Share News

ఏపీపీఎస్సీ భ్రష్టు

ABN , Publish Date - Mar 16 , 2024 | 02:58 AM

ప్రతిష్ఠాత్మకమైన రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను సీఎం జగన్‌ తన కక్కుర్తితో భ్రష్టుపట్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.

ఏపీపీఎస్సీ భ్రష్టు

జగన్‌దే ఈ పాపం

కమిషన్‌ను పైరవీలకు కేంద్రంగా మార్చారు

గ్రూప్‌-1 ఉద్యోగాలను కూడా అమ్ముకున్నారు

ఇంకా ఏ మొహం పెట్టుకొని సీట్లో కూర్చున్నారు?

పేపర్లు రెండుసార్లు దిద్దాల్సిన అవసరమేంటి?

మూల్యాంకనంపై హైకోర్టు ముందు అబద్ధాలు

అభ్యర్థుల భవిష్యత్తును నాశనం చేసినవారిని

వదిలేది లేదు: టీడీపీ అధినేత చంద్రబాబు

అమరావతి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠాత్మకమైన రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను సీఎం జగన్‌ తన కక్కుర్తితో భ్రష్టుపట్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ పేపర్ల మూల్యాంకనంలో ఏపీపీఎస్సీ తీరును తప్పుబట్టిన హైకోర్టు ఏకంగా పరీక్షలను రద్దు చేయడంపై ఆయన శుక్రవారం స్పందించారు. ‘ఎన్నో కలలతో ఆశలతో ఏళ్ల తరబడి చదివి పరీక్షలు రాసిన అభ్యర్థులను దారుణంగా మోసం చేశారు. అభ్యర్థులు, వారి కుటుంబాల ఆశలను ఛిద్రం చేశారు. క్రూరమృగాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. మొత్తం వ్యవస్థపైనే యువతకు నమ్మకం పోయేలా చేస్తున్నారు. రాష్ట్రంలో అత్యున్నతమైన గ్రూప్‌-1 పరీక్షలనే మొక్కుబడి తంతుగా మార్చడం దిగ్ర్భాంతికరం’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘మేం ఉన్నప్పుడు నిజాయితీపరులను, సమర్థులను వెతికి తెచ్చిపెట్టాం. డీజీపీగా పనికిరాడని తీసేసిన సవాంగ్‌ను జగన్‌ ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమించారు. ఆయనతో తమకు కావాల్సిన పనులు చేయించుకోవాలని చూశారు. వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు బాబు, అనంతపురం వైసీపీ నేత సుధాకర్‌రెడ్డి, తమ కుటుంబంలోని ప్రభుదాస్‌ రెడ్డి మనవడు సుధీర్‌రెడ్డి వంటివారిని కమిషన్‌ సభ్యులుగా వేశారు. ఇంతమందిని తెచ్చి నింపడానికి అదేమైనా వైసీపీ కార్యాలయమా? వీరందరూ కలసి ఏపీపీఎస్సీని నాశనం చేశారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 30 డిఫ్యూటీ కలెక్టర్లు, 28 డీఎస్పీ పోస్టులతో సహా మొత్తం 162 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రిలిమ్స్‌, మెయిన్‌ జరిగాయి. పరీక్ష పత్రాలు చేతితో దిద్దాలని నోటిఫికేషన్‌లో ఉంటే డిజిటల్‌గా మూల్యాంకనం చేయించారు. దీనిపై అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో చేతితోనే దిద్దించాలని తీర్పు చెప్పింది. ఆ సమయంలో సీతారామాంజనేయులు కమిషన్‌ కార్యదర్శిగా ఉన్నారు. ఆయన మంగళగిరి సమీపంలోని హాయ్‌ల్యాండ్‌లో మెయిన్స్‌ పరీక్షాపత్రాలు దిద్దించారు.

ఆ తర్వాత గౌతంసవాంగ్‌ చైర్మన్‌గా వచ్చారు. అంతకుముందు చేతితో దిద్దించిన పరీక్షా పత్రాల ఫలితాలను తొక్కేసి అవే పత్రాలను ఆయన రెండోసారి దిద్దించారు. దీనిపై అభ్యర్థులు కోర్టుకు వెళ్తే అధికారులు బరితెగించి కోర్టుకు అబద్ధాలు చెప్పారు. రెండోసారి దిద్దించలేదని ఏకంగా అఫిడవిట్‌ సమర్పించారు. కానీ దీనిపై పోరాటం చేసిన అభ్యర్థులు.. రెండుసార్లు మూల్యాంకనం చేసినట్లు ఆధారాలు సంపాదించి కోర్టుకు సమర్పించారు. మొదటిసారి దిద్దించినప్పుడు హాయ్‌ల్యాండ్‌లోని రిసార్ట్‌కు అద్దె చెల్లించారు. అక్కడ పోలీసు భద్రత కావాలని గుంటూరు ఎస్పీకి కమిషన్‌ కార్యదర్శి హోదాలో సీతారామాంజనేయులు లేఖ రాశారు. పేపర్లు దిద్దడానికి అవసరమైన స్టేషనరీ కోసం ఆర్డర్‌ పెట్టి డబ్బు కూడా చెల్లించారు’ అని చంద్రబాబు వివరించారు. ఈ పత్రాలను రెండోసారి దిద్దించడమే అక్రమాలకు మూలమని ఆరోపించారు. తమకు కావాల్సినవారికి ఉద్యోగాలు రాలేదని మొదటిసారి దిద్దిన ఫలితాలను తొక్కిపెట్టారని, తాడేపల్లి ప్యాలెస్‌ ఆదేశించగానే మరోసారి దిద్దించారని చెప్పారు. ఇద్దరు పీఎస్‌ అధికారులు అక్కడ కూర్చుని కమిషన్‌లో పాపాలు చేసి ఐపీఎస్‌ విలువ దిగజార్చారని, ఈ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి రూ.వందల కోట్లు ఖర్చు చేసి ఢిల్లీ నుంచి పెద్ద లాయర్లను తెచ్చి కోర్టుల్లో హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. ‘పరీక్షా పత్రాలను నిబంధనలకు విరుద్ధంగా రెండోసారి దిద్దారని కోర్టు స్పష్టమైన నిర్ధారణకు వచ్చి ఆ పరీక్షను రద్దు చేసింది. మళ్లీ పెట్టాలని ఆదేశించింది. బాబాయి హత్యను కప్పిపెట్టినట్లుగా ఈ పరీక్షల్లోని అవినీతి బాగోతాలను దాచాలని ప్రయత్నించారు.

ఈ ముఖ్యమంత్రికి సిగ్గూ ఎగ్గూ లేవు. కోర్టు తీర్పు కాపీ రాకముందే అప్పీలుకు వెళ్తామని ప్రకటనలు చేయించారు. డబ్బు ఇచ్చినవాళ్లు మీద పడకుండా కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత ముఖ్యమైన పరీక్షలో ఇన్ని అక్రమాలు చేసి పట్టుబడిన తర్వాత ఈ సీఎం ఇంకా ఏ మొహం పెట్టుకొని సీట్లో కూర్చున్నాడు? మాపై కేసులు పెట్టి మా నోళ్లు మూయిస్తే సరిపోతుందా? ఇన్ని అక్రమాలు జరుగుతుంటే యువత ఇంకా ఈ రాష్ట్రంలో ఉండగలుగుతారా? ఇన్ని దుర్మార్గాలు చేసిన అధికారులు ఒక్కక్షణం కూడా అక్కడ ఉండటానికి అర్హులు కాదు. వారిని తక్షణం తొలగించాలి. వారిపై కేసు పెట్టి అరెస్టు చేయాలి’ అని ఆయన డిమాండ్‌ చేశారు. టీడీపీ ప్రభుత్వం 22 ఏళ్లపాటు అధికారంలో ఉంటే ఒక్కసారి కూడా ఏపీపీఎస్సీ పరీక్షల్లో అవకతవకలకు ఆస్కారం ఇవ్వలేదని, వీళ్లు బహిరంగ మార్కెట్లో పోస్టులు అమ్మకానికి పెట్టారని విమర్శించారు. ప్రశ్నాపత్రాలు రెండుసార్లు దిద్దడంలో సీతారామాంజనేయులు, సవాంగ్‌ ఇద్దరి పాత్రా ఉందని, వారిద్దరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. సీఎం పేషీలో కూర్చుని సెటిల్మెంట్లు, రాజీలు చేసే ఐఏఎస్‌ అధికారి ధనుంజయ్‌ రెడ్డిపైనా విచారణ జరపాలని చంద్రబాబు కోరారు. ఈ ముగ్గురు అధికారులు ఈ వ్యవహారంలో తమ పాత్రపై సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. సీఎం జగన్‌ కూడా నోరు తెరిచి తన వైఫల్యంపై సమాధానం చెప్పాలన్నారు. దీనిపై గవర్నర్‌ను కలసి ఆయన జోక్యం కోరతామని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసినవారిని వదిలి పెట్టేది లేదని చంద్రబాబు ప్రకటించారు.

Updated Date - Mar 16 , 2024 | 02:58 AM