Share News

సాయుధం.. ఆయుధం

ABN , Publish Date - Oct 27 , 2024 | 12:42 AM

ఉగ్రదాడులకు అవకాశం ఉందన్న సమాచారంతో వాటినెలా ఎదుర్కోవాలన్న ఆలోచనలతో ఆక్టోపస్‌ కొత్త ఆవిష్కరణ చేసింది.

సాయుధం.. ఆయుధం

ఏకే 47... 9ఎంఎం కోల్ట్‌... లేజర్‌ గన్‌... ్ఢబాంబు లాంచర్‌... పోలీసుల అమ్ములపొదిలో ఉన్న ఆయుధ సంపద ఇది. నిత్యం కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే ఈ ఆయుధాలు ఏడాదిలో ఒక్కసారి మాత్రమే బయటకు వస్తాయి. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించే ఓపెన్‌ హౌస్‌లో కొలువు దీరతాయి. విజయవాడ ఎంజీ రోడ్డులోని ఏఆర్‌ గ్రౌండ్స్‌లో శనివారం నిర్వహించిన ఓపెన్‌హౌస్‌ను ఎన్టీఆర్‌ జిల్లా పోలీసు కమిషనర్‌ ఎస్వీ రాజశేఖరబాబు ప్రారంభించారు. ఆయన వెంట డీసీపీలు గౌతమీషాలి, తిరుమలేశ్వరరెడ్డి, మురళీకృష్ణనాయుడు, ఉదయరాణి, ఏడీసీపీ జి.రామకృష్ణ ఉన్నారు. నగరంలోని విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ఈ ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు.

- ఆంధ్రజ్యోతి, విజయవాడ

ఉగ్రదాడులకు అవకాశం ఉందన్న సమాచారంతో వాటినెలా ఎదుర్కోవాలన్న ఆలోచనలతో ఆక్టోపస్‌ కొత్త ఆవిష్కరణ చేసింది. ముంబైలో ఉగ్రదాడులు నేర్పిన పాఠాలు, నాడు బలగాలు వైపున కనిపించిన లోపాలను బేరీజు వేసుకుని ఆక్టోప్‌సలోని శాట్‌ కాంబోట్‌ వింగ్‌ ఈ నూతన ఆవిష్కరణ చేసింది. దీనికి కస్టమైజ్డ్‌ పవర్‌ వీల్‌ చైర్‌ అని నామకరణం చేసింది. ఉగ్రవాదులు దాడులకు వ్యూహాలు రచిస్తున్నప్పుడు ఆ సమాచారాన్ని నిఘా వర్గాలు రాష్ట్ర పోలీసు విభాగానికి అందజేస్తాయి. దాడులకున్న భవనాలను, ప్రాంతాలను ఈ వీల్‌ చైర్‌ ద్వారా వీడియో రికార్డింగ్‌ చేస్తారు. ఇందుకోసం ఆక్టోపస్‌ ముందుగా అమెరికా నుంచి 360 డిగ్రీల కోణంలో వీడియో రికార్డింగ్‌ చేసే కెమెరాలు కొనుగోలు చేసింది. దీన్ని అమర్చడానికి ఒక వీల్‌ చైర్‌ను సొంతంగా అక్టోపస్‌ తయారు చేసుకుంది. బ్యాటరీ ఆధారంగా నడిచే వీల్‌ చైర్‌కు వీడియో రికార్డింగ్‌ కెమెరాలున్న స్టాండ్‌ను అమర్చారు. ఆక్టోప్‌సలోని సిబ్బంది కుర్చీలో కూర్చుని ముందుకెళ్తూ భవనం మొత్తాన్ని రికార్డింగ్‌ చేస్తుంది. దానికున్న ప్రవేశ ద్వారాలు, బయటకున్న మార్గాలను రికార్డు చేస్తుంది. తద్వారా బ్లూ ప్రింట్‌ తీసుకొని త్రీడీ ఫొటోలను రూపొందిస్తారు. వాటిని ఆపరేషన్‌లో పాల్గొన్న సిబ్బందికిస్తారు. రెస్క్యూ ఆపరేషన్‌ జరిగినప్పుడు వాటిని పరిశీలిస్తూ కమ్యూనికేషన్‌ సిబ్బంది వ్యూహాలను అందజేస్తుంది. ఇందులోని కెమెరాలు భవనం ఉన్న వీధుల్లో సైతం గూగుల్‌ మ్యాప్‌ను ఇస్తాయి. ఆపరేషన్‌కు ముందు మాత్రమే ఈ కస్టమైజ్డ్‌ పవర్‌ వీల్‌ చైర్‌ను ఉపయోగిస్తారు. దేశంలో ఇలాంటి పరికరం ఆక్టోపస్‌ వద్ద మాత్రమే ఉంది.

ఆందోళనకారులపై ‘వాటర్‌ ఫైరింగ్‌’

ఆందోళనకారులు భారీగా గూమిగూడినప్పుడు వారిని చెదర గొట్టడానికి పోలీసులు వేర్వేరు వ్యూహాలను అనుసరిస్తారు. అందులో టియర్‌ గ్యాస్‌ ఒకటి, వాటర్‌ ఫైరింగ్‌ రెండు. నిరసనలు, ఆందోళనల సమయంలో రహదారులపైకి వారిని చెదరగొట్టడానికి ముందుగా వాటర్‌ ఫైరింగ్‌ చేస్తారు. అయినా ఆందోళనకారులు రహదారులపైనే ఉంటే టియర్‌ గ్యాస్‌ ప్రయోగిస్తారు. పోలీసు ఓపెన్‌ హౌస్‌లో వాటర్‌ ఫైరింగ్‌ను ప్రదర్శించారు. ఇది విద్యార్థులను బాగా ఆకట్టుకుంది. వాటర్‌ ఫైరింగ్‌ జరుగుతున్నంత సేపు విద్యార్థులు అరుపులు, కేకలు వేసి ఎంజాయ్‌ చేశారు.

ఆక్టోపస్‌ ‘నేత్ర’

నేత్ర వీ3 ప్లస్‌. ఆక్టోప్‌సలోకి కొత్తగా ప్రవేశించిన డ్రోన్‌ ఇది. ఉగ్రదాడులను ఎదుర్కోవడానికి ఆక్టోపస్‌ ఉపయోగిస్తున్న టెక్నాలజీలో ఇది అధునాతన పరికరం. ముంబైలోని ఐడియా ఫోర్జీ సంస్థ తయారు చేసిన ఈ నేత్ర డ్రోన్‌ను ఆక్టోపస్‌ ఈ ఏడాది మార్చిలో రూ.30లక్షలకు కొనుగోలు చేసింది. ఇది 6 కిలోల పేలోడ్‌ను తీసుకెళ్లగలదు. గంటకు 5కిలోమీటర్ల దూరం, 500 మీటర్ల ఎత్తుకు ఎగర గలదు. దీనికి 10 కిలోల బరువున్న వస్తువులను మోసే సామర్థ్యం ఉంది. దీనికున్న జీపీఎస్‌ పనిచేయలేని పక్షంలో సిగ్నల్స్‌ అందజేయడానికి ప్రత్యేకంగా ఒక యాంటీనా ఉంటుంది. ప్రస్తుతం ఈ నేత్రను నిఘా కోసం ఆక్టోపస్‌ ఉపయోగిస్తోంది.

ఆకట్టుకున్న డాగ్‌ షో

నేరగాళ్లను ట్రాక్‌ చేయడానికి, అనుమానాస్పద వస్తువులను గుర్తించడానికి పోలీసులు డాగ్‌ స్క్వాడ్‌ను ఉపయోగిస్తారు. సీఎ్‌సడబ్ల్యూ (సిటీ సెక్యూరిటీ వింగ్‌)లో మొత్తం 11 డాగ్స్‌ ఉన్నాయి. వాటిలో ఐదింటితో ఓపెన్‌ హౌస్‌లో విన్యాసాలు చేయించారు. ట్రైనర్స్‌తో కలిసి మార్చ్‌ చేశాయి. అధికారులకు సెల్యూట్‌ చేసి, పూలబొకేలను అందజేశాయి. ఈ షోను విద్యార్థులు ఉల్లాసంగా తిలకించారు.

ఆక్టోప్‌సలో ‘ఎమ్మార్వో’

ఉగ్రదాడులకు పరిధులుండవు. టార్గెట్‌ చేసుకున్న ప్రాంతంలో విధ్వంసం సృష్టించాలనుకున్నప్పుడు బాంబులు అమర్చుతారు. ఈ బాంబులు ఏ ప్రదేశంలో ఎక్కడ పెట్టారో వారికి తప్ప మిగిలిన వారికి తెలియదు. ఈ బాంబులను వెలికి తీయడానికి అక్టోపస్‌ ఎమ్మార్వోను ఉపయోగిస్తుంది. కెనడా నుంచి రూ.1.57కోట్లతో మినీ రిమోట్లీ ఆపరేట్‌ వెహికల్‌ను కొనుగోలు చేశారు. ఈ ఎమ్మార్వోలో కమాండ్‌ కంట్రోల్‌ యూనిట్‌, రోబోట్‌ ఉంటాయి. కమాండ్‌ కంట్రోల్‌ యూనిట్‌ ఇచ్చిన ప్రోగ్రాంను బట్టి రోబోట్‌ నడుచుకుంటుంది. దీనికి వాహనాల మాదిరిగా గేర్లు ఉంటాయి. మొదటి గేర్‌లో రోబోట్‌ గంటకు 1.5 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. రెండో గేర్‌లో మూడు, మూడో గేర్‌లో గంటకు 8కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. రోబోట్‌లో ఉన్న కెమెరాలు ఆ ప్రదేశాలను కమాండ్‌ కంట్రోల్‌ యూనిట్‌ మానిటర్‌లో చూపిస్తాయి. దాని ప్రకారం కమాండర్‌ కమాండ్స్‌ ఇస్తారు. ఈ రోబోట్‌ భూమిలో పాతిపెట్టిన బాంబులను వెలికి తీయగలదు. గుర్తించిన బాంబులను సురక్షిత ప్రదేశంలో పడేస్తుంది. ఎక్కడైనా సూట్‌కే్‌సలో బాంబు ఉన్నట్టు గుర్తిస్తే దాన్ని పట్టుకుని తీసుకెళ్తుంది. రోబోట్‌ తీసుకెళ్లే వస్తువులను పట్టుకోవడానికి వేర్వేరు చిన్న పరికరాలున్నాయి. ఇది భూమిపై నడవడమే కాకుండా మెట్లు ఎక్కగలదు. ఈ రోబోట్‌ పై తుపాకీని అమర్చుకునే సదుపాయం ఉంది. ఉగ్రవాదులు ఒక ఇంట్లో గుంపుగా ఉన్నప్పుడు తుపాకీని అమర్చి రోబోట్‌ను పంపితే కాల్పులు చేసే సామర్థ్యం ఈ ఎమ్మార్వోకు ఉంది. ఈ అత్యాధునిక ఆయుధాన్ని దేశంలో తొలుత కొనుగోలు చేసిన విభాగం అక్టోపస్‌. తరువాత ఇటీవల ప్రధానమంత్రి భద్రతను పర్యవేక్షించే ఎన్‌ఎ్‌సజీ కొనుగోలు చేసింది. ఏకే 47, 9ఎంఎం కోల్ట్‌, ఎంపీ 5ఏ3, ఎస్పీఏఎస్‌ (స్పెషల్‌ పర్పస్‌ ఆటోమేటిక్‌ షార్ట్‌గన్‌) వంటి ఆయుధాలను ఈ రోబోట్‌ ఆపరేట్‌ చేస్తుంది. దీనికి ఒకసారి చార్జింగ్‌ పెడితే 4 గంటలు పనిచేస్తుంది. 14వాట్స్‌ బ్యాటరీతో ఈ మొత్తం పరికరం కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఉగ్రవాదులు చేతుల్లో బందీలుగా ఉన్నవారి వద్దకు ఈ రోబోట్‌ వెళ్లినప్పుడు కమాండర్‌ మాటలు వినిపించడానికి దానిలో ఒక స్పీకర్‌ ఉంటుంది. అక్కడున్న పరిస్థితులను బందీలుగా ఉన్నవారు చెప్పే మాటలు ఈ స్పీకర్‌ ద్వారా కమాండర్‌కు వినిపిస్తాయి.

Updated Date - Oct 27 , 2024 | 12:42 AM