కలిసి ఉద్యమం చేద్దాం!
ABN , Publish Date - Feb 08 , 2024 | 03:57 AM
ఉద్యోగుల అపరిష్కృత సమస్యలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోవటంపై కలిసి ఉద్యమం చేద్దామని ఏపీజేఏసీ అమరావతి నాయకత్వానికి,
ఏపీజేఏసీ అమరావతితో ఏపీజేఏసీ బృందం చర్చలు
విజయవాడ, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల అపరిష్కృత సమస్యలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోవటంపై కలిసి ఉద్యమం చేద్దామని ఏపీజేఏసీ అమరావతి నాయకత్వానికి, ఏపీజేఏసీ నాయకత్వం ప్రతిపాదించింది. ఏపీజేఏసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఏపీఎన్‌జీవో అసోసియేషన్ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు బుధవారం తన బృందాన్ని విజయవాడలోని ఏపీ రెవెన్యూభవన్‌కు పంపించారు. ఈ బృందంలో జేఏసీ ప్రధానకార్యదర్శి హృదయరాజు, ఏపీఎన్‌జీవో రాష్ట్ర ప్రఽధాన కార్యదర్శి కేవీ శివారెడ్డి, హరనాథ్, జగదీష్ తదితరులున్నారు. ఏపీజేఏసీ అమరావతి తరఫున చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధానకార్యదర్శి పలిశెట్టి దామోదరరావు, అసోసియేట్ చైర్మన్ ఫణి పేర్రాజు, విజయలక్ష్మి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. బండి శ్రీనివాసరావు పంపిన వర్తమానాన్ని ఏపీజేఏసీ బృందం బొప్పరాజుకు తెలియజేసింది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు అపరిష్కృతంగా ఉండటం, ఉద్యోగుల బకాయిల చెల్లింపులపై ఏ ఒక్క హామీ అమలు కాకపోవటం వంటి కారణాల వల్ల ఉద్యమం దిశగా వెళ్లాల్సి వచ్చిందని శివారెడ్డి, హృదయరాజు చెప్పారు. ఈ నెల 11వ తేదీన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని, అందులో కార్యాచరణ ప్రకటించాలన్న నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. గతంలో మాదిరిగా రెండు జేఏసీలు కలిసి పోరాటం సాగిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని బండి శ్రీనివాసరావు భావిస్తున్నారని బొప్పరాజుకు వివరించారు. ఈ సందర్భంగా ఏపీజేఏసీ బృందానికి బొప్పరాజు ఒక షరతు విధించారు. ఈ సారి నల్లబ్యాడ్జీలు, ధర్నాలు, ప్రదర్శనలు అంటూ సుదీర్ఘ షెడ్యూల్ లేకుండా నేరుగా రాష్ట్రస్థాయిలో ఉద్యోగుల సత్తా చాటేలా ‘చలో విజయవాడ’ను మళ్లీ నిర్వహిద్దామని ప్రతిపాదించారు. ఆ తర్వాత నేరుగా సమ్మెలోకి వెళదామన్నారు. ఉద్యమ కార్యాచరణ షెడ్యూల్ ఈ విధంగా ఉంటే తాము తక్షణం కలిసి వస్తామని చెప్పారు.