Share News

ఏపీఐఐసీ భూములు హాంఫట్‌!

ABN , Publish Date - May 25 , 2024 | 04:15 AM

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సొంత జిల్లా కడపలో పరిశ్రమల ఏర్పాటు లక్ష్యంగా ఏపీఐఐసీ ద్వారా కడప శివారులో కొప్పర్తి పారిశ్రామికవాడను ఏర్పాటు చేశారు.

ఏపీఐఐసీ భూములు హాంఫట్‌!

రూ.100 కోట్ల భూములను చుక్కల పేరిట చక్కబెట్టేయత్నం

ఏపీఐఐసీకి వైఎస్‌ ఇచ్చిన భూములను

తన వారికి పంచేస్తున్న తనయుడు

వైసీపీ అండ్‌ కో భారీ పన్నాగం

సీఎంవో నుంచి చక్రం తిప్పుతున్న వైనం

ఇప్పటికే ఏపీఐఐసీకి తెలియకుండా

30 కోట్ల విలువైన భూముల మ్యుటేషన్‌

కోడ్‌ ముగిసి.. ఫలితం వచ్చేలోగా మరిన్ని

మాకు 60.. మీకు 40 శాతం అంటూ డీల్‌

ఆ భూమిలో లే అవుట్‌ వేసేందుకు రెడీ

తాడేపల్లి నుంచి జిల్లా అధికారులపై ఒత్తిడి

ఇరుక్కుంటామంటూ అధికారుల ఆందోళన

(కడప-ఆంధ్రజ్యోతి)

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సొంత జిల్లా కడపలో పరిశ్రమల ఏర్పాటు లక్ష్యంగా ఏపీఐఐసీ ద్వారా కడప శివారులో కొప్పర్తి పారిశ్రామికవాడను ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా సీకేదిన్నె రెవెన్యూ పరిధిలోని తాడిగొట్ల రెవెన్యూ పొలంలో వివిధ సర్వే నెంబర్లలో 2,595 ఎకరాలను ఏపీఐఐసీకి 2008 అక్టోబరులో కేటాయించారు. ఇవన్నీ సాగుకు పనికిరాని భూములు. కొప్పర్తి పారిశ్రామికవాడలో సౌత్‌ బ్లాక్‌లో ఉండేవి. వైఎస్‌ హయాంలోనే కడప శివారులోని రిమ్స్‌ సమీపంలో ఐటీ పరిశ్రమ ఏర్పాటు కోసమని 52.76 ఎకరాల భూమిని కేటాయించారు. దీనికి సీపీ బ్రౌన్‌ ఇన్‌ఫర్మేమేషన్‌ టెక్నాలజీ సిటీగా నామకరణం చేశారు. అయితే, జగన్‌ సీఎం అయిన తరువాత ఐటీ పార్కును గాలికి వదిలేసి.. ఆ భూమిని షిరిడీసాయి ఎలక్ట్రికల్స్‌ సంస్థకు కట్టబెట్టారు.


కొట్టేసే ప్లాన్‌

ఐటీ పరిశ్రమ కోసం కేటాయించిన భూములను ముఖ్యనేత అస్మదీయులకు కట్టబెట్టడంతో.. కొప్పర్తి పారిశ్రామికవాడ భూములపై కొందరు వైసీపీ నేతలు కన్నేశారు. కడప-పులివెందుల ప్రధాన రహదారిలో తాడిగొట్ల రెవెన్యూ పొలంలో ఏపీఐఐసీకి కేటాయించిన భూముల విలువ ఇప్పుడు భారీగా పెరిగింది. ఇక్కడ నివాసప్రాంతాలు కోసం వెంచర్లు వెలుస్తున్నాయి. దీంతో ఏపీఐఐసీకి ఇచ్చిన భూములపై కన్నేిసిన వైసీపీ నేతలు ఆ భూములు తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చకా చకా పావులు మొదలుపెట్టారు. ఉమ్మడి కడప జిల్లాలో గతంలో ఆర్డీవోగా పనిచేసిన ఓ అధికారి ఇప్పుడు ఏపీఐఐసీలో పనిచేస్తున్నారు. ఏపీఐఐసీలోని విలువైన భూముల్లో ఏవి ఎక్కడున్నాయో ఆయనకు తెలుసు. దీంతో పాటు ఓ ప్రభుత్వ సలహాదారుడు, మరో నేతతో కలిసి రాష్ట్రస్థాయి కీలక అధికారి ద్వారా ఏపీఐఐసీకి కేటాయించిన భూములను మళ్లీ తిరిగి యజమానులకు ఇచ్చేలా ప్లాన్‌ చేసినట్లు సమాచారం.

ఈ భూములు వెనక్కి ఇచ్చేందుకుగాను యజమానులకు 40 శాతం, ఇప్పించిన వారికి 60శాతం తీసుకునేలా ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే తొలుత తాడిగొట్ల రెవెన్యూ పొలం సర్వేనెంబర్‌ 215లో 2.85 ఎకరాలు, 216లో 10.36 ఎకరాలను ఏపీఐఐసీకి తెలియకుండానే ఇవి చుక్కల భూములు.. మ్యుటేషన్‌ చేయాలంటూ యజమానుల పేరిట దరఖాస్తు చేసుకున్నారు. ఆ ఫైలు చకా చకా కదిలింది. ఆ భూములు రిజిస్ట్రేషన్‌ అయిపోయి ప్రస్తుతం శ్రీ అరుణాచలేశ్వర ఇన్‌ఫ్రా ఎన్‌జీపీఏ ఆర్‌. వీరారెడ్డి పేరిట రిజిస్టరు అయ్యాయి. వాస్తవంగా ఈ భూములన్నీ ఏపీఐఐసీ తెలియకుండా రెవెన్యూ ఎవరికీ కేటాయించ కూడదు. అయితే కీలక అధికారులంతా కడప జిల్లా వారు కావడం, ఇక్కడ రెవెన్యూలో పనిచేసిన వారు కావడం, ఇక కడపలో ఆర్డీవోగా పనిచేసిన ఓ అధికారి, సలహాదారులు.. ఇలా అందరూ రంగప్రవేశం చేయడంతో ఏపీఐఐసీకి తెలియకుండానే భూములు చేతులు మారాయి. మొదటి అడుగు విజయవంతంగా పూర్తి కావడంతో ఇప్పుడు మరలా సుమారు రూ.100 కోట్ల విలువ చేసే 43.13 ఎకరాలను చుక్కల భూముల పేరిట క్రియేట్‌ చేసేందుకు యజమానుల పేరిట దరఖాస్తు చేయించారు. తాడి గొట్ల రెవెన్యూ పొలం సర్వేనెం.149లో 8.95 ఎకరాలు, 157లో 12 ఎకరాలు, 158లో 6.84 ఎకరాలు, 207లో 6.67 ఎకరాలు, 213లో 9.67 ఎకరాలు మొత్తం 43.13 ఎకరాలను చుక్కల భూముల పేరిట యజమానుల పేర్లతో దరఖాస్తు చేసుకున్నారు. ఫైలు సీకేదిన్నె తహశీల్దారు కార్యాలయం నుంచి కడప ఆర్డీవో కార్యాలయానికి చేరుకుంది. గతంలో పనిచేసిన తహసీల్దారు, అధికారులు నివేదిక తయారు చేసి బదిలీపై వెళ్లారు. అయితే, వెంటనే ఫైలు క్లియర్‌ చేయాలంటూ తాడేపల్లి నుంచి జిల్లా అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఒకసారి కేటాయించిన భూములు తిరిగి వెనక్కి ఇస్తే ఇరుక్కుపోతామని కొందరు రెవెన్యూ అధికారులు మధనపడుతున్నారు. సెలవులో వెళదామంటే ఎన్నికల కోడ్‌ ఉంది. వాస్తవంగా ఈ భూములు కమలాపురం నియోజకవర్గంలో ఉన్నాయి. ఆ నియోజవర్గానికి చెందిన ఓ ప్రజాప్రతినిధికి భూములంటే మహాపిచ్చి. అయితే ఆయనకు తెలియకుండానే ఓ నేత వీటిని కొట్టేసే యత్నం చేస్తున్నారు.

వైఎస్‌ ఆశయానికి జగన్‌ తూట్లు

‘సెంట్రల్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌’లో భాగంగా ఏపీఐఐసీ అధీనంలో ఉన్న ఈ భూములను అభివృద్ధి చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. ఎన్నికల తర్వాత ఇక్కడకు వచ్చి పరిశీలించి మౌలిక వసతులు చేపట్టేందుకు డీపీఆర్‌ తయారు చేస్తారు. పరిశ్రమలు వస్తే కడప జిల్లా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వస్తాయి. అయితే, నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉన్నా.. సొంతానికి కోట్లు గడించాలన్న దుర్బుద్ధితో పరిశ్రమల భూములు కొట్టేయాలని ప్లాన్‌ చేయడం విమర్శలకు తావిస్తోంది. దివంగత వైఎస్సార్‌ సొంత జిల్లాకు పరిశ్రమల కోసం భూములు కేటాయిస్తే ఆయన తనయుడు సీఎం జగన్‌ జమానాలో మాత్రం ఆ భూములను అస్మదీయులకు కట్టబెడుతూ తండ్రి ఆశయానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఈ విషయమై ‘ఆంధ్రజ్యోతి’ కడప ఆర్డీవో మధుసూధన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆ భూములకు సంబంధించి ఫైలు వచ్చింది వాస్తవమేనని తెలిపారు. ఆ భూములను తిరిగి వెనక్కి ఇవ్వడం సాధ్యంకాదని తిప్పి పంపించినట్టు చెప్పారు.

Updated Date - May 25 , 2024 | 04:15 AM