వాట్సాప్ సమాచారంతో పిల్ ఎలా వేస్తారు?
ABN , Publish Date - Feb 29 , 2024 | 03:37 AM
ఏపీ బార్ కౌన్సిల్ నిధులు దుర్వినియోగం అయ్యాయని, సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ వేసిన పిల్‌ను హైకోర్టు కొట్టివేసింది. వాట్సాప్ వచ్చిన సమాచారం ఆధారంగా పిల్ ఎలా దాఖలు చేస్తారని పిటిషనర్‌ను నిలదీసింది. పిల్‌ను నాన్‌సీరియ్‌సగా
పిటిషనర్‌ను నిలదీసిన హైకోర్టు ధర్మాసనం
బార్ కౌన్సిల్ నిధుల దుర్వినియోగంపై పిల్ కొట్టివేత
అమరావతి, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): ఏపీ బార్ కౌన్సిల్ నిధులు దుర్వినియోగం అయ్యాయని, సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ వేసిన పిల్‌ను హైకోర్టు కొట్టివేసింది. వాట్సాప్ వచ్చిన సమాచారం ఆధారంగా పిల్ ఎలా దాఖలు చేస్తారని పిటిషనర్‌ను నిలదీసింది. పిల్‌ను నాన్‌సీరియ్‌సగా అభివర్ణించింది. పార్టీ ఇన్ పర్సన్ న్యాయవాది బాల్‌రెడ్డికి రూ.50 వేలు ఖర్చులు విధిస్తూ పిల్‌ను కొట్టివేసింది. ఈ దశలో పిటిషనర్ జోక్యం చేసుకుంటూ దిగువ కోర్టులో న్యాయవాది అయిన తాను అంత మొత్తం చెల్లించుకోలేనని, విధించిన ఖర్చులను ఉపసంహరించాలని అభ్యర్థించారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం విధించిన ఖర్చులను తొలగించింది. బార్ కౌన్సిల్ స్టాంపుల కొనుగోలులో రూ.కోట్లు దుర్వినియోగం అయ్యాయని, ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ కడపకు చెందిన న్యాయవాది మూలి వెంకట బాలిరెడ్డి పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ బుధవారం విచారణకురాగా పార్టీఇన్‌పర్సన్ బాలిరెడ్డి వాదనలు వినిపిస్తూ... స్టాంపులు విక్రయించగా వచ్చిన సొమ్ముకు, బార్ కౌన్సిల్ చూపిస్తున్న మొత్తానికి వ్యత్యాసం ఉందన్నారు. ఈ దశలో కలగజేసుకున్న ధర్మాసనం... ‘‘స్టాంపుల విక్రయం ఎలా జరుగుతుంది? ఎవరు విక్రయిస్తార’’ని ఆరాతీసింది. బార్ కౌన్సిల్ తరఫున సీనియర్ న్యాయవాది పి. వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ... పిటిషనర్ ఆరోపణలో నిజం లేదని, రూ.100 స్టాంపు విక్రయించగా వచ్చిన సొమ్ములో రూ.86 మాత్రమే బార్ కౌన్సిల్‌కు చేరుతుందని వివరించారు. పిటిషనర్ రూ.100 బార్ కౌన్సిల్‌కు చేరుతుందని తప్పుగా లెక్కవేసి, నిధులు దుర్వినియోగం అయ్యాయనే అభిప్రాయంతో ఉన్నారని పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా పిల్ ఎలా దాఖలు చేశారని పిటిషనర్‌ను ధర్మాసనం నిలదీసింది.