Share News

ఎండీయూ ఆపరేటర్లకు ఆథరైజేషన్లు!

ABN , Publish Date - Mar 08 , 2024 | 03:46 AM

రేషన్‌ సరుకులను ఇంటింటికీ పంపిణీ చేస్తున్న మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌(ఎండీయూ) ఆపరేటర్లకు ఆథరైజేషన్లు(అధికార పత్రాలు) జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వారిపై

ఎండీయూ ఆపరేటర్లకు ఆథరైజేషన్లు!

జారీ చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశం

కోర్టులో పెండింగ్‌ ఉండగా ఎలా ఇస్తారంటున్న డీలర్లు

అమరావతి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): రేషన్‌ సరుకులను ఇంటింటికీ పంపిణీ చేస్తున్న మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌(ఎండీయూ) ఆపరేటర్లకు ఆథరైజేషన్లు(అధికార పత్రాలు) జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వారిపై భౌతిక దాడులు జరగకుండా నివారించేందుకు జిల్లా ఎస్పీలు పోలీసు రక్షణ కల్పించాలని నిర్దేశించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ సర్క్యులర్‌ జారీ చేశారు. కొంతమంది రేషన్‌ డీలర్లు, వారి కుటుంబసభ్యులు, బంధువులే ఎండీయూ ఆపరేటర్లుగా వ్యవహరిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయని, అలాంటివారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. విశాఖపట్నంలో పెండింగ్‌ ఉన్న ఎండీయూ ఆపరేటర్లకు ఈనెల 20వ తేదీలోపు ఆథరైజేషన్ల జారీని పూర్తి చేయడానికి ఆ జిల్లా సబ్‌కలెక్టరు, ఆర్డీవోలు, డీఎ్‌సవోలు ఏర్పాట్లు చేయాలని కమిషనర్‌ ఆదేశించారు.

రేషన్‌ డీలర్ల అభ్యంతరం

ఎండీయూ ఆపరేటర్లకు ఆథరైజేషన్‌ పత్రాలను జారీ చేయడాన్ని రేషన్‌ డీలర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టులో కేసు వేయగా, విచారణలో ఉంది. కోర్టు తీర్పు వెలువడకుండానే ఎండీయూ ఆపరేటర్లకు ఆథరైజేషన్లు ఇవ్వాలంటూ ప్రభుత్వం సర్క్యులర్‌ జారీ చేయడాన్ని డీలర్లు తప్పుబడుతున్నారు. జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం.. ఇంటర్‌ విద్యార్హత, నోటిఫికేషన్‌, రోస్టర్‌ పద్ధతిని పాటిస్తూ రాత పరీక్ష, ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులైనవారిని రేషన్‌ డీలర్లుగా నియమించారని, ఇలా ఎంపికైనవారి నుంచి రూ.25 వేలు డిపాజిట్‌ కట్టించుకుని డీలర్లకు ఆథరైజేషన్లు ఇచ్చారని చెబుతున్నారు. కాబట్టి రేషన్‌ సరుకుల పంపిణీకి డీలర్లకు తప్ప ఎండీయూ ఆపరేట్లకు ఆథరైజేషన్‌లు ఇవ్వడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.

Updated Date - Mar 08 , 2024 | 08:03 AM