ఎన్నికల వేళ.. వైసీపీ తాయిలాలు
ABN , Publish Date - Mar 06 , 2024 | 11:48 PM
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి తాయిలాలతో ఓటర్లకు గాలం వేస్తున్నారు.

ప్రొద్దుటూరు, మార్చి 6: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి తాయిలాలతో ఓటర్లకు గాలం వేస్తున్నారు. ప్రభుత్వ రంగంలో పనిచేసే వెలుగు సిబ్బందికి రాబోయే మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం స్థానిక గోపవరం పంచాయతీలోని వెలుగు కార్యాలయంలో 8 మంది సీసీలకు డిన్నర్‌సెట్‌లు, 70మంది యానిమేటర్లకు టీకప్పులు, సాసర్ సెట్లు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో వైసీపీకి ఓటువేసి వేయించి తిరిగి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇప్పుడు యానిమేటర్లకు ఇచ్చే పదివేల జీతాన్ని 15 వేలకు పెంచుతానని హామీ ఇచ్చారు. యానిమేటర్లు పదవీవిరమణ చెందితే వారికి నగదు బాండ్లు అందజేసి చీరా సారే పెట్టి సన్మానిస్తానన్నారు. పొదుపు మహిళల సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం కోసం కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తామన్నారు. కాగా.. మసీదుల్లో ప్రార్థనలు చేసే ఇమామ్‌లు, మౌజమ్‌లకు అమృతనగర్‌లో2008లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటిస్థలాలు ఇచ్చింది. తిరిగి వైసీపీ ప్రభుత్వం ఇచ్చినట్లుగా వారికిపట్టాలు ఇచ్చి స్థలాలు చూపి ఇంటి రుణం రూ.1.80 లక్షలతో పాటు తాను రూ.లక్ష సహాయం చేస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ తాయిలాల పరంపర ఎన్నికలకోడ్ వచ్చే వరకు కొనసాగిస్తారని ఓటర్లను తన వైపు తిప్పుకోవడానికి ఎంత డబ్బు అయినా వెచ్చించడానికి సిద్ధమయ్యారని వైసీపీ వర్గాలే వెల్లడిస్తున్నాయి.