వర్రా రవీంద్రారెడ్డిపై మరో కేసు
ABN , Publish Date - Nov 14 , 2024 | 04:39 AM
వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి అనుచరుడు వర్రా రవీంద్రారెడ్డిపై మరో కేసు నమోదైంది.
పవన్ కల్యాణ్‌పై అసభ్యకరంగా పోస్టులు
తొలగించమని అడిగితే కులం పేరుతో దూషణ
డబ్బులు ఇవ్వకపోతే చంపుతామని బెదిరింపులు
పులివెందుల, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి అనుచరుడు వర్రా రవీంద్రారెడ్డిపై మరో కేసు నమోదైంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై వర్రా అసభ్యకరంగా పోస్టులు పెట్టారని, వాటిని తొలగించమని అడిగితే కులం పేరుతో దూషించారని, అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే చంపుతామని బెదిరించారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. కడప జిల్లా సిద్దవటం మండలం ఎస్.రాజంపేట గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త వెంకటాద్రి 8న నందలూరు పోలీసుస్టేషన్‌లో వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి, సిరిగిరెడ్డి అర్జున్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఆ కేసును బుధవారం పులివెందులకు బదిలీ చేశారు.
రిమ్స్‌లో వర్రాకు వైద్య పరీక్షలు
సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వర్రా రవీంద్రారెడ్డిని రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఆయనకు రిమ్స్‌లో వైద్య పరీక్షలకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో బుధవారం సాయంత్రం 4 గంటలకు భారీ బందోబస్తుతో రిమ్స్‌కు తరలించారు. రాత్రి 7 గంటల వరకు వర్రాకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. జనరల్, ఆర్థో పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. పరీక్షల అనంతరం తిరిగి జైలుకు తరలించారు. రిమ్స్ వద్దకు వర్రా రవీంద్రారెడ్డి భార్య, తండ్రి, సోదరుడు వచ్చినప్పటికీ వారిని పోలీసులు అనుమతించలేదు.