Share News

విభజన హామీలు తుంగలో తొక్కింది మీరు కాదా?

ABN , Publish Date - Mar 18 , 2024 | 03:29 AM

విభజన హామీలు అమలు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇస్తే... అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలోకి తొక్కింది ప్రధాని మోదీ కాదా అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలరెడ్డి ప్రశ్నించారు.

విభజన హామీలు తుంగలో తొక్కింది మీరు కాదా?

మోదీ, జగన్‌ది విడదీయరాని స్నేహబంధం: షర్మిల

అమరావతి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): విభజన హామీలు అమలు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇస్తే... అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలోకి తొక్కింది ప్రధాని మోదీ కాదా అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలరెడ్డి ప్రశ్నించారు. ఇటు జగన్‌ను, అటు చంద్రబాబును రెండు పంజరాల్లో పెట్టుకుని ఆడిస్తున్న రింగ్‌మాస్టర్‌ బీజేపీ అని ఆదివారం ఓ ప్రకటనలో విమర్శించారు. ‘‘పదేళ్ల పాటు రాష్ట్ర వినాశనంలో ముఖ్యపాత్ర పోషించి ఇప్పుడు మాపై దాడులుచేస్తారా? కాంగ్రెస్‌, వైసీపీ ఒకటే అని కూతలు కూస్తారా?’’ అని మోదీపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా జగన్‌తో అంటకాగుతూ, వాళ్ల అరాచకాలను అడ్డుకోకపోగా, వారికి అడ్డగోలుగా సహాయ సహకారాలు అందించలేదా అని నిలదీశారు. జగన్‌ను మోదీ దత్తపుత్రుడని అన్నదెవరో ప్రజలకు తెలుసన్నారు. మోదీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకూ సిగ్గువిడిచి జగన్‌ సపోర్టు చేశారని గుర్తుచేశారు. ప్రధాని మిత్రులు అదానీ, అంబానీలకు రాష్ట్రంలో ఆస్తులు కట్టబెట్టడంతో పాటు రాజ్యసభ స్థానాలు ఇచ్చారని విమర్శించారు. మోదీ, జగన్‌ది విడదీయరాని స్నేహ బంధమని షర్మిల ఎద్దేవా చేశారు.

Updated Date - Mar 18 , 2024 | 03:29 AM