Share News

AP News: కీలక ఫైళ్లు, సమాచారం గల్లంతు.. అక్రమాల్లో కొత్త కోణం

ABN , Publish Date - Feb 12 , 2024 | 02:57 AM

ఉమ్మడి కడప జిల్లా మంగంపేటలో ఏపీఎండీసీకి బెరైటీస్‌ నిల్వలున్నాయి. కొన్నేళ్లుగా అక్కడ మైనింగ్‌ జరుగుతోంది.

AP News: కీలక ఫైళ్లు, సమాచారం గల్లంతు.. అక్రమాల్లో కొత్త కోణం

కీలక ఫైళ్లు, సమాచారం గల్లంతు

డేటా, ఆన్‌లైన్‌ రికార్డుల్లేవ్‌

బినామీల లావాదేవీలు

బయటకు రాకుండా అన్నీ మాయం

మంగంపేట అక్రమాల్లో కొత్త కోణం

విజిలెన్స్‌ పరిశీలనలో వెలుగులోకి

దర్యాప్తు సంస్థకు సహకరించని ఎండీసీ

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మంగంపేట బెరైటీస్‌ అక్రమాల్లో కొత్త కోణం వెలుగు చూసింది. కొందరు అధికారులు, అక్రమార్కులు, వారి బినామీ కంపెనీల లావాదేవీలు బయటకు రాకుండా కీలకమైన ఫైళ్లు గల్లంతు చేసినట్లు తెలిసింది. మైన్‌ ఏరియా నుంచి స్టాక్‌ యార్డ్‌కు, అక్కడినుంచి కంపెనీలకు వెళ్లిన బెరైటీస్‌ వివరాలున్న ఫైళ్లను మాయం చేయడంతో పాటు కంప్యూటర్‌లో డేటాను కూడా తొలగించినట్లు సమాచారం. సీసీ కెమెరాలు ఆపేసి మరీ డొంకదారిలో బెరైటీ్‌సను తరలించుకుపోయిన విషయం ఇంతకుముందే వెలుగు చూడగా, ఇప్పుడు ఏకంగా కొన్నేళ్ల అమ్మకాలకు సంబంధించిన ఫైళ్లు, ఆన్‌లైన్‌ డేటాను గల్లంతు చేసినట్లు చెబుతున్నారు. ఈ బాగోతంపై ఇప్పటికే విజిలెన్స్‌ విచారణ సాగుతోంది. మంగంపేటలో కీలకమైన ఫైళ్లు కావాలని విజిలెన్స్‌ అధికారి లేఖ రాయగా, కొన్ని అందుబాటులో లేవని ఏపీఎండీసీ బదులిచ్చినట్లు తెలిసింది. నిజానికి ఆ ఫైళ్లు ఉంటేనే సంస్థకు ఎంత నష్టం వాటిల్లిందో, అక్రమార్కులు ఎంత దోచుకున్నారో అంచనా వేయడం సాధ్యపడుతుంది. ఈ విషయం ముందుగానే పసిగట్టిన ముఠా అక్కడ పనిచేసిన ఓ అధికారి సహకారంతో అన్నింటినీ సర్దేసినట్లు సమాచారం. దీంతో అదనపు వివరాలు కావాలని విజిలెన్స్‌ కోరినట్లు తెలిసింది.

తవ్విన కొద్దీ అక్రమాలు

ఉమ్మడి కడప జిల్లా మంగంపేటలో ఏపీఎండీసీకి బెరైటీస్‌ నిల్వలున్నాయి. కొన్నేళ్లుగా అక్కడ మైనింగ్‌ జరుగుతోంది. అయితే, 2020 నుంచి 2023 వరకు మంగంపేటలో రూ.వందల కోట్ల విలువైన బెరైటీ్‌సను అక్రమంగా తరలించుకుపోయారని, ఇందులో అధికారుల పాత్ర ఉందంటూ ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై మంగంపేటలోని ఓ ఉన్నతాధికారితో పాటు మరో ఐదుగురిని సస్పెండ్‌ చేసిన విషయాన్ని ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ వ్యవహారంలో తవ్విన కొద్దీ అక్రమాలు బయటకొస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మంగంపేట బెరైటీస్‌ అక్రమాల్లో సస్పెండైనవారిపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఏపీఎండీసీ మాత్రం ఈ అక్రమాలపై విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణ చేపట్టింది. కీలకాంశాలపై నిశిత పరిశీలన చేస్తోంది. మంగంపేట బెరైటీ్‌సకు రమణను చీఫ్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌గా నియమించిన ఫైలు, ఆయన విధులు, బాధ్యతలు ఏమిటో సవివరంగా తెలపాలని, సీపీవోగా ఉన్న సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లు ఇవ్వాలని విజిలెన్స్‌ కోరింది. అయితే, ఆయన నియామక వివరాలు మాత్రమే ఇచ్చిన ఎండీసీ, మిగతా వివరాలు ఇవ్వలేకపోయిందని తెలిసింది. దీంతో రెండో దఫా విచారణ సంస్థ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. రమణను ఎందుకు సస్పెండ్‌ చేశారు? అందుకు కారణాలు ఏమిటి? దానికి సంబంధించిన ఫైళ్లు, ఇతర డేటా ఇవ్వాలని కోరింది. కానీ విజిలెన్స్‌ కోరిన కీలక సమాచారం అందుబాటులో లేదని తెలిపినట్లు తెలిసింది. అంటే, సీపీవో సస్పెన్షన్‌కు దారితీసిన పరిణామాలను వివరించే ఫైళ్లు లేవని చెప్పకనే చెప్పినట్లయిందని సీనియర్‌ అధికారులు పేర్కొంటున్నారు. శాఖాపరమైన విచారణ చేపట్టకపోవడమే ఇందుకు కారణమని తెలిసింది. ప్రత్యేకమైన ఆడిటింగ్‌ చేపడితే కొందరు పెద్దల మౌఖిక ఆదేశాలతో జరిగిన అక్రమాలన్నీ వెలుగు చూస్తాయి. కాబట్టి ఆ విచారణ జోలికే వెళ్లలేదని సమాచారం.

అమ్మకాల వివరాలేవీ?

కొందరు అధికారులు, వారి బినామీ కంపెనీలు, బంధుగణం తీసుకొచ్చిన కంపెనీలు అడ్డగోలు ఒప్పందాల పేరిట బెరైటీ్‌సను కొన్నారు. ఏ, బీ, సీ గ్రేడ్‌ బెరైటీ్‌సను స్టాక్‌యార్డ్‌ నుంచి తరలించుకుపోయారు. ఓ కంపెనీకి సీ గ్రేడ్‌ అని చెప్పి ఏ గ్రేడ్‌ కట్టబెట్టారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమకు 2020-21 నుంచి 2023 వరకు అమ్మకాల వివరాలు అందించాలని విజిలెన్స్‌ కోరింది. ‘‘బెరైటీ్‌సను అక్రమ రవాణా ఆరోపణలున్న వ్యాపారుల వివరాలతో కూడిన జాబితాను మాకు అందించాలి. వారు ఏ కంపెనీ పేరిట ఎంత మొత్తంలో బెరైటీస్‌ కొన్నారు? ఎక్కడికి తరలించారు? దీనికి సంబంధించిన డేటా, ఇతర ఫైళ్లు ఇవ్వాలి’’ అని విచారణ సంస్థ కోరింది. ఈ ప్రశ్నకు ఎండీసీ అధికారులు నీళ్లు నములుతున్నారు. ఆ లిస్టు ఇప్పటి వరకు ఇవ్వలేదని తెలిసింది. కొంత డేటా తమవద్ద అందుబాటులో లేదని పేర్కొన్నట్లు సమాచారం. డేటా అందుబాటులో లేదంటే కీలక రికార్డులను మాయం చేసి ఉంటారన్న అనుమారాలు వ్యక్తమవుతున్నాయి. గుట్టు బయటకు రాకుండా ఉండేందుకు కొంత డేటాను కంప్యూటర్ల నుంచి, ఆన్‌లైన్‌లో తొలగించినట్లు స్పష్టమవుతోంది. దీన్ని గుర్తించిన దర్యాప్తు సంస్థ... బెరైటీ్‌సను మైన్‌ ఏరియా నుంచి స్టాక్‌యార్డ్‌కు, అక్కడి నుంచి వ్యాపారులు తమ స్టాక్‌పాయింట్‌కు తరలించుకు వెళ్లే విధానం, దీనికి సంబంధించిన ఫైళ్లు, ఇతర వివరాలు తమకు సమర్పించాలని కోరింది. ‘‘ఈ మొత్తం ప్రాసె్‌సలో కొనుగోలుదారులు స్టాక్‌యార్డ్‌ నుంచి బెరైటీ్‌సను తమ స్టోర్‌పాయింట్‌కు ఎలా తీసుకెళ్లారు? ఆ వివరాలు ఏయే రికార్డుల్లో పొందుపరిచారు. ఈ ప్రక్రియలో సీపీవో నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు ఎవరి పాత్ర ఏమిటి? ఎవరు ఏ పని చేయాలి? మంగంపేట సీపీవో జాబ్‌చార్ట్‌తో పాటు ఇతర సిబ్బంది వివరాలు సమర్పించండి. అలాగే 2020-23 వరకు గ్రేడ్‌లవారీగా బెరైటీస్‌ అమ్మకాల్లో ఎవరెవరికి ఎంతెంత అమ్మారు? వాటి ధరలు, స్టాక్‌ వివరాలు, గ్రేడ్‌ల వారీగా బెరైటీ్‌సకు నిర్వహించిన వేలంలో అమ్మకం ధరలు ఏమిటి?’’ అనే సమాచారం ఇవ్వాలని విజిలెన్స్‌ కోరింది. అయితే ధరలు, స్టాక్‌ వివరాలు మాత్రం తెలిపిన ఎండీసీ అధికారులు... మైనింగ్‌ ఏరియా నుంచి డంపింగ్‌ యార్డ్‌కు వచ్చిన బెరైటీస్‌ వివరాలు, స్టాక్‌లో కొన్ని అంశాలపై సరిగ్గా నివేదించలేదని తెలిసింది. వాటికి సంబంధించిన డేటా తమవద్ద అందుబాటులో లేదని, అందువల్ల ఇవ్వలేకపోతున్నామని పేర్కొన్నట్లు సమాచారం. అయితే విచారణలో ఆ అంశాలే కీలకమని దర్యాప్తు సంస్థ భావిస్తోంది.

Updated Date - Feb 12 , 2024 | 07:30 AM