సజ్జల భార్గవ్‌పై అట్రాసిటీ కేసు
ABN , Publish Date - Nov 11 , 2024 | 04:53 AM
వైసీపీ హయాంలో సకలశాఖా మంత్రిగా ఖ్యాతిగాంచిన సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు, వైసీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జి సజ్జల భార్గవరెడ్డి,
జగన్ మేనల్లుడు, వర్రాపై కూడా...
నమోదు చేసిన పులివెందుల పోలీసులు
అసభ్య పోస్టులు తీసేయాలంటే రూ.2లక్షలు ఇవ్వాలని వర్రా డిమాండ్
లేకుంటే చంపి పాతిపెడతానని బెదిరింపు
కులం పేరుతో దూషించారని ఫిర్యాదు
కడప, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో సకలశాఖా మంత్రిగా ఖ్యాతిగాంచిన సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు, వైసీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జి సజ్జల భార్గవరెడ్డి, జగన్ చిన్నాన్న వైఎస్ ప్రకాశ్‌రెడ్డి కుమార్తె కొడుకైన సింగారెడ్డి అర్జున్‌రెడ్డితో పాటు సోషల్ సైకో వర్రా రవీంద్రరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. పులివెందులలోని టీడీపీ ఆఫీసులో పనిచేసే సింహాద్రిపురానికి చెందిన కొండప్పగారి హరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వర్రా పోస్టుల వెనుక భార్గవరెడ్డి, అర్జున్‌రెడ్డి, వైసీపీ సోషల్ మీడియా టీం ఉందని తెలిసిందని, అసభ్య పోస్టులపై ప్రశ్నించడానికి వెళ్లిన తనను కులం పేరుతో దూషించడంతో పాటు పోస్టు తీయాలంటే రూ.2 లక్షలు ఇవ్వాలని, లేదంటే చంపి పాతిపెడతానని బెదిరించారని హరి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు 196, 308 (5), 351(3), 353 (సి), 112(2)(బి) ఆర్/డబ్ల్యు3 (5) బీఎన్‌ఎ్‌స సెక్షన్ 3(1ఆర్) ఎస్‌ఆర్, ఎస్సీ ఎస్టీ యాక్ట్ 2015, 67ఆఫ్ ఐటీ యాక్ట్ మేరకు కేసు నమోదు చేశారు.
కడప ఎమ్మెల్యేపై అసభ్యంగా పోస్టులు కడప కార్పొరేషన్‌లో ఈ నెల 7న జరిగిన సమావేశంలో కమిషనర్‌ను కాసేపు ఉండాలంటూ ఎమ్మెల్యే మాధవీరెడ్డి చెబుతున్న వీడియోను మార్ఫింగ్ చేసి కమిషనర్‌కు కన్ను కొట్టినట్లుగా మార్చారు. ఈ మేరకు ‘వైఎస్ జె ద వార్’ పేరు తో గ్రూప్ క్రియేట్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వ్యక్తులపై పోలీసులు కేసు పెట్టారు.