Share News

అవినాశ్‌ బెయిల్‌ రద్దు చేయాల్సిందే

ABN , Publish Date - Apr 05 , 2024 | 05:06 AM

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో 8వ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని అప్రూవర్‌ దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్‌కు సీబీఐ సంపూర్ణంగా మద్దతు తెలియజేసింది. దస్తగిరి పిటిషన్‌పై

అవినాశ్‌ బెయిల్‌ రద్దు చేయాల్సిందే

దస్తగిరి పిటిషన్‌కు మద్దతు తెలుపుతూ సీబీఐ లిఖితపూర్వకంగా కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. అవినాశ్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని కోరింది. వైసీపీ నాయకులు.. దస్తగిరిని, ఆయన భార్యను బెదిరించారని.. ఈ అంశంపై దస్తగిరి మానవహక్కుల కమిషన్‌ సహా అందరికీ ఫిర్యాదు చేశాడని పేర్కొంది. ‘దస్తగిరికి విట్‌నెస్‌ ప్రొటెక్షన్‌ స్కీం కింద భద్రత కల్పించాం. కుటుంబ సభ్యులకు సైతం రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. తన తండ్రిపై దాడి జరిగిందని.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని మాకు సమాచారం ఇచ్చాడు. శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి జైలుకు వచ్చి తనను బెదిరించాడని.. రూ.20 కోట్లు ఇస్తామని.. అంగీకరించపోతే కుటుంబంతో సహా అంతం చేస్తామని వార్నింగ్‌ ఇచ్చారని తెలిపాడు. అవినాశ్‌రెడ్డి,. భాస్కర్‌రెడ్డి తదితరులు చాలా పలుకుబడి ఉన్న వ్యక్తులు. ప్రత్యక్ష సాక్షి అయిన దస్తగిరిని కాపాడుకోవలసిన అవసరం ఉన్న నేపథ్యంలో అవినాశ్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయండి’ అని హైకోర్టును కోరింది.

దస్తగిరి పిటిషన్‌కు మద్దతిస్తున్నాం: సీబీఐ

సీబీఐ కౌంటర్‌లో ఏముందంటే..

సుప్రీంలో సునీత వ్యాజ్యంలోనూ కౌంటర్‌ వేశామని వెల్లడి

దస్తగిరి ఫిర్యాదు చేసేవరకు ఏం చేశారు..?

అవినాశ్‌ బెయిల్‌ రద్దు చేయాలని

సీబీఐ ఎందుకు కోరడం లేదు?

తెలంగాణ హైకోర్టు సూటి ప్రశ్న

మా కంటే ముందే సునీత సుప్రీంకు అందుకే మేం పిటిషన్‌ వేయలేదు

బెయిల్‌ షరతులన్నీ ఉల్లంఘించారు

శివశంకర్‌రెడ్డి కుమారుడు జైలుకెళ్లి

దస్తగిరికి బెదిరింపు.. సాక్ష్యాలున్నాయి

కేంద్ర దర్యాప్తు సంస్థ వివరణ

తదుపరి విచారణ 15కి వాయిదా

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో 8వ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని అప్రూవర్‌ దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్‌కు సీబీఐ సంపూర్ణంగా మద్దతు తెలియజేసింది. దస్తగిరి పిటిషన్‌పై గురువారం తెలంగాణ హైకోర్టులో జస్టిస్‌ కే లక్ష్మణ్‌ ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. తొలుత దస్తగిరి తరఫు న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌ వాదనలు వినిపించారు. గతంలో హైకోర్టు ముందస్తు బెయిల్‌ ఇచ్చిన సందర్భంగా విధించిన షరతులన్నీ అవినాశ్‌రెడ్డి ఉల్లంఘించారని తెలిపారు. సాక్షులను భయభ్రాంతులకు గురిచేసే విధంగా వ్యవహరించారని.. దస్తగిరి తండ్రిపై తన అనుచరులతో దాడి చేయించాడని పేర్కొన్నారు. అప్రూవర్‌గా మారి వ్యతిరేక సాక్ష్యం చెబితే లేకుండా చేస్తామని బెదిరించారని.. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే తూతూమంత్రంగా తేలికపాటి సెక్షన్ల కింద కేసు పెట్టారని తెలిపారు. నిందితులకు బెయిల్‌ రద్దు చేయాలని కోరే హక్కు బాధితులకు ఉంటుందని. అప్రూవర్‌గా మారిన వారు కూడా ఇతర నిందితుల బెయిల్‌ రద్దు కోరవచ్చని పేర్కొన్నారు. సీబీఐ తరఫున న్యాయవాదులు అనిల్‌ తన్వర్‌, జగదీశ్‌ వాదనలు వినిపిస్తూ.. దస్తగిరి పిటిషన్‌కు మద్దతు తెలుపుతున్నామన్నారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. ‘దస్తగిరి ఫిర్యాదు చేసేవరకు ఏం చేశారు..? కేసుకు సంబంధించి ఏం జరుగుతుందో మీకు తెలియదా? అవినాశ్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ ఎందుకు కోరడం లేదు’ అని వారిని ప్రశ్నించారు. వారు స్పందిస్తూ.. తన కుటుంబ సభ్యులపై దాడి జరిగిందని దస్తగిరి హైకోర్టు చీఫ్‌ జస్టి్‌సతో పాటు తమకు కూడా ఫిర్యాదు చేశాడని.. దానిని స్థానిక పోలీసులకు పంపామని పేర్కొన్నారు. అలాగే అవినాశ్‌రెడ్డి బెయిల్‌ రద్దు కోరుతూ వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టులో తమ కంటే ముందే పిటిషన్‌ దాఖలు చేశారని.. అందులో తాము కౌంటర్‌ దాఖలు చేశామని పేర్కొన్నారు. ఇప్పటికే పిటిషన్‌ ఉన్నందున తాము ప్రత్యేకంగా పిటిషన్‌ వేయలేదని తెలిపారు. దస్తగిరిని భయభ్రాంతులకు గురిచేయడంతోపాటు ఏ-5 శివశంకర్‌రెడ్డి కొడుకు చైతన్యరెడ్డి నేరుగా జైలుకు వెళ్లి దస్తగిరిని బెదిరించినట్లు సాక్ష్యాలు ఉన్న నేపథ్యంలో ఆయన బెయిల్‌ రద్దు చేయాలని కోరారు. అవినాశ్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. కిరాయి హంతకుడికి (దస్తగిరి) ఎమ్మెల్యే కంటే ఎక్కువ భద్రత కల్పించారని.. ఆరుగురితో భద్రత ఇవ్వడం ఎక్కడి విడ్డూరమని ప్రశ్నించారు. ఇంత భద్రత ఉండగా మళ్లీ బెదిరించారంటూ హత్యచేసిన వాడే చెప్పడం హాస్యాస్పదమన్నారు. దస్తగిరి వెనుక ఎవరో ఉండి ఆడిస్తున్నారని తెలిపారు. దస్తగిరి అప్రూవర్‌గా మారడానికి ఇంకా ఆమోదం రాలేదని.. బెయిల్‌ రద్దు కోరే హక్కు అతడికి లేదన్నారు. కోర్టు సమయం ముగియడంతో విచారణను న్యాయమూర్తి ఈ నెల 15వ తేదీకి వాయిదావేశారు. అలాగే ఈ కేసులో నిందితులైన వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్లపై విచారణ ఈ నెల 8కి వాయిదా పడింది.

Updated Date - Apr 05 , 2024 | 05:10 AM