Share News

బెదిరింపులు.. వేధింపులు భరించలేకే... అవినాశ్‌రెడ్డి బెయిల్‌ రద్దు కోరుతున్నా

ABN , Publish Date - Apr 16 , 2024 | 03:26 AM

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తాను అప్రూవర్‌గా మారినప్పటి నుంచి వస్తున్న బెదిరింపులు, వేధింపులు భరించలేకే ఈ కేసులో నిందితుడు, ఎంపీ అవినాశ్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని పిటిషన్‌ దాఖలు చేశానని తెలంగాణ హైకోర్టుకు దస్తగిరి తెలిపారు. రెండురోజుల క్రితం

బెదిరింపులు.. వేధింపులు భరించలేకే... అవినాశ్‌రెడ్డి బెయిల్‌ రద్దు కోరుతున్నా

వివేకా హత్య కేసులో అప్రూవర్‌ దస్తగిరి వాదనలు.. తీర్పు రిజర్వు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తాను అప్రూవర్‌గా మారినప్పటి నుంచి వస్తున్న బెదిరింపులు, వేధింపులు భరించలేకే ఈ కేసులో నిందితుడు, ఎంపీ అవినాశ్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని పిటిషన్‌ దాఖలు చేశానని తెలంగాణ హైకోర్టుకు దస్తగిరి తెలిపారు. రెండురోజుల క్రితం సైతం తనను బెదిరించారని తెలిపారు. అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ రద్దు చేయాలని కోరారు. ఆయన పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం.. వాదనలు విని తీర్పు రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతకుముందు దస్తగిరి తరఫున న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్‌ వాదనలు వినిపించారు. ‘‘నా తండ్రిపై దాడి, శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి జైల్లోకి వచ్చి నరికేస్తానని బెదిరించడం వంటి ఘటనలే కాకుండా చాలా సందర్భాల్లో వేధింపులకు పాల్పడుతున్నారు. వీటిని భరించలేకే అవినాశ్‌రెడ్డి బెయిల్‌ రద్దు కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశాను. ‘మా జగనన్న పైనే పోటీచేస్తాడా నీ కొడుకు అంటూ గుర్తుతెలియని వ్యక్తులు నా తండ్రిపై దాడి చేశారు. సీబీఐ అధికారి రాంసింగ్‌ కొట్టి అప్రూవర్‌గా మార్చాడని మీడియాకు చెప్పాలని చైతన్యరెడ్డి బెదిరించాడు. తమ మాట వినకపోతే నా భార్యపై కేసులు పెట్టి లోపలేస్తామని, కుటుంబంతో సహా అంతం చేస్తాం అని ఒత్తిడి తెచ్చాడు. అవినాశ్‌రెడ్డికి బెయిల్‌ వచ్చిన తర్వాత నాపై నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు పెట్టారు. చిన్న కేసులో 137 రోజులు జైల్లో ఉంచారు. నిందితులు బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారు. నాకు, నా కుటుంబానికి రక్షణ లేదు. అవినాశ్‌ రెడ్డి బెయిల్‌ రద్దు కోరడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు’ అని దస్తగిరి చెప్పారు. వివేకా కుమార్తె సునీతారెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది నళిన్‌కుమార్‌ వాదనలు వినిపించారు. ‘సాక్షులను ప్రభావితం చేసేలా చాలా ఘటనలు జరుగుతున్నాయి. దస్తగిరిపై కిడ్నాప్‌, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి జైలుకు పంపారు. దస్తగిరి ఏపీ, తెలంగాణ హైకోర్టు సీజేలు, సీబీఐ, ఇతరులకు రాసిన లేఖ పరిశీలించండి. అందులో ఇతర కేసుల్లో దస్తగిరిని అరెస్ట్‌ చేసిన పోలీసులు ‘వైఎస్‌ వాళ్లతో ఎందుకు పెట్టుకుంటున్నావు? అప్రూవర్‌గా బలవంతంగా మార్చారని ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్పు’ అని పోలీసులే దస్తగిరిని బెదిరించినట్లు ఉంది. రూ.5 కోట్లు ఇస్తాం.. ఇంకా కావాలంటే జగనన్న ఓఎస్డీ కార్యాలయంలో రూ.20 కోట్లు ఇప్పిస్తామని ప్రలోభ పెట్టారు. ఆయన తండ్రిపై దాడి చేశారు. ఫ్రీ అండ్‌ ఫెయిర్‌ ట్రయల్‌ జరిగే పరిస్థితి లేదు. రాజకీయ పలుకుబడితో మొత్తం యంత్రాంగాన్ని అవినాశ్‌రెడ్డి, ఇతర నిందితులు ప్రభావితం చేస్తున్నారు. అవినాశ్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలి’’ అని కోరారు. సీబీఐ తరఫున సీనియర్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అనిల్‌ తన్వర్‌ వాదనలు వినిపించారు. ‘‘చైతన్యరెడ్డి జైలుకు వెళ్లినట్లు జైలు అధికారులు అంగీకరించారు. ‘నీ భార్యను అరెస్ట్‌ చేయిస్తా’మని దస్తగిరిని బెదిరించారు. ఎంవీ కృష్ణారెడ్డి (వివేకా పీఏ) తరహాలోనే ‘నువ్వుకూడా సహకరించా’లని బెదిరించారు. దస్తగిరి అప్రూవర్‌షి్‌పను ఎంవీ కృష్ణారెడ్డి, భాస్కర్‌రెడ్డి ఇదే హైకోర్టులో సవాల్‌ చేశారు. కీలక సాక్షి గంగాధర్‌రెడ్డి అనుమానాస్పదంగా చనిపోయాడు. సీఐ....మేజిస్ర్టేట్‌ ఎదుట 164 స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదు. ఈ మొత్తం పరిస్థితులు సాక్షులను ప్రభావితం చేస్తున్నారనడానికి ఆధారాలు.. అవినాశ్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయండి’ అని కోరారు.

అవినాశ్‌పై ఆరోపణలకు ఆధారం లేదు: న్యాయవాది

అవినాశ్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది టీ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘’పిటిషన్‌ దాఖలు చేసిన దస్తగిరి.. కేవలం రెండు ఘటనలు మాత్రమే ఉదహరిస్తే.. సునీతారెడ్డి, సీబీఐ అంతకుమించి వాదిస్తున్నారు.. వారు అంత ఉత్సాహం ఎందుకుచూపిస్తున్నారు? వారు ఎవరికి మద్దతు పలుకుతున్నారు? గొడ్డలిని స్వయంగా కొనుక్కొచ్చి నరికి చంపానని చెప్తున్న కిరాయి హంతకుడికా? హత్య చేశానని చెప్తున్న హంతకుడికి మద్దతు పలకడం నేరన్యాయ ప్రక్రియలో నేనెప్పుడూ చూడలేదు. ప్రతిపక్ష నేత ఉచ్చులో వివేకా కుమార్తె సునీతారెడ్డి ఉన్నారు. వివేకాకు ఓ ముస్లిం మహిళ ద్వారా ఓ కొడుకు ఉన్నాడు. అదే సునీత భయం. అవినాశ్‌ రెడ్డి బెయుల్‌ రద్దు సునీత కోరడంలో తప్పులేదు.. కానీ దస్తగిరికి మద్దతు తెలపడం దారుణం. దస్తగిరి పేర్కొంటున్న ఘటనల్లో అవినాశ్‌రెడ్డి పాత్ర ఉన్నట్లు ఆధారాలు లేవు. అవినాశ్‌ రెడ్డి బెయిల్‌ షరతులను ఎక్కడా ఉల్లంఘించలేదు. ఏపీలో ప్రస్తుతం పాలన మొత్తం ఈసీ చేతిలో ఉంది. ప్రభావితం చేశారనడానికి ఆధారాలు లేవు. దస్తగిరి దాఖలు చేసిన బెయిల్‌ రద్దు పిటిషన్‌ను కొట్టేయండి’ అని కోరారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. తీర్పు రిజర్వు చేసినట్లు ప్రకటించింది.

Updated Date - Apr 16 , 2024 | 03:26 AM