Andhra Pradesh Population : ఇది ఏపీ జనాభా.. 5,78,92,568
ABN , Publish Date - Jul 11 , 2024 | 04:20 AM
రాష్ట్ర జనాభా భారీగా పెరుగుతోంది. గురువారం (జూలై 11) అంతర్జాతీయ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని జనాభా అధ్యయన కేంద్రం గ్రోత్ రేట్ ఆధారంగా రాష్ట్రంలో ప్రస్తుత జనాభాను అంచనా వేసి బుధవారం
ఇది ఏపీ జనాభా.. గతేడాదితో పోలిస్తే 0.35% పెరుగుదల
టాప్‌లో నెల్లూరు.. చివరి స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా
దేశంలో ఆంధ్రప్రదేశ్‌కు పదో స్థానం.. యూపీకి మొదటి స్థానం
144 కోట్లు దాటేసిన భారత దేశ జనాభా
విశాఖపట్నం, జూలై 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర జనాభా భారీగా పెరుగుతోంది. గురువారం (జూలై 11) అంతర్జాతీయ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని జనాభా అధ్యయన కేంద్రం గ్రోత్ రేట్ ఆధారంగా రాష్ట్రంలో ప్రస్తుత జనాభాను అంచనా వేసి బుధవారం నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం ప్రస్తుత రాష్ట్ర జనాభా 5,78,92,568 మందిగా ఉంది. గతేడాది జనాభా (5,76,89,944)తో పోలిస్తే ఈ సంవత్సరం 2,02,624 మంది (0.35 శాతం) పెరిగారు. దేశంలో 23 కోట్లకుపైగా జనాభాతో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా.. ఏపీ పదో స్థానంలో కొనసాగుతోంది. 3.81 కోట్లకుపైగా జనాభాతో తెలంగాణ 13వ స్థానంలో ఉంది. ఏపీలో.. 24,69,712 మంది జనాభాతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మొదటి స్థానంలో నిలవగా.. 9,53,960 మందితో పార్వతీపురం మన్యం జిల్లా ఆఖరి స్థానంలో ఉంది. అత్యధిక జనసాంద్రత కలిగిన జిల్లాగా విశాఖపట్నం నిలిచింది. ఈ జిల్లాలో కిలోమీటరుకు 1,670 మంది నివసిస్తున్నారు. అత్యల్ప జనసాంద్రత కలిగిన జిల్లాగా అల్లూరి సీతారామరాజు జిల్లా (కిలోమీటరుకు 77 మంది) నిలిచింది. ఇక పురుషులు, మహిళల నిష్పత్తి చూస్తే... విజయనగరం జిల్లాలో ప్రతి 1000 మంది పురుషులకు.. 1019 మంది మహిళలు ఉండగా, అనంతపురం జిల్లాలో అత్యల్పంగా ప్రతి 1000 మంది పురుషులకు 977 మంది మహిళలు ఉన్నారు.
'
0.92 శాతం పెరిగిన దేశ జనాభా
గతేడాది దేశ జనాభా 142,86,27,663. ఈ సంవత్సరం 0.92 శాతం పెరిగి 144,17,19,852కు చేరింది. ఇక ప్రపంచ జనాభా 801,98,76,189కి చేరింది. ప్రపంచ జనాభాలో భారత్ వాటా 17.76 శాతంగా ఉంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాలో భారత్ టాప్‌లో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో చైనా నిలిచింది. భారతదేశ జనాభాలో 36.3 శాతం పట్టణాల్లో, 63.7 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా చేసుకుని గ్రోత్ రేటును బట్టి ఈ లెక్కలు అంచనా వేస్తున్నట్టు పాపులేషన్ రిసెర్చ్ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ మునిస్వామి వెల్లడించారు.