Share News

ఉక్కుకు మరో చిక్కు!

ABN , Publish Date - Apr 14 , 2024 | 04:22 AM

‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ అన్నట్టుగా.. గంగవరం పోర్టులో కార్మికుల సమ్మె ప్రభావం విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై పడింది....

ఉక్కుకు మరో చిక్కు!

ఉత్పత్తికి అనుగుణంగా అందని బొగ్గు

గంగవరం పోర్టులో కార్మికుల సమ్మె ఫలితం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ అన్నట్టుగా.. గంగవరం పోర్టులో కార్మికుల సమ్మె ప్రభావం విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై పడింది. జీతాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ అదానీ గంగవరం పోర్టులో కార్మికులు చేపట్టిన ఆందోళన శనివారం నాలుగో రోజుకు చేరింది. పోర్టులోకి ఉద్యోగులను సైతం వెళ్లకుండా అడ్డుకోవడం వల్ల లోపల ఆపరేషన్లన్నీ స్తంభించిపోయాయి. స్టీల్‌ప్లాంటుకు అవసరమయ్యే ముడిసరుకులన్నీ గంగవరం పోర్టు ద్వారానే వస్తాయి. వీటిలో బొగ్గు ప్రధానమైనది. రోజుకు 12 వేల టన్నులు అవసరం. ఒక ర్యాక్‌ (గూడ్స్‌ రైలు)లో నాలుగు వేల టన్నుల బొగ్గు పడుతుంది. అలాంటివి రోజూ మూడు ర్యాక్‌లతో బొగ్గు వస్తేనే ఆ కోల్‌తో కోక్‌ తయారు చేసి, ఆ తరువాత అనేక దశల్లో స్టీల్‌ తయారుచేస్తారు. కోక్‌ తయారు చేయడానికి కోక్‌ ఓవెన్‌ బ్యాటరీలు ఐదు వరకు ఉన్నాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ.700 కోట్లు. ఇవి నిత్యం బొగ్గుతో మండుతూనే ఉండాలి. ఇక్కడ జరిగే పనిని ‘ఫుష్‌’లతో కొలుస్తారు. సాధారణంగా రోజుకు 320 ఫుష్‌లు తీస్తారు. అయితే, గంగవరం పోర్టులో ఆందోళన వల్ల నాలుగు రోజులుగా బొగ్గు సరఫరా నిలిచిపోయింది. శనివారం 260 పుష్‌లు మాత్రమే తీశారు. ఆదివారం మరో 260 పుష్‌లు తీయడానికి సరిపడా బొగ్గు ఉంది. సోమవారానికి బొగ్గు లేదు.

అది పోర్టు నుంచి రావలసిందే

ఆస్ట్రేలియా నుంచి రెండు నౌకలతో 1.5 లక్షల టన్నుల బొగ్గును స్టీల్‌ప్లాంటు తెప్పించుకుంది. ఆ రెండు నౌకలు పోర్టులోకి వచ్చి ఉండిపోయాయి. సరుకు దిగుమతి చేసేవారు లేరు. మరో 30 వేల టన్నుల బొగ్గు పోర్టు గోదాములో ఉంది. దానిని పంపాలన్నా పోర్టులో కార్మికులు అవసరం. పోర్టు నుంచి నేరుగా స్టీల్‌ప్లాంటుకు కన్వెయర్‌ లైన్‌ ఉంది. దాని ద్వారా సరుకులు పంపుతుంటారు. ఇప్పుడు అది కూడా ఆగిపోయింది. దీంతో అందుబాటులో ఉన్న బొగ్గును కూడా తీసుకోలేని పరిస్థితి. సోమవారం ఉదయానికి పరిస్థితి మెరుగుపడకపోతే స్టీల్‌ప్లాంటులో కోక్‌ ఓవెన్‌లు మూసేయాల్సి వస్తుంది. అలా చేస్తే ఓవెన్లకు భారీ నష్టం కలుగుతుంది. మళ్లీ వాటిని హీట్‌ చేసి ఉపయోగంలోకి తేవాలంటే సమయంతో పాటు ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది.

కింకర్తవ్యం..

స్టీల్‌ప్లాంటుకు తక్షణం బొగ్గు అందించడానికి రెండు మార్గాలున్నాయి. అందులో మొదటిది పోర్టుకు వెనుక వైపు రెండు గేట్లు ఉన్నాయి. అందులో ఒకటి స్టీల్‌ప్లాంటు వైపు ఉంది. ప్రస్తుతం గోదాములో ఉన్న 30 టన్నుల బొగ్గును లారీల ద్వారా ఆ గేటు ద్వారా ప్లాంటులోకి పంపించవచ్చు. రెండో అవకాశమూ ఉంది. సెయిల్‌, ఎన్‌ఎండీసీలకు చెందిన బొగ్గు నౌకలు గంగవరం పోర్టుకు రాగా వాటిని విశాఖపట్నం పోర్టుకు తరలించారు. వారికి ఆ పోర్టుతో వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. ఆ రెండు కేంద్ర ప్రభుత్వ సంస్థలే కాబట్టి, వారి దగ్గర బొగ్గు ఉన్నందున విశాఖపట్నం పోర్టు నుంచి రోడ్డు మార్గాన స్టీల్‌ప్లాంటుకు సరఫరా చేస్తే కోక్‌ ఓవెన్లను ఆపకుండా నడిపే అవకాశం ఉంది.

పోర్టుదే బాధ్యత

దిగుమతి చేసుకున్న సరుకును ప్లాంటులోకి తెచ్చి ఇవ్వాలని పోర్టుతో స్టీల్‌ యాజమాన్యం ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు దానిని అదానీ యాజమాన్యం చేయలేకపోతోంది. ఈ కారణంగా ఎటువంటి నష్టం జరిగినా దానిని పోర్టు యాజమాన్యమే భరించాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

గంగవరం పోర్టులో ఇదీ పరిస్థితి!

కార్మికుల ఆందోళన ఫలితంగా ఏ ఒక్క నౌకా పోర్టులోకి రావడం లేదు. అన్నీ ఆన్‌ రోడ్స్‌ (పోర్టుకు సమీపాన సముద్రం)లో ఉండిపోతున్నాయి. బెర్తుల వద్దకు వచ్చిన నౌకల నుంచి సరుకును అన్‌లోడింగ్‌ చేసేవారు లేరు. బెర్తుల వద్ద, గోదాముల్లో ఉన్న సరుకులను ర్యాక్‌లకు లోడింగ్‌ చేయడం వీలు కావడం లేదు. అన్నీ ఎక్కడివక్కడే ఆగిపోయాయి. ఆందోళన చేస్తున్న కార్మికులతో పోర్టు యాజమాన్యం చర్చలు బెడిసి కొడుతున్నాయి. జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో శనివారం చర్చలు జరిగినా ప్రయోజనం లేకపోయింది.

Updated Date - Apr 14 , 2024 | 06:55 AM