌....బటన్‌ నొక్కి ఇచ్చినదాని కంటే పేదల నుంచి లాక్కొన్నదే ఎక్కువగా ఉంది. నవరత్నాలు అనే ఎర వేసి భారీగా ప్రజల నుంచి పన్నులు పిండేశారని గణాంకాలు చెబుతున్నాయి. జగన్‌ అధికారంలోకి వచ్చిన 54 నెలల్లో ఒక్కో కుటుంబంపై సరాసరి అక్షరాలా రూ.2,67,516 అదనపు భారం మోపారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు నిత్యావసర రేట్లకు, జగన్‌ సర్కారు వచ్చిన తర్వాత పెరిగిన రేట్లకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. దీంతోపాటు ప్రభుత్వం వివిధ పన్నులు, విద్యుత్‌ చార్జీలు, ప్రభుత్వం అమ్ముతున్న మద్యం రేట్లు పెరగడంతో అదనంపు భారం తప్పలేదు. ఒక సగటు కుటుంబం ప్రస్తుతం ప్రతినెలా నిత్యావసర సరుకుల కోసం ఎంత ఖర్చు చేస్తోంది.. చంద్రబాబు హయాంలో ఆయా కుటుంబాలకు ఎంత ఖర్చయ్యేది... అప్పటికీ, ఇప్పటికీ వ్యత్యాసమెంత?... ఆ కుటుంబాలపై ప్రభుత్వం విధించిన పన్నులు గతంలో ఎంత మేర ఉన్నాయి.. జగన్‌ సర్కారు వచ్చిన తర్వాత అదనపు భారం ఎంత అని లెక్కిస్తే సామాన్యులపై ఈ సర్కారు విపరీతమైన భారం మోపిందని తేలుతోంది. నవరత్నాలు పేరుతో కొంతమందికి ప్రయోజనం కల్పించి ఏపీ ప్రజలందరిపైనా పెనుభారం మోపారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

సగటు కుటుంబంపై ఇంత పగా?

రాష్ట్రంలో 1.50 కోట్ల కుటుంబాలున్నాయి. సరాసరిన ఆలుమగలు, ఇద్దరు పిల్లలు కలిగిన ఒక కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుంటే నెలకు ఆ కుటుంబానికి నిత్యావసరాలకు ఎంత ఖర్చు అవుతుందో, గతంలో ఆ కుటుంబాలు చెల్లిస్తున్న పన్నులు, ఇప్పుడు అదనంగా చెల్లించేది లెక్కిస్తే ఒక్కో కుటుంబంపై 54 నెలల్లో అదనంగా రూ. 2,67,516 ఖర్చయినట్లు తేలింది. నవరత్నాల ద్వారా ఆయా కుటుంబాలకు వస్తున్న ప్రయోజనాలతో పోలిస్తే జనాలపై పిండిందే ఎక్కువగా ఉంది.

చెత్త నుంచి ఆస్తి దాకా బాదుడే...

పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వం సర్‌చార్జీ అదనంగా రూ.2 వడ్డించి ప్రజలపై అదనపు భారం మోపింది. మున్సిపాలిటీలు, పంచాయతీల ప్రధాన బాధ్యత పారిశుధ్యం, తాగునీటి సౌకర్యాలు, విద్యుత్‌ వీధిదీపాల ఏర్పాటు. అయితే వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత చెత్తకు సైతం పన్నులు వేసి ప్రైవేట్‌ కాంట్రాక్టర్లకు ఆ ఆదాయం కట్టబెట్టింది. ఇంటిపన్ను గతం లో సాధారణ కుటుంబానికి రూ.200 వర కు ఉండేది. ఇప్పుడు ఆస్తి విలువను లెక్కించి పన్నులు వసూలు చేయడంతో అది సామాన్యులకు భారమైంది. చంద్రబాబు ఫైబర్‌నెట్‌ ద్వారా ఇంటర్నెట్‌, టీవీలకు నెలకు రూ.149 వసూలు చేస్తే ఈ సర్కారు వచ్చాక దాన్ని 350కు పెంచారు.

మద్యం ఖర్చు డబుల్‌

మధ్యతరగతి, దిగువ స్థాయితో పాటు అన్నీ కేటగిరీల్లో 50 శాతం కుటుంబాల్లో మద్యం సేవించే వాళ్లు ఉన్నారు. గతంలో ఓ మోస్తరు క్వాలిటీ మందు రేటు రూ.60 ఉంది. జగన్‌ ఖజానాను నింపుకొనేందుకు భారీగా రేట్లు పెంచి రూ.160 చేశారు. మద్యం ప్రియులు సగటున 20 రోజులు మద్యం సేవిస్తే నెలకు అదనంగా మద్యంపై రూ.2వేలు ఖర్చవుతోంది. ఇలా ఒక్కో కుటుంబానికి నెలకు సాధారణంగా అవుతున్న ఖర్చు కంటే అదనంగా రూ.4,954 వైసీపీ సర్కార్‌ హయాంలో అవుతోంది.

కోతలే ఎక్కువ..

నవరత్నాల ద్వారా 99.5 శాతం మందికి సంక్షేమ పథకాలు అమలుచేశామని వైసీపీ సర్కారు చెబుతున్న మాటలు వాస్తవం కాదని స్పష్టమవుతోంది. అమ్మఒడి నాలుగేళ్లు అందరికీ ఇచ్చిన దాఖలాల్లేవు. ఒక కుటుంబానికి మూడేళ్లు ఇస్తే, మరో కుటుంబానికి రెండేళ్లు ఇచ్చి సరిపెట్టారు. అదే విధంగా ఆరంచెల వ్యవస్థలను తీసుకొచ్చి ప్రతి లబ్ధిదారుకు ఒక ఏడాదో, రెండేళ్లో ఈ పథకాలివ్వ లేదు. కొన్నికుటుంబాలు సంక్షేమ పథకాలు అసలే పొందలేదు. అయితే ఆకుటుంబాలపై భారం మాత్రం పడింది.

Updated Date - Jan 12 , 2024 | 04:50 AM