Share News

మరో బరితెగింపు

ABN , Publish Date - Feb 27 , 2024 | 03:42 AM

ఇటీవల రాప్తాడులో ‘ఆంధ్రజ్యోతి’ ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై వైసీపీ శ్రేణులు కిరాతకంగా చేసిన దాడిని మరువకముందే చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో మరో ఘటన చోటు చేసుకుంది.

మరో బరితెగింపు

‘ఆంధ్రజ్యోతి’ ఫొటోగ్రాఫర్‌పై దాడికి వైసీపీ మూకల యత్నం

సీఎం కుప్పం సభలో జనం పారిపోతున్న ఫొటోలు తీస్తున్నారనే!

తప్పించుకుని పోలీసులను ఆశ్రయించిన శివకుమార్‌

వారి ముందే కెమేరా లాక్కుని ఫొటోలుడిలీట్‌ చేసిన వైసీపీ శ్రేణులు

చిత్తూరు, అమరావతి, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): ఇటీవల రాప్తాడులో ‘ఆంధ్రజ్యోతి’ ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై వైసీపీ శ్రేణులు కిరాతకంగా చేసిన దాడిని మరువకముందే చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో మరో ఘటన చోటు చేసుకుంది. సోమవారం శాంతిపురంలో సీఎం జగన్‌ బహిరంగ సభ ఫొటోలు తీస్తున్న చిత్తూరు ‘ఆంధ్రజ్యోతి’ ఫొటోగ్రాఫర్‌ శివకుమార్‌పై దాడికి వైసీపీ మూకలు ప్రయత్నించాయి. సభలో జగన్‌ ప్రసంగిస్తుండగా చాలామంది జనం బారికేడ్లు, పరదాలు దాటుకుని పరారవుతున్న దృశ్యాలను శివకుమార్‌ ఫొటోలు తీశారు. ముళ్ల చెట్లున్నా లెక్క చేయకుండా పలువురు ఆపసోపాలు పడి సభ నుంచి వెళ్లిపోతున్న ఫొటోలను తీస్తుండగా.. సుమారు 20 మంది వైసీపీ కార్యకర్తలు ఆయన్ను చుట్టుముట్టి దాడికి ప్రయత్నించారు. శివకుమార్‌ యుక్తితో సమీపంలో ఉన్న పోలీసుల వద్దకు వెళ్లిపోయారు. అయితే అక్కడ పోలీసుల సమక్షంలోనే వైసీపీ శ్రేణులు శివకుమార్‌ కెమెరా లాక్కుని ఫొటోలను డిలీట్‌ చేసేశారు. శివకుమార్‌ అక్కడి నుంచి తప్పించుకుని ఏదో వాహనమెక్కి సురక్షితంగా చిత్తూరు చేరుకున్నారు. ఈ ఘటనపై జర్నలిస్టు సంఘాలు మండిపడ్డాయి. మీడియాపై వైసీపీ శ్రేణులు వరుసగా చేస్తున్న దాడులు బాధాకరమని, వీటిని అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారని.. తమకు రక్షణ లేకుండా పోయిందని.. చిత్తూరు ప్రెస్‌క్లబ్‌, ఏపీడబ్ల్యూజే ఓ ప్రకటనలో పేర్కొన్నాయి.

ఓటమి భయంతోనే అరాచకాలు: అచ్చెన్న

ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌ శివపై దాడిని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో ఖండించారు. ఓటమి భయంతోనే వైసీపీ ప్రభుత్వం ఇలాంటి అరాచకాలకు తెగుబడుతోందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో పత్రికలకు, జర్నలిస్టులకు, మీడియాకు స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. ఆఖరుకు పోలీసులు కూడా అధికారపార్టీకి కొమ్ము కాస్తూ వైసీపీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారన్నారు.

Updated Date - Feb 27 , 2024 | 10:35 AM