Share News

Arogyasree : ఆరోగ్యశ్రీనెట్‌వర్క్‌ ఆసుపత్రుల సమ్మె విరమణ

ABN , Publish Date - May 25 , 2024 | 04:05 AM

ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల అసోసియేషన్‌ సమ్మె విరమించుకుంది. దీంతో అన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.

Arogyasree : ఆరోగ్యశ్రీనెట్‌వర్క్‌ ఆసుపత్రుల సమ్మె విరమణ

అన్నిచోట్లా అందుబాటులో ఆరోగ్యశ్రీ సేవలు

సీఎస్‌ను కలసిన అసోసియేషన్‌ సభ్యులు

వారం రోజుల్లో 300 కోట్ల విడుదలకు హామీ

9 నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ట్రస్టు షోకాజ్‌ నోటీసులు

అమరావతి, మే 24(ఆంధ్రజ్యోతి): ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల అసోసియేషన్‌ సమ్మె విరమించుకుంది. దీంతో అన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. వాస్తవానికి 22 నుంచి తమ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు బంద్‌ చేస్తున్నట్లు సంఘం ప్రకటించింది. తమకు రావలసిన బకాయిలు మొత్తం రూ.1,500 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. దీనిపై గత రెండు రోజులగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈవో సంఘం నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం అసోసియేషన్‌ సభ్యులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిని కలిశారు. సుమారు 40 నిమిషాలపాటు వారు సీఎ్‌సతో చర్చలు జరిపారు. ప్రస్తుతానికి సమ్మె విరమించాలని సీఎస్‌ కోరారు. ‘ప్రభుత్వం భారీగా బకాయిలు పెట్టడంతో ఆస్పత్రుల నిర్వహణ కష్టంగా ఉంది. కనీసం వైద్య సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది’ అంటూ ఆస్పత్రుల యాజమాన్యం సీఎ్‌సకు వివరించింది. రూ1,500 కోట్ల బకాయిల్లో కనీసం రూ.800 కోట్లు అయిన విడుదల చేయాలని కోరింది. స్పందించిన సీఎస్‌ ప్రస్తుతానికి రూ.200 కోట్లు విడుదల చేశామని, మరో వారం రోజుల్లో రూ.300 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన అనంతరం బకాయిల అంశంపై మరోసారి చర్చిద్దామని ఆయన మాటిచ్చారు. సీఎ్‌సతో చర్చల అనంతరం అసోసియేషన్‌ సభ్యులు భేటీ అయ్యారు. సీఎస్‌ హామీ మేరకు సమ్మె విరమించాలని నిర్ణయించారు. దీంతో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు యథాతథంగా అందుబాటులోకిరానున్నాయి.

ట్రస్ట్‌ నోటీసులు

రెండు రోజులుగా ఆస్పత్రులు సమ్మె చేస్తున్నా.. కేవలం తొమ్మిది ఆస్పత్రులు మాత్రమే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశాయి. దీంతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ఆ తొమ్మిది ఆసుపత్రులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. సేవలు ఎందుకు బ్రేక్‌ చేశారో వెంటనే లిఖితపూర్వక సమాధానం వారం రోజుల్లో చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆస్పత్రులు సమ్మె విరమించడంతో ట్రస్టు షోకాజ్‌ నోటీసులు వెనక్కి తీసుకుంటుందో లేక ఆయా ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Updated Date - May 25 , 2024 | 04:06 AM