Share News

మరో కరెంటు ‘షాక్‌’!

ABN , Publish Date - Jun 03 , 2024 | 03:54 AM

గడచిన ఐదేళ్లుగా ఇంధన సర్దుబాటు, ఆదాయ వ్యయాల వ్యత్యాసం నివారణలో భాగంగా ట్రూఅప్‌ చార్జీల పేరిట విద్యుత్‌ వినియోగదారులపై మోయలేని భారం మోపారు.

మరో కరెంటు ‘షాక్‌’!

ఎక్కువ విద్యుత్‌ వాడారంటూ నోటీసులు

దరఖాస్తులో పేర్కొన్న ‘సామర్థ్యం’ మేరకే

వినియోగించాలంటున్న డిస్కమ్‌లు

పరిమితి దాటితే అదనపు డిపాజిట్‌

సగటు వినియోగం ఆధారంగా వసూలు

ఎగువ మధ్యతరగతిపై అదనపు భారం

ఇప్పటికే సర్దుబాటు, ట్రూఅప్‌ చార్జీలు

జగన్‌ పాలనలో తొమ్మిదిసార్లు మోత

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గడచిన ఐదేళ్లుగా ఇంధన సర్దుబాటు, ఆదాయ వ్యయాల వ్యత్యాసం నివారణలో భాగంగా ట్రూఅప్‌ చార్జీల పేరిట విద్యుత్‌ వినియోగదారులపై మోయలేని భారం మోపారు. ఇప్పుడు ఎక్కువగా కరెంటు వాడుతున్న వినియోగదారులపై మరో బాదుడు మొదలు పెట్టారు. కనెక్షన్‌ తీసుకునే సమయంలో ఏ మేరకు విద్యుత్‌ వాడకం అవసరం ఉంటుందో పేర్కొన్న వినియోగదారులు... అంతకంటే ఎక్కువగా వాడితే డిస్కమ్‌లు షోకాజ్‌ నోటీసులు పంపుతున్నాయి. దరఖాస్తులో పేర్కొన్న కెపాసిటీని మించి విద్యుత్‌ వాడుతున్నందున అదనపు డిపాజిట్‌ చెల్లించాలని నోటీసులు ఇస్తున్నాయి. ఈ డిపాజిట్‌ మొత్తాలు వేల రూపాయల్లో ఉండటంతో వినియోగదారులు లబోదిబో మంటున్నారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో కరెంటు చార్జీలు తొమ్మిదిసార్లు పెంచారు. ఇప్పుడు డిపాజిట్‌ల పేరిట మోయలేనంత భారం వేయడం ఏమిటంటూ సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ అదనపు లోడ్‌ భారం సగటున ఐదు వేల నుంచి పది వేల రూపాయల దాకా ఉంటోంది. దీంతో కనెక్షన్‌ ఉంచాలో, తీసివేయాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో గృహ వినియోగదారులు ఉన్నారు.


బాదుడే బాదుడు

ఇప్పటిదాకా డిస్కమ్‌లు విద్యుత్‌ కొనుగోలు, సరఫరా కోసం ఎంత ఖర్చు చేస్తే అంత మొత్తాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నాయి. దీనిని ఇంధన సర్దుబాటు చార్జీలు, ట్రూఅప్‌ చార్జీలు అంటున్నారు. 2022-23 ఏడాదికి గాను ట్రూఅప్‌ చార్జీల కింద రూ.7,200 కోట్లను వసూలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి డిస్కమ్‌లు ప్రతిపాదనలను పంపాయి. అదే విధంగా 2023-24 సంవత్సరానికి గాను రూ.10,053 కోట్లను ఇంధన సర్దుబాటు చార్జీల కింద వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు ప్రతిపాదనలు పంపాయి. ఈ రెండు ప్రతిపాదనలపై ఈఆర్‌సీ నిర్ణయం తీసుకున్న వెంటనే నెలవారీగా వినియోగదారులపై ఎంత భారం వేయాలో డిస్కమ్‌లు నిర్ణయిస్తాయి. ఈ భారం భరించలేమని వినియోగదారులు భయపడుతుంటే.. ఇప్పుడు ఎగువ మధ్యతరగతి వర్గాలపై కొత్త బాదుడు బాదుతున్నారు. సాధారణంగా విద్యుత్‌ వినియోగాన్ని బట్టి బిల్లులు వస్తాయి. వాడిన కరెంటుకు బిల్లు చెల్లించేస్తున్నామని ఎడాపెడా కాల్చేస్తే డిస్కమ్‌లు ఒప్పుకోవు. విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకునే సమయంలో పేర్కొన్న సామర్థ్యం కంటే వినియోగం పెరిగితే అపరాథ రుసుం వసూలు చేస్తాయి. సామర్థ్యం కంటే ఎక్కువగా వాడిన విద్యుత్‌కు ముందస్తు డిపాజిట్‌ను కూడా వసూలు చేస్తాయి.

200 యూనిట్లు దాటితే...

నెలవారీ విద్యుత్‌ వినియోగం 200 యూనిట్లకు మించి ఉన్న గృహ విద్యుత్‌ వినియోగదారులు కనెక్షన్‌ కోసం చేసుకున్న దరఖాస్తులను డిస్కమ్‌లు పరిశీలిస్తున్నాయి. ఏడాది పాటు వినియోగదారుడు వాడిన కరెంటు సగటును డిస్కమ్‌లు లెక్కలోకి తీసుకుంటున్నాయి. దరఖాస్తు సమయంలో పేర్కొన్న ఈ వినియోగం కంటే ఎక్కువగా ఉంటే డిపాజిట్‌ చెల్లించాలంటూ డిస్కమ్‌లు నోటీసులు పంపుతున్నాయి. అదనపు లోడ్‌కు అదనపు డిపాజిట్‌ చెల్లించాల్సిందేనంటూ చెబుతున్నాయి. నోటీసుల్లో ఏమైనా తప్పులుంటే తమను సంప్రదించాలని డిస్కమ్‌లు సూచిస్తున్నాయి. డిపాజిట్‌ వేలల్లో ఉండటంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. ముందస్తు హెచ్చరికలు లేకుండా డిపాజిట్‌ చెల్లించాలంటూ నోటీసులు పంపడమేంటని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దమొత్తంలో డిపాజిట్లు సేకరించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

Updated Date - Jun 03 , 2024 | 03:54 AM