Share News

ఆలూరులో 15 రోజులకోసారి

ABN , Publish Date - Mar 26 , 2024 | 12:19 AM

ఏ కాలమైనా సరే ఆలూరులో మాత్రం తాగు నీటి సమస్య మాత్రం తీరడం లేదు.

ఆలూరులో 15 రోజులకోసారి
తోపుడు బండిపై నీరు తెచ్చుకుంటున్న మహిళ

తీవ్రతరమవుతున్న తాగునీటి ఎద్దడి

తగ్గిపోయిన బాపురం రిజర్వాయర్‌ సామర్థ్యం

గ్రామాల్లో నీటి కోసం వైసీపీ అభ్యర్థిని నిలదీస్తున్న జనం

ఆలూరు, మార్చి 25 : ఏ కాలమైనా సరే ఆలూరులో మాత్రం తాగు నీటి సమస్య మాత్రం తీరడం లేదు. వేసవి కాలం కావడంతో ఈ సమస్య మరింతగా తీవ్ర తరమైంది. ప్రభుత్వాలు, పాలకులు మారినా తాగునీటి సమస్య మాత్రం పరిష్కరించే నాధుడే కరవయ్యారు. ఆలూరు పట్టణంలో 15 రోజులకు ఒకసారి కూడా తాగునీరు సరఫరా కావడం లేదంటే ఇక గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి చెప్పనక్కర్లేదు.

కురుకుందలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిలదీత : ఆలూరు వైసీ పీ అభ్యర్థి విరుపాక్షి ఆ గ్రామ సర్పంచు దేవిరెడ్డిని గ్రామస్తులు నిలదీశారు. ‘‘తాగునీటి సమస్యతో తల్లడిల్లుతున్నాం. ఎన్నిసార్లు అడిగినా సమస్య పరిష్కరించలేదు. ఏమి చేశారని ఓట్లడగడానికి వచ్చారు..’ అంటూ నిలదీశారు. దాదాపు మండలంలోని అన్ని గ్రామాల్లోనూ అభ్యర్థులకు ప్రచారంలో ప్రజల నుంచి ఇలాంటి పరిస్థితే ఎదువుతుండడం గమనార్హం.

తాగునీటి సమస్యపై తీవ్ర నిర్లక్ష్యం : పట్టణంలో దాదాపుగా 27 వేలకు పైచిలుకు జనాభా ఉంది. మొత్తం 9 ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు ఉన్నాయి. దీనితో పాటు లక్ష లీటర్ల సామర్థ్యం ఉన్న ఒక స్టోరేజి ట్యాంకు ఉంది. 40 ఏళ్ల క్రితం అప్పటి జనాభాను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన బాపురం రిజర్వాయర్‌ నుంచి ఆలూరుతో పాటు 22 గ్రామాలకు నీరు సరఫరా కావాల్సి ఉంది. ఇప్పుడున్న జనాభాకు 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న బాపురం రిజర్వాయర్‌కు నీరు సరిపోవడం లేదు. దీనికి తోడు నిత్యం సాంకేతిక కారణాలు తల్లేతుతుండటం, లీకేజీలు, మరమ్మతులు, పైప్‌లైన్లు పగిలిపోవడంతో నీటి సమస్యకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దీంతో 15 రోజులు అయిన నీరు సరఫరా కాకపోవడంతో ప్రజలకు సమాధానం చెప్పలేక వాటర్‌ మ్యాన్‌లు స్విచ్‌ ఆఫ్‌ చేసుకుంటున్నారు. గతంలో మాదిరిగా బాపురం రిజర్వాయర్‌ నుంచి పంపింగ్స్‌ సమయం తగ్గించారని, అందుకే ఈ సమస్య ఏర్పడిందని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నామని ఈఓఆర్‌డీ ప్రకాష్‌నాయుడు తెలిపారు.

నీటి సమస్యపై ముందస్తు ప్రణాళిక ఏది.?: తాగునీటి సమస్యపై అధికారులు, ప్రజాప్రతినిధులు ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల ఏళ్ల తరబడి ఈ సమస్య తీరడం లేదు. ఈ విషయంలో ఎమ్మెల్యేలతో పాటు ప్రజాప్రతినిధులు ముందస్తుగా సమావేశాలు నిర్వహించిన దాఖలు లేవు. దీంతో ఏళ్లు గడిచినా నీటి సరఫరా అస్తవ్యస్తంగానే ఉంది.

మరో రెండు స్టోరేజ్‌ ట్యాంకులు నిర్మిస్తేనే : బాపురం రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని పెంచి, ఆలూరు పట్టణంలో ప్రస్తుతం ఉన్న స్టోరేజ్‌ ట్యాంకుతో పాటు ఆలూరు చెరువులో ఒక్కటి, అరికెర రోడ్డులో మరొకటి నిర్మిస్తే ఎల్‌ఎల్‌సీ కాల్వలకు నీరు వదిలినప్పుడు, వాటిని నింపుకొని నిరుపయోగకరంగా ఉన్న ఆలూరు చెరువును నింపితే, ఆలూరుకు నీటి సమస్య తీరుతుందని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి బెంగళూర్‌ కిషోర్‌ తెలిపారు. దీనికి తోడు నీటిని సక్రమంగా ఉపయోగించి, వృధాగా నీటిని కాలువలకు వదలడం, వాహనాలు కడగడం, ఇళ్ళ ముందు చల్లడం వంటి వాటిని చేయవద్దని ఆలూరు సర్పంచ్‌ అరుణదేవి కోరారు.

క్యాన్‌ వాటర్‌కు పెరిగిన గిరాకీ : ఆలూరు పట్టణంతోపాటు పరిసర గ్రామాల్లో 15 రోజులు గడిచినా సక్రమంగా తాగునీరు సరఫరా కాకపోవడంతో ప్రజలు రూ.15 చెల్లించి వాటర్‌ క్యాన్లను కొంటున్నారు. దీంతో ఆలూరు పట్టణంలో వాటర్‌ ప్లాంట్లు అడుగడుగునా వెలిసి నీటి వ్యాపారం మూడుపువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.

తాగునీటి సమస్య పరిష్కరించాలి

ఆలూరులో 15 రోజులకు ఒకసారి మాత్రమే తాగునీరు సరఫరా అవుతోంది. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఎండాకాలం కావడంతో సమస్య మరింత తీవ్రతరంగా మారింది. నీటి కోసం బోర్లను ఆశ్రయిస్తున్నాం. ఏళ్లు గడిచినా సమస్యను పరిష్కరించే నాథులే లేరు.

- నాగన్న, ఆలూరు

ముందస్తు ప్రణాళిక లేకపోవడమే...

ఏళ్ల తరబడి ఆలూర నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారం కావడం లేదు. 15 రోజులకు ఒక్కసారైనా తాగునీరు సక్రమంగా రాకపోతే ఎలా....? అధికారులు, ప్రజాప్రతినిధులకు ముందస్తు ప్రణాళిక లేకపోవడమే ఇందుకు కారణం. వేదవతి, నగరడోణ రిజర్వాయర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణాలు కూడా పూర్తి చేయలేదు. బాపురం రిజర్వాయర్‌ సామర్థ్యం పెంచి, సమ్మర్‌ స్టోరుజీలు నిర్మించాలి. నిరుపయోగంగా మారిన ఆలూరు చెరువును నింపితే సమస్య పరిష్కారం అవుతుంది.

- నారాయణ స్వామి, సీపీఎం నాయకుడు, ఆలూరు

Updated Date - Mar 26 , 2024 | 12:19 AM