Share News

ఏమడిగినా అదే జవాబు!

ABN , Publish Date - Oct 21 , 2024 | 03:53 AM

రాజధాని ప్రాంతంలో జరిగిన మెండెం మరియమ్మ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ పోలీసుల విచారణకు సహకరించడం లేదని తెలిసింది.

ఏమడిగినా అదే జవాబు!

తెలియదు.. గుర్తులేదు.. సంబంధం లేదు!!

పోలీసు విచారణలో నందిగం సురేశ్‌ సమాధానాలు

మరియమ్మ హత్య కేసులో ముగిసిన కస్టడీ..

నేడు జిల్లా జైలుకు తరలింపు.. ఏ-1గా చేర్చే అవకాశం

గుంటూరు, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): రాజధాని ప్రాంతంలో జరిగిన మెండెం మరియమ్మ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ పోలీసుల విచారణకు సహకరించడం లేదని తెలిసింది. పోలీసులు ఏమడిగినా తెలియదు.. గుర్తులేదు.. తనకు సంబంధం లేదంటూ తప్పించుకునే ధోరణిలో ఆయన సమాధానాలు చెప్పారు. 2020 డిసెంబరు 27న రాజధాని అమరావతిలోని వెలగపూడిలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మరియమ్మ అనే మహిళ హత్యకు గురైంది. ప్రస్తుతం ఆ కేసులో నిందితుడిగా జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న సురేశ్‌ను తుళ్లూరు పోలీసులు కోర్టు అనుమతితో రెండ్రోజులు కస్టడీకి తీసుకున్న విషయం విదితమే. శనివారం తొలి రోజు విచారణలో ఆయన ఆ హత్యతో తనకు సంబంధం లేదని, అప్పటి తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తనను కేసులో ఇరికించారని చెప్పారు. ఆదివారం కూడా పోలీసులు వివిధ కోణాల్లో ఆయన్ను విచారించారు. ఏ ప్రశ్న అడిగినా తనకు తెలియదని, గుర్తు లేదని, తనకు సంబంధం లేదని చెప్పారు. అసలీ కేసులో తన పేరు ఉన్న విషయం కూడా తనకు తెలియదని తెలిపారు. అలాంటప్పుడు గత సార్వత్రిక ఎన్నికల అఫడవిట్‌లో ఈ కేసును ఎలా పొందుపరిచారని పోలీసులు ప్రశ్నించగా సూటిగా సమాధానం చెప్పలేకపోయారు. అయితే ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు నమోదు చేశారని, అందువల్లే అఫడవిట్‌లో పేరు రాశానని తమ న్యాయవాది చెప్పినట్లు సురేశ్‌ పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న నాటి సీఎం జగన్‌ ఆ న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు. మరియమ్మ హత్య కేసులో ప్రస్తుతం 78వ నిందితుడిగా ఉన్న సురేశ్‌ను పోలీసులు ఏ-1 నిందితుడిగా చేర్చే అవకాశం ఉంది. న్యాయ నిపుణుల అభిప్రాయం తెలుసుకున్న తర్వాత ప్రధాన నిందితునిగా చేరుస్తారని అంటున్నారు. ఈ కేసులో మరో 41 మందిని అరెస్టు చేయాల్సి ఉంది. త్వరలోనే వారి అరెస్టుల పర్వం కూడా ప్రారంభం కానుంది. ఆదివారంతో సురేశ్‌ కస్టడీ ముగిసిన నేపథ్యంలో సోమవారం ఉదయం వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను తిరిగి గుంటూరు జిల్లా జైలుకు తరలించనున్నట్లు తుళ్లూరు సీఐ గంగా వెంకటేశ్వర్లు తెలిపారు.

Updated Date - Oct 21 , 2024 | 03:54 AM