Share News

టీడీపీ ఆఫీసుపై దాడి.. వైసీపీ నేతలకు షాక్‌

ABN , Publish Date - Sep 05 , 2024 | 03:24 AM

వైసీపీ ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలకు హైకోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై మూకదాడి వ్యవహారంలో ఆ పార్టీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం,

టీడీపీ ఆఫీసుపై దాడి.. వైసీపీ నేతలకు షాక్‌

ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ

సుప్రీంకు వెళ్లేందుకు వీలుగా అరెస్టు నుంచి

రక్షణ కల్పించాలన్న అభ్యర్థనకూ నో

బయట ఉన్నవారి పాత్ర లేదని చెప్పలేం

పోలీసు సిబ్బందీ సహకరించినట్లు

కనిపిస్తోంది: న్యాయమూర్తి

చంద్రబాబు నివాసంపై దాడి కేసులో

జోగి రమేశ్‌కూ చుక్కెదురు

అమరావతి, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలకు హైకోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై మూకదాడి వ్యవహారంలో ఆ పార్టీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, వైసీపీ నేతలు దేవినేని అవినాశ్‌, మాజీ ఎంపీ నందిగం సురేశ్‌, కార్యకర్తలు జి.రమేశ్‌, షేక్‌ రబ్బానీ బాషా, చిన్నాబత్తిన వినోద్‌కుమార్‌, మరికొందరికి ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. అధికారాన్ని వినియోగించి కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా పిటిషనర్లు గత మూడేళ్లుగా దర్యాప్తు అధికారులను ప్రభావితం చేశారని, ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తే దర్యాప్తులో పురోగతి సాధ్యపడదని ప్రాసిక్యూషన్‌ తరఫు సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ్‌ లూథ్రా, పోసాని వెంకటేశ్వర్లు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ చేసిన వాదనలతో ఏకీభవించింది. కాల్‌ రికార్డు, ఇతర సాంకేతిక ఆధారాలు సేకరించాల్సి ఉందని, పిటిషనర్ల మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకుని, వారిని కస్టడీలో విచచారించాల్సిన అవసరం ఉందన్న పోలీసుల వాదనను సమర్ధించింది. పిటిషనర్లు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లను కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కే కృపాసాగర్‌ బుధవారం తీర్పు ఇచ్చారు. తీర్పు వెల్లడించిన అనంతరం పిటిషనర్ల తరపు సీనియర్‌ న్యాయవాదులు పి.వీరారెడ్డి, ఎల్‌ రవిచందర్‌ స్పందిస్తూ.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు ఆశ్రయించేందుకు వీలుగా రెండువారాల పాటు పిటిషనర్లకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రాసిక్యూషన్‌ తరఫున లూథ్రా స్పందిస్తూ.. ముందస్తు బెయిల్‌ పిటిషన్లు తిరస్కరిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి వీల్లేదని తెలిపారు. పిటిషనర్లు, ప్రాసిక్యూషన్‌ సమర్పించిన తీర్పు ప్రతులను పరిశీలించిన న్యాయమూర్తి.. అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు తిరస్కరించారు. నిందితులకు ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరిస్తూ తీర్పు ఇచ్చాక.. అరెస్టు చేయకుండా రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని స్పష్టం చేశారు.

వారందరికీ సమాన పాత్ర!

‘ఓ పార్టీకి చెందిన వ్యక్తి మరో పార్టీపై ఏమైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే, బాధ కలిగిన వ్యక్తులు చట్టపరమైన ప్రక్రియ ద్వారా దానికి పరిష్కారం కనుగొనాలి, ప్రస్తుత కేసులో అందుకు విరుద్ధంగా పార్టీ కార్యాలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రత్యర్థులను కేసులో ఇరికిస్తున్నారన్న పిటిషనర్ల వాదనలో ఏకీభవించలేం. టీడీపీ కార్యాలయంపై దాడిలో గుంపుగా వచ్చిన వ్యక్తులు, వారికి నేతృత్వం వచ్చిన నాయకులకు సమాన పాత్ర ఉంది. దాడి జరిగినప్పుడు కొందరు వ్యక్తులు కార్యాలయం బయటే ఉన్నారనే కారణంతో నేరఘటనలో వారి ప్రమేయం లేదని చెప్పలేం. దాడిలో బాధితులైనవారితో నిందితులకు వ్యక్తిగతంగా వివాదాలు లేవు. అయినప్పటికీ ప్రత్యర్థ్ధి రాజకీయ పార్టీ కార్యాలయానికి వెళ్లి దాడి చేశారు. ఫిర్యాదుదారుడి గొంతు నులిమి స్పృహ కోల్పోయేలా చేశారు. అందుచేత ఐపీసీ సెక్షన్‌ 307 కింద కేసు నమోద చేయడం తప్పు కాదు. ఘటన జరిగిన ప్రదేశంలో ఉన్న పోలీసు సిబ్బంది సైతం నిందితులకు సహకరిస్తున్నట్లు కనబడుతోంది. దర్యాప్తులో చోటు చేసుకున్న తీవ్ర జాప్యాన్ని పరిశీలిస్తే దర్యాప్తు సంస్థను బయట వ్యక్తులు ప్రభావితం చేసినట్లు అర్థమవుతోది. సరైన సెక్షన్లు నమోదు చేయకుండా కేసు దర్యాప్తు చేయడం పోలీసుల అసమర్ధత కిందకు వస్తుంది. అదనపు సెక్షన్లు చేర్చడంపై నిందితులు అభ్యంతరం చెప్పడాన్ని తోసిపుచ్చుతున్నాం. పిటిషనర్ల ముందస్తు బెయిల్‌ పిటిషన్లు కొట్టివేస్తున్నాం’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.

ధర్నా పేరిట విపక్ష నేత టార్గెట్టా?

జోగి, అనుచరుల పిటిషన్లూ కొట్టివేత

చంద్రబాబు విపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన ఇంటిపై దాడి చేసిన వ్యవహారంలో వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేశ్‌కు కూడా హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు, ఆయన అనుచరులు 13 మందికి ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కే కృపాసాగర్‌ బుధవారం తీర్పు ఇచ్చారు. తీర్పు వెల్లడించిన అనంతరం సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకునేందుకు వీలుగా అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్లు చేసిన అభ్యర్ధనను కూడా తిరస్కరించారు. ‘పిటిషనర్లలో ఏ ఒక్కరి పై ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ చంద్రబాబు నివాసం వద్దకు వచ్చి వారందరూ హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. ధర్నా పేరుతో అక్కడకు వచ్చి అప్పటి ప్రతిపక్ష నేతను టార్గెట్‌ చేశారు. ప్రజాస్వామ్యంలో ఈ తరహా చర్యలను ఆమోదించలేం’ అని తీర్పులో పేర్కొన్నారు.

Updated Date - Sep 05 , 2024 | 03:28 AM