Share News

‘ఓపీఎ్‌స’పై మరో దొంగాట!

ABN , Publish Date - Jan 09 , 2024 | 04:08 AM

అధికారం చేపట్టిన వారంలోనే సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చి.. దానిని అటకెక్కించిన జగన్‌ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యోగులను తనవైపు తిప్పుకొనేందుకు.. మరో దొంగాటకు తెరదీసింది.

‘ఓపీఎ్‌స’పై మరో దొంగాట!

అమరావతి, జనవరి 8(ఆంధ్రజ్యోతి): అధికారం చేపట్టిన వారంలోనే సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చి.. దానిని అటకెక్కించిన జగన్‌ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యోగులను తనవైపు తిప్పుకొనేందుకు.. మరో దొంగాటకు తెరదీసింది. సీపీఎస్‌ అమల్లోకి వచ్చిన 2004, సెప్టెంబరు 1వ తేదీ కంటే ముందే ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదలై, దాని ద్వారా విధుల్లో చేరిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలంటూ అన్ని శాఖలను కోరింది. ఈ తరహా ఉద్యోగులను ఓపీఎస్‌ పరిధిలోకి తీసుకొస్తామంటూ ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను ఊరిస్తోంది. కేంద్రం పరిధిలో ఉన్న ఈ తరహా ఉద్యోగులను ఓపీఎస్‌ పరిధిలోకి తీసుకొచ్చే ప్రక్రియను గత ఏడాది మార్చిలోనే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. వైసీపీ ప్రభుత్వం కేంద్రం నిర్ణయానికి అనుగుణంగా చర్యలు తీసుకోలేదు. కానీ, ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుండడంతో శాఖలు, పోస్టుల వారీగా ఎంతమంది ఉద్యోగులు సీపీఎస్‌ అమలు కంటే ముందే వెలువడిన నోటిఫికేషన్‌ ప్రకారం చేరారో వివరాలు చెప్పాలంటూ ఆర్థిక శాఖ సోమవారం అన్ని శాఖలకు మెమో జారీ చేసింది. ఏడాది నుంచి ఈ నిర్ణయాన్ని సాగదీస్తూ ఎన్నికల ముంగిట ఇప్పుడు తమను ప్రసన్నం చేసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఉద్యోగులు మండిపడుతున్నారు. గతంలోనే తమ వివరాలను ఆర్థిక శాఖకు పంపామని, మళ్లీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారో అర్థం కావడం లేదని అంటున్నారు.

Updated Date - Jan 09 , 2024 | 04:08 AM