Share News

జిల్లా అభివృద్ధిపై చర్చకు సిద్ధమా ?

ABN , Publish Date - Feb 27 , 2024 | 11:51 PM

‘‘జిల్లాలో గండికోట, మైలవరం జలాశయాల్లో నీరున్నా జిల్లా రైతులకు వ్యవసాయానికి నీరివ్వలేని దుస్థితి నెలకొంది. ఉపాధి లేక యువత గంజాయి, బెట్టింగ్‌, అసాంఘిక కార్యకలాపాల వైపు ఆకర్షితులవు తున్నారు.

జిల్లా అభివృద్ధిపై చర్చకు సిద్ధమా ?
విలేకరులతో మాట్లాడుతున్న ప్రవీణ్‌కుమార్‌రెడ్డి

వ్యవసాయానికి నీళ్లు లేవు

యువతకు ఉపాధి లేదు

కేసులకు భయపడి కేంద్రానికి జగన్‌రెడ్డి దాసోహం

ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి

కడప (ఎర్రముక్కపల్లె), ఫిబ్రవరి 27: ‘‘జిల్లాలో గండికోట, మైలవరం జలాశయాల్లో నీరున్నా జిల్లా రైతులకు వ్యవసాయానికి నీరివ్వలేని దుస్థితి నెలకొంది. ఉపాధి లేక యువత గంజాయి, బెట్టింగ్‌, అసాంఘిక కార్యకలాపాల వైపు ఆకర్షితులవు తున్నారు. కేంద్రం ప్రకటించిన విభజన హామీలు వైసీపీ గాలికి వదిలేసింది. కేసులకు భయపడి జగన్‌రెడ్డి కేంద్రానికి దాసోహమయ్యారు. జిల్లా అభివృద్ధిపై వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చర్చలకు సిద్ధమా’’ అని టీడీపీ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి సవాల్‌ చేశారు. మంగళవారం కడప నగరంలోని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి కుప్పం సభలో చంద్రబాబునాయుడు కుప్పానికి ఏం చేశాడని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అమ్మకు అన్నం పెట్టనివాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా అని వైఎస్సార్‌ చెప్పిన మాట ఇప్పుడు జగన్‌కే వర్తిస్తుందన్నారు. ఉమ్మడి జిల్లాకు కడప బిడ్డగా జగన్‌మోహన రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. జిల్లా యువతకు ఒక్క ఉద్యోగమైనా ఇచ్చావా అని ప్రశ్నించారు. స్టీలు ప్లాంటు గాలికి వదిలేశారని, కొప్పర్తిని పారిశ్రామిక హబ్‌గా చేస్తానని ఒక్క పరిశ్రమ కూడా పెట్టలేదన్నారు. చెన్నూరు షుగరు ఫ్యాక్టరీ, ప్రొద్దుటూరు పాలకేంద్రం, నందలూరు ఆల్విన్‌ ఫ్యాక్టరీ తెరుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి దాదాపు ఐదేళ్లు పూర్తవుతున్నా ఇప్పటి వరకు తెరిచారా అని ప్రశ్నించారు. అన్నమయ్య డ్యాం తెగిపోయి రెండేళ్లు దాటినా ఇంత వరకు దానిని నిర్మించలేదన్నారు. కడప జిల్లాకు ఒక్క రైల్వే లైను అయినా తెచ్చారా అని ప్రశ్నించారు. మీ కేసులకు, అవినాశ్‌ కేసులకు భయపడి కేంద్రానికి దాసోహం అయ్యారన్నారు. వీటిపై కావాలంటే బహిరంగచర్చకు తాను వస్తానని సవాల్‌ చేశారు. పెరిగిన ధరలు తగ్గాలంటే టీడీపీని గెలిపించాలని కోరారు.

Updated Date - Feb 27 , 2024 | 11:51 PM