Share News

APMDC : అర్ధరాత్రి ఏపీఎండీసీ కార్యాలయం సీజ్‌

ABN , Publish Date - Jun 09 , 2024 | 03:24 AM

రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని ప్రభుత్వం అర్ధరాత్రి సీజ్‌ చేసింది. గనుల శాఖ డైరెక్టర్‌, ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) వైస్‌చైర్మన్‌,

APMDC : అర్ధరాత్రి ఏపీఎండీసీ కార్యాలయం సీజ్‌

సాయుధ పోలీసు పహారా ఏర్పాటు

తెరిచేదాకా ఉద్యోగులకూ ప్రవేశం లేదు

ఎండీగా యువరాజ్‌ బాధ్యతల స్వీకరణ

ఏపీఐఐసీ నుంచే రెండు గంటలు సమీక్ష

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని ప్రభుత్వం అర్ధరాత్రి సీజ్‌ చేసింది. గనుల శాఖ డైరెక్టర్‌, ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) వైస్‌చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా జంట పోస్టుల్లో ఉన్న వెంకటరెడ్డిపై శుక్రవారం రాత్రే ప్రభుత్వం వేటు వేసిన విషయం తెలిసిందే. ఆయన డిప్యుటేషన్‌ కాలం మరో నెల వరకు ఉన్నా గనుల శాఖ నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే ఏపీఎండీసీ ఆఫీసును పూర్తిగా పోలీసుల నియంత్రణలోకి తీసుకొచ్చింది. కార్యాలయంలోని అన్ని విభాగాలను పోలీసులు పరిశీలన చేసి పూర్తిగా స్వాధీనంలోకి తీసుకున్నారు. కీలకమైన ఫైళ్లు, హార్డ్‌డిస్క్‌లు, ఇతర సమాచారం బయటకు వెళ్లకుండా ఉండేందుకే ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రభుత్వం ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకునే వరకు ఆఫీసు మూసేఉంటుందని ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి.

అత్యంత అవినీతి కార్యాలయం?

జగన్‌ ప్రభుత్వంలో అత్యంత అక్రమాలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న విభాగం గనుల శాఖే. ఇసుక, బొగ్గు, బీచ్‌శాండ్‌, బెరైటీస్‌, ఇతర ఖనిజాల వేలం, టెండర్లు, అమ్మకం ప్రక్రియలో వేల కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలున్నాయి. ఆ అక్రమాలకు గనుల శాఖ ఉన్నతాధికారులే కొమ్ముకాశారనే విమర్శలున్నా యి. ఇసుక తవ్వకాల్లో అక్రమాలే జరగలేదంటూ ఎన్జీ టీ, హైకోర్టును సైతం గనులశాఖ అధికారులు తప్పుదోవ పట్టించారు. సుప్రీంకోర్టుకు కూడా తప్పుడు నివేదికలిచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇదంతా వైసీపీ ముఖ్యనేత ఆదేశాల మేరకే జరిగిందన్నది బహిరంగ రహస్యం. ఎన్నికల్లో జగన్‌ పార్టీ ఘోర పరాజయం పాలవడంతో తమ అక్రమాలు ఎక్కడ బయటపడుతాయోనన్న ఆందోళన వారిలో కొందరిని వెంటాడుతోంది. సులియారి బొగ్గు, మంగంపేట బెరైటీస్‌ అమ్మకాల ఫైళ్లు, ఇతర కీలక సమాచారం మాయంచేస్తారన్న అనుమానాలు కూడా కలిగాయి. ఇప్పటికే మంగంపేటలోని బెరైటీస్‌ ప్రాజెక్టు అధికారికి ఏపీఎండీసీలోని ఓ సలహాదారు కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లినట్లు తెలిసింది. కీలక ఫైళ్లు ఆన్‌లైన్‌ నుంచి తొలగించాలని చెప్పినట్లు సమాచారం ఈ పరిణామాలన్నీ ప్రభుత్వ పరిశీలనకు వెళ్లడంతో శుక్రవారం రాత్రే ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డిపై సర్కారు వేటువేసింది. ఎండీసీలో ఏమైనా జరగొచ్చన్న అనుమానం తో సాయుధ పోలీసు బలగాన్ని విజయవాడ పోరంకిలోని ఏపీఎండీసీ కార్యాలయానికి పంపించారు. అం దులోని కీలక చాంబర్లను అధికారులు పరిశీలన చేశా రు. తర్వాత ఆఫీసుకు తాళాలు వేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆఫీసు బయట సాయుధ పోలీ సు పహారా ఏర్పాటు చేశారు. కాగా, ఆఫీసుకు తాళా లు వేసిన విషయం శనివారం ఉదయమే ఎండీసీ ఉద్యోగులకు తెలిసిపోయింది. కొన్ని పెండింగ్‌ పనులున్నాయంటూ కార్యాలయంలోకి వెళ్లేందుకు ఉద్యోగులు ప్రయత్నించగా.. సీజ్‌ చేశామని, ఎవరూ లోనికి వెళ్లడానికి వీల్లేదని వారికి పోలీసులు స్పష్టం చేశారు.

గనుల శాఖ డైరెక్టర్‌ కార్యాలయమూ సీజ్‌..

ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలోని గనుల శాఖ డైరెక్టర్‌ కార్యాలయాన్ని కూడా పోలీసులు సీజ్‌చేశారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ రెండు ఆఫీసులు పోలీసుల నియంత్రణలోనే ఉంటాయని ఉన్నతాధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు గనుల శాఖ డెరెక్టర్‌గా, ఎండీసీ ఎండీగా యువరాజ్‌ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఏపీఐఐసీ భవనంలోని తన కార్యాలయంలో గనుల శాఖ అధికారుల సమక్షంలో చార్జ్‌ తీసుకున్నారు. ఆ సమయంలో వెంకటరెడ్డి లేకపోవడంతో జాయింట్‌ సంతకానికి బదులు యువరాజ్‌ ఒక్కరే సంతకం చేశారు. అనంతరం గనుల శాఖ కార్యకలాపాలు, చేపట్టిన ప్రాజెక్టులు, కీలక అంశాలపై రెండు గంటలపాటు సమీక్ష చేశారు. ఎండీసీ ఉపాధ్యక్షులు, అధికారులు పలువురు హాజరయ్యారు.

ఫైబర్‌నెట్‌ ఎండీగా యువరాజ్‌ బాధ్యతల స్వీకరణ

ఏపీ స్టేట్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఎండీగా వ్యవహరించిన ఎం.మధుసూదనరెడ్డిపై ప్రభుత్వం వేటు వేసింది. ఆయనకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వకుండా జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్‌నెట్‌లో స్కాం జరిగిందంటూ జగన్‌ సర్కారు తప్పుడు కేసులు పెట్టి.. పలువురు మాజీ అధికారులను అరెస్టు చేయించడంతో పాటు చంద్రబాబుపైనా చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఇప్పుడు ఆ తప్పుడు కేసుకు సంబంధించి కీలక ఫైళ్లతో పాటు గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం సాగించిన చీకటి వ్యవహారాల ఫైళ్లు కూడా మాయం చేశారన్న ఆరోపణలొచ్చాయి. దీంతో మూడు రోజుల క్రితం పోలీసులు ఫైబర్‌నెట్‌ కార్యాలయంలో తనిఖీలు చేశారు. మధుసూదనరెడ్డి ఏడాదిన్నర క్రితం ఏపీఎండీసీ నుంచి బదిలీపై ఫైబర్‌నెట్‌కు వచ్చారు. ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం చిత్తుగా ఓడిపోవడంతో కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే కదలడానికి వీల్లేదని జీఏడీ ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - Jun 09 , 2024 | 03:24 AM